నిజామాబాద్ జిల్లా చరిత్ర
నిజామాబాద్ ను పూర్వం ఇందూరుగా వ్యవహరించేవారు. 8 శతాబ్దంలో ఇంద్ర వల్లభ పాంత్య వర్ష ఇంద్ర సోముడు అనే రాజు పేర ఇందూరుగా పిలిచే వారని చరిత్రకారులు చెబుతుంటారు.అంతకంటే ముందు పేరు ఇంద్ర పురి. 20వ శతాబ్దం మొదట్లోనూ ఇందూరుగానే పిలిచే వారు. 1901వ సంవత్సరములో ఈ ప్రాంతములో నుండి రైలు మార్గం ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడి ప్రాంతానికి అప్పటి రాజు నిజాం ఉల్ ముల్క్ పేరు పెట్టి నిజామాబాద్ గా మార్చడం జరిగింది. ప్రాచీన సంస్థానాల్లో పేరెన్నికగన్నది దోమకొండ సంస్థానం. పాకనాటి రెడ్డ శాఖకు చెందిన కామినేని వంశస్థులు ఈ సంస్థానాధీశులు.
1636వ సంవత్సరంలో అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షా కామారెడ్డికి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు వారి వంశీయుల పేర్లయిన సదాశివనగర్, పద్మాజివాడి, తుక్కోజివాడి, తిమ్మోజివాడి, కామారెడ్డి, సంగారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డిల మీద వెలిశాయి. సంస్థానంలోని కట్టడాలు శిల్పకళా సంపదను సాక్షాత్కరిస్తాయి. రాజ భవనాలు, అశ్వగజ శాలలు, కుడ్యాలు, బురుజులు, కోట, అద్దాల బంగళా పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. డిచ్ పల్లిలో 2006 వ సంవత్సరంలో తెలంగాణ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
విభజన తర్వాత…
తెలంగాణా రాష్ట్రంగా ఏర్పడిన తరువాత 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం పునర్య్వస్థీకరణ చేపట్టింది. అందులో భాగంగా నిజమాబాదు జిల్లా పరిధిలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 36 పాత మండలాల నుండి 17 మండలాలు విడగొట్టి కొత్తగా కామారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు.