WEST GODAVARI - EAGLE NEWS

WEST GODAVARI

పశ్చిమ గోదావరి జిల్లా చరిత్ర

పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతం అశోకుని సామ్రాజ్యంలోనూ భాగంగా ఉండేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అంతేగాక, 1వ శతాబ్దం నుంచి  3వ శతాబ్దం వరకు ఇది కూడా శాతవాహనుల పాలనలో ఉండేది. 350 ప్రాంతంలో సముద్ర గుప్తుడు ఈ ప్రాంతంపై దండెత్తాడు.  కాకతీయ వంశ రాణి రుద్రమదేవి నిరవద్యపురము అంటే, నేటి నిడదవోలు   రాజధానిగా పాలించిన చాళుక్యు రాజుల ఇంటి కోడలు కావడం విశేషం. బ్రిటిష్ కాలంలో మచిలీపట్నం కేంద్రంగా ఈ ప్రాంత పాలన సాగింది.  1794 సంవత్సరంలో  రాజమండ్రి, కాకినాడల వద్ద కలెక్టర్లు నియమితులయ్యారు.  1859 సంవత్సరంలో  కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజన చేశారు. 1904 సంవత్సరంలో  ఏలూరు, యర్నగూడెం, తణుకు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. 1925 సంవత్సరంలో  కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనాభా సుమారు 38 లక్షలు. 70 శతం మంది ప్రజలు వ్యవసాయం పైనే జీవిస్తున్నారు. 1980 వ సంవత్సరం నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు లక్షన్నర  ఎకరాల్లో చేపల సాగు జరిగింది.ఆక్వా సాగులో ఈ ప్రాంతం విప్లవాత్మక మార్పు తెచ్చింది. తణుకు లోని  ఆంధ్రా సుగర్స్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ , అక్కమాంబ టెక్స్ టైల్స్ వంటి పరిశ్రమలు చెప్పుకోదగ్గవి. విప్లవయోదుడు అల్లూరి సీతారామరాజు, పారిశ్రామికవేత్త  ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్, నటుడు చిరంజీవి, క్రికెటర్ వెంకటపతి రాజు వంటి ప్రముఖులు ఈ జిల్లానుంచి వచ్చినవారే.

విభజన తర్వాత…

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2022 లో జరిగిన జిల్లాల పునర్విభజనలో ఈ జిల్లా ఉత్తర భాగంలో గల ప్రాంతాన్ని ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లలో కలిపారు. నర్సాపురం లోక్ సభ నియోజక వర్గంతో పాటు,ఉండి, తణుకు, ఆచంట, నర్సాపురం, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి.