“బతుకమ్మ తల్లి”…ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శతాబ్దాలుగా బతుకమ్మ పండుగ, పెత్తరామవాస్య గురించి తెలియని వారు ఉండరు. కానీ, దశాబ్ద కాలంగా బతుకమ్మ పండుగ ఒక్క తెలంగాణ రాష్ట్రానికే సొంతమైంది. పొరుగు రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్ కి పెదవి విరుపై, దుబాయ్ వంటి దేశాల్లో షేక్ సాహెబ్ ల బురుజులకు అలంకరణలు తెచ్చి పెట్టింది. ఆస్ట్రేలియాలో అమోఘంగా పూజలు అందుకుంది. నిజంగా “అమ్మ” ఖ్యాతి అభినందనీయమే. అందుకు కోటి రీతుల పూలతో అలంకరించి కొనియడాల్సిందే. ఇదంతా తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన హడావిడి. తెలుగు ప్రజల పండుగలను వాటాలుగా చేసిన ఘనత. సంక్రాంతి అంటే ఆంధ్రా పండుగగా, దసరా అంటే తమ సొంత పండుగగా విభజించిన వైనం కేసీఆర్, ఆయన అనుయాయులకు దక్కింది. అందులో భాగంగానే పవిత్రమైన, ఆంధ్రా, తెలంగాణలో చారిత్రక ములాలున్న బతుకమ్మ పండుగను సైతం ఖమ్మం, నల్గొండ జిల్లాల సరిహద్దుల వరకు పొలిమేర ఏర్పాటు చేసిన చిత్రమైన పరిస్థితి నెలకొంది.
గత పదేళ్లుగా ఎంగిలి పుల రోజు నుంచి సద్దుల రోజు వరకు వాడవాడలా బతుకమ్మలు సందడి చేసేవి. కోట్ల రూపాయల వ్యయంతో మహిళలకు చీరల పంపిణీ జోరుగా సాగేది. భారాస ప్రభుత్వం కేసీఆర్ కుమార్తె కవిత నేతృత్వంలో పూర్తీ స్థాయి అధికారికంగా ఈ ఉత్సవాలు జరిగేవి. బతుకమ్మ ప్రజలకు ఏమో గానీ భారాసకి మాత్రమే సొంతమనే విధంగా రాష్ట్రంలోనే కాదు దేశ, విదేశాల్లోనూ హోరెత్తించే వారు. కానీ, ఈ సారి భారాస శ్రేణులు గానీ, కవిత గానీ బతుకమ్మ తల్లిని పట్టించుకున్న దాఖలాలు లేవు. బతుకమ్మ నమ్ముకున్న కవితమ్మ జైలు నుంచి బెయిల్ పై రావడంతో బతుకమ్మకు ఏ లోటూ రాకుండా ఉత్సవాలు జరుగుతాయని చాలా మంది ఆశించారు. పండుగ రోజు మొదలుకు ఒకరోజు ముందు ఆమె అనారోగ్యానికి గురి కావడంతో భారాస మహిళా శ్రేణులు ఒక్కసారిగా నిరాశలో పడ్డాయి. ప్రతీ ఏటా కవిత ఆధ్వర్యంలో నగరం నడిబొడ్డున అంగరంగ వైభవంగా డప్పు దళాలు, లేజర్ షోలతో కన్నుల పండుగగా జరిగిన ఉత్సవాలను తలపించుకున్నంటున్నారు.
అంతేకాదు, దుబాయ్ లోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన బుర్జు ఖలీఫా భవనాన్ని సైతం లేజర్ లైట్లతో బతుకమ్మ మాదిరిగా చూపడం కూడా మరవలేని ఘట్టం. ఈ సారి ప్రభుత్వం మారినా గానీ కవిత ఆధ్వర్యంలో బతుకమ్మకు ఏ లోటూ రాదని మహిళలు ఊహించారు. ఆశించారు కూడా. కానీ, పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పై వస్తున్న ఆరోపణలు, ఇంటలిజెన్స్ వ్యవహారం, హైడ్రా తదితర అంశాలపై గళం విప్పుతున్న భారాస నేతలు బతుకమ్మ పండుగ విషయాన్ని విస్మరించడం విమర్శలకు తెర లేపింది. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం భాద్యతగా బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించింది.