రాజకీయ లబ్ధి కోసం కొత్తగా జడలు విప్పుకుంటున్న “సనాతన ధర్మ” నినాదం దారి తప్పుతోంది. దేశం లోని ప్రతీ హిందువులో అంతర్గతంగా దాగి ఉన్న ఈ ధర్మ సిద్ధాంతాన్ని కొత్త కోణంలో ప్రేరేపించి పబ్బం గడుపు కోవడానికి కొన్ని శక్తులు వ్యూహ రచన చేస్తున్నాయి. దీని కోసం “ఆధునిక” సమాజాన్ని కాస్తా “ఆటవిక” సమాజంగా వెనక్కి లాగే కుతంత్రాలు ఊపందుకున్నాయి. కొందరు అధికారమే లక్ష్యంగా “ధర్మం” ముసుగులో మున్నెన్నడూ లేని విధంగా దిగంబరులను జనం మధ్యకు పురిగొల్పే దుస్సాహసానికి ఒదిగడుతున్నారు. నైతిక విలువలు లేని కొన్ని సామాజిక మాధ్యమాలు తమ ఉనికి చాటుకోవడానికి, ప్రచారం పొందడానికి “మానసిక” వికలాంగులను సైతం మార్కెటింగ్ కు వాడుకోవడం నిజంగా దౌర్భాగ్యం. తెలుగు రాష్ట్రాల్లో కొద్ది కాలంగా రోడ్ల పై కనిపిస్తున్న “మహిళా అఘోరీ” వ్యవహారమే ఒక ఉదాహరణ. సనాతన ధర్మం పేరుతో ఒంటి పై నూలు పోగు లేకుండా జనం మధ్య సంచరిస్తున్న ఆ “అఘోరీ” ప్రభుత్వాలకు, అధికారులకు తలనొప్పిగా మారుతోంది.
సనాతన ధర్మ సాధన, పరిరక్షణ కోసం నడుం బిగించి, నలుగురిని పోగు చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయన్న సంగతి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. కానీ, దాని కోసం బట్టలు విప్పుకొని రోడ్డుకెక్కడం అంతుపట్టని వ్యవహారం. అయినా, అఘోరాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాశీ పరిసరాల్లోని జన సంచారం లేని కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తారు. సామాన్య జనంతో సంబంధాలు లేకుండా అక్కడి అఘోరాలు విభిన్న కోరికలు, ధోరణులలో శివ ధ్యానం చేస్తుంటారు. అక్కడ వారి జీవన విధానమే వేరుగా ఉంటుంది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో మహిళా అఘోరీగా అవతారం వేసుకొని జనం మధ్యలో విచ్చల విడిగా సంచరించడం శాంతి భద్రతల సమస్యకు దారితీస్తోంది. ఈ అఘోరి సంచారాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ వద్ద నిర్ధిష్టమైన నిబంధనలు లేవా, ఉన్నా గానీ చర్యలు తీసుకోలేక పోతున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఇదే అదునుగా చేసుకొని మహిళా అఘోరీ పోలీసు అధికారులతో అడ్డగోలుగా వాదనలకు దిగుతోంది. తనను అడ్డుకుంటే ఆత్మహత్యకు పాల్పడుతా అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం విపరీత ధోరణికి అద్దం పడుతోందని హేతువాద నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఘటన పై కూడా పోలీసులు కేసు నమోదు దాఖలాలు లేవు. తాజాగా వరంగల్ జిల్లాలోని మామునూరు స్మశాన వాటికలోకి కారుతో సహా చొచ్చుకు వెళ్లి, దిగంబరంగా చేసిన హడావుడితో అధికారులు తలపట్టుకున్నారు. అంతేకాదు, ఆమెకు వివిధ దేవాలయాల్లో వీఐపీ హోదాలో దర్శనం, పూజలకు అనుమతి ఇవ్వడంతో పరిస్థితి చేజారి పోతందని పలువురు పోలీసు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీన్నే అలుసుగా తీసుకొని తనను ఎవరూ అడ్డుకోలేరన్న ధీమాతో ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై సైతం వ్యాఖ్యలు చేస్తోందని పేర్కొంటున్నారు. సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ ఇంకా తనతో మాట్లాడలేదని, రేవంత్ రెడ్డికి సమస్యలు ఉన్నాయని వ్యాఖ్యానించడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు ఎదైనా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకొని పోరాటం చేస్తే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే, 1970 -1980 దశకంలో ఇదే తరహాలో ఉమ్మడి రాష్ట్రంలో హడావిడి చేసిన దిగంబర సన్యాసిని “మంగమ్మ అవ్వ” వ్యవహారాన్ని కొందరు నిపుణులు గుర్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా తుగ్గిలికి చెందిన యశోదమ్మ అనే మహిళ తన వద్ద అతీత శక్తులు ఉన్నట్టు చెప్పుకొని మంగమ్మ అవ్వగా ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకింది. అందులోనే ఆమె దిగంబరంగా పూజలు చేస్తూ భక్తులకు దర్శనం ఇచ్చేది. అప్పట్లో ఆమె పొడవాటి కురులతో కనీసం చాతి కనిపించకుండా జాగ్రత్త పడేవారు. ప్రస్తుతం “మహిళా అఘోరీ”పై పోలీసులు గానీ, ఇతర అధికార యంత్రాంగం గానీ చర్యలు చేపట్టకపోతే “మంగమ్మ అవ్వ” కేసు సుప్రీం కోర్టు వరకు ఎలా వెళ్లిందో సమీక్షించుకోవాలసిన పరిస్థితికి దారి తీసే ప్రమాదం ఉంది. సామాజిక మాధ్యమాలు సైతం ఇలాంటి సున్నిత వ్యవహారాల్లో బాధ్యతగా, నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు సామాజిక, ఆధ్యాత్మిక నిపుణులు హేతువాద నేతలు సలహా ఇస్తున్నారు.