CHITTOR - EAGLE NEWS

CHITTOR

చిత్తూరు జిల్లా చరిత్ర

శ్రీ వేంకటేశుని ఏడు కొండల చిత్ర రూపం చిత్తూరు జిల్లా. శతాబ్దాల చరిత్ర, భక్తి పారవశ్యపు నిలయం ఈ జిల్లా. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారిల వరకు వెళ్లి, రావాలంటే పర్యాటకులు తప్పని సరి ఏడుకొండ సామి పదాలు తాకల్సిందే. శేషాచలపు అరణ్య వనంలో కొలువుదీరిన ముగ్ధ మనోహరుని నెలవు తిరుమల చిత్తూరు జిల్లాలో చిత్రమే. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఈ ఊరి పేరు “చిట్ర ఊర్” అని తమిళంలో అనే వారు. అంటే ఆ భాషలో “చిట్ర” అంటే చిన్నది అనీ, “ఊర్” అంటే  గ్రామం అని అర్ధం. అదే పేరు క్రమంగా  చిత్తూరుగా  మారినట్టు చరిత్రకారులు చెబుతుంటారు. మద్రాసు ప్రొవిన్స్ లో భాగంగా ఉండే ఈ ప్రాంతం 1911 లో జిల్లాగా ఏర్పడి, 1953లో  ఆంధ్ర రాష్ట్రంలో  అంతర్భాగమైంది. ఉత్తర ఆర్కాట్లో తెలుగు భాష మాట్లాడే కొన్ని తాలూకాలు, కడప జిల్లా  నుంచి మరికొన్ని,నెల్లూరు  జిల్లా నుంచి ఇంకొన్ని తాలూకాలు కలిపి జిల్లాగా  ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాగా  ఏర్పడి  2011 ఏప్రిల్ 1వ తేదీ నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది.

దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన  చోళులు, పాండ్యులు, పల్లవులు  ఈ ప్రాంతాన్ని  తమ ఆధీనంలో ఉంచుకున్నారు.  విజయనగర రాజుల కాలంలో చంద్రగిరి  కేవలం ప్రధాన కేంద్రంగానే కాక రాజధానిగా కూడా వర్ధిల్లింది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత పాలెగాళ్ళ ఆధీనంలోకి వెళ్ళింది.   ఆర్కాటు నవాబు ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించినప్పుడు మైసూరు నవాబులైన హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ లు కూడా చిత్తూరును తమ వశం చేసుకోవడానికి విశ్వా ప్రయత్నం చేశారు. హైదరాలీ  గుర్రపు కొండ నవాబు కుమార్తె అయిన ఫకృన్నిసాను వివాహం చేసుకున్నాడు. వారికి జన్మించిన వాడే టిప్పు సుల్తాన్. 12 వ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు ఈ జిల్లా లోని  శ్రీ కాళహస్తీలో  అలయాన్ని నిర్మించాడు. జిడ్డు కృష్ణమూర్తి, మాడభూషి అనంత శయన అయ్యర్ , చిత్తూరు నాగయ్య, రమాప్రభ, దేవిక, నారా చంద్ర బాబు నాయుడు, నల్లరి కిరణ్ కుమార్ రెడ్డిలు ఈ ప్రాంతం నుంచి వచ్చిన వారే. ఈ జిల్లా పేరు చెప్పగానే గుర్తు వచ్చేవి ఒకటి ప్రఖ్యాత “జల్లికట్టు “ ఉత్సవం,  రెండోది శేచాచల అడవుల్లోని ప్రపంచ ప్రఖ్యాత “ఎర్ర చందనం”. ఇక ఏడు కొండల్లో కొలువు దీరిన వేంకటేశుడు జగత్ విదితమే. అమరరాజా బ్యాటరీ కంపనీ, న్యూట్రిన్ చాక్ లెట్ కంపనీ, స్పాంజ్ ఐరన్, జైన్ ఇరిగేషన్, లాంకో ఇండస్ట్రీ, ఈ జిల్లాలో గల ప్రధాన పరిశ్రమలు.

విభజన తర్వాత…

ఉమ్మడి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజిక వర్గాలు, చిత్తూరు, తిరుపతి  రెండు లోక్ సభ నియోజిక వర్గాలు ఉండేవి. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 2022లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా కొన్ని మండలాలను విదదీసి కొత్తగా  తిరుపతి, అన్నమయ్య జిల్లాలను ఏర్పాటు చేశారు.