VIJAYANAGARAM

విజయనగరం జిల్లా చరిత్ర….

కట్టుబాట్లు, మృదు స్వభావానికి పెట్టింది పేరు విజయనగరం జిల్లా.  ఈ ప్రాంతంలో మౌర్య, బౌద్ధ, జైన మతాలు ఎక్కువగా  ప్రాభవం పొందాయి. సాలిహుండం మొదలుకొని జామి  వరకూ బౌద్ధులు,  జైనులు ఉండే వారని చారిత్రక ఆధారాలను బట్టి  తెలుస్తోంది.  క్రీ.పూ. 4వ శతాబ్దం నాటికే  గోదావరి, మహానదుల మధ్య భాగాన్ని అంటే  కటక్ మొదలు పిఠాపురం వరకు  విస్తరించి  ఉన్న ప్రాంతాన్ని కళింగదేశంగా పేర్కొన్నారు.. కళింగ దేశంలో ఏనుగులు ఎక్కువని అందుకే ఇక్కడి రాజులకి “గజపతులు” అని పేరు వచ్చినట్టు కూడా ప్రచారంలో ఉంది.  కళింగ  భూములు మంచి సారవంతమయినవని, అక్కడి ప్రజలు న్యాయం తప్పరని పర్యాటకులు కితబులివ్వడం ఇక్కడి ప్రజల గొప్పతనం. సాంఘిక కట్టుబాట్లు, మనసులో జాలి, గట్టి కుటుంబ వ్యవస్థ కలిగి ఉండడం ఈ జిల్లా వాసుల ప్రత్యేకం. 1979వ సంవత్సరం జూన్ 1న  విజయనగరం జిల్లాగా ఏర్పడింది.

విభజన  తర్వాత…

జిల్లాలో పునర్వ్యవస్థీకరణకు ముందు 2 రెవెన్యూ డివిజన్లు, 34 మండలాలు, 1552 రెవెన్యూ గ్రామాలు ఉండేవి. ప్రభుత్వం 2022వ సంవత్సరం లో జరిపిన  జిల్లాల పునర్వ్యవస్థీకరణలో పార్వతీపురం రెవెన్యూ డివిజనులోని 11 మండలాలు కొత్తగా ఏర్పడిన  పార్వతీపురం మన్యం జిల్లాలో చేరాయి. అలాగే శ్రీకాకుళం జిల్లా, పాలకొండ రెవెన్యూ డివిజను లోని 4 మండలాలు ఈ జిల్లాలో చేరాయి. ఉమ్మడి జిల్లా జనాభా సుమారు 25 లక్షల వరకు ఉంటుంది. విజయనగరం, అరకు పార్లమెంట్ నియోజక వర్గాలతో పాటు 8 శాసనసభ స్థానాలు ఉన్నాయి.