హోమ్ శాఖ మంత్రి ఐయితే ఏం చేస్తారు? జగన్ మీద ఉన్న కేసుల పై పోరాడుతారా? చంద్రబాబుపై ఉన్న కేసులను కొట్టి వేస్తారా? తమిళనాడులో మీ పై ఉన్న కేసు నుంచి బయటికి వస్తారా? వివేకానంద హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ ని అరెస్టు చేస్తారా? రోజా పై కక్ష సాధిస్తారా? కొద్ది రోజులుగా అధికమైన అత్యాచారాలను దగ్గరుండి అదుపు చేస్తారా? మీ ఆలోచనలో అంతరార్ధం ఏమిటి? ఒక దళిత మహిళ ప్రాముఖ్యమైన స్థానంలో ఉండడం మీకు ఇష్టం లేదా? ఇవి మొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంద్రప్రదేశ్ హోం మంత్రి పదవి పై చేసిన వ్యాఖ్యల పట్ల వెల్లువెత్తుతున్న ప్రశ్నలు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో ఉన్న దళిత జాతి మహిళా మంత్రి పట్ల పవన్ చేసిన అనాలోచిత వ్యాఖ్యలు అనేక రకాల విమర్శలకు తెర లేపాయి.
సాధారణంగా ఒక మంత్రి వర్గంలో ఉన్న వ్యక్తి మరో మంత్రిత్వ శాఖ పై గానీ, సాటి మంత్రి పై గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయరు. చేయ కూడదు కూడా. అలాంటిది ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ “తాను హోమ్ మంత్రి ఆయితే వేరుగా ఉంటుంది” అనడం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబుపై ప్రజల్లో పెరిగిన సానుభూతి, జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత మధ్య మొన్నటి ఎన్నికల్లో జనసేన సీట్లు గెలవడాన్ని తన బలంగా భావిస్తున్నట్టు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టం అవుతోంది. నటుని నుంచి నాయకునిగా మారాల్చిన పవన్ నిజ జీవితంలో ఇంకా సినిమా నటునిగా వ్యవహరించడం సమంజసం కాదని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. తనకు కేటాయించిన విశాలమైన మంత్రిత్వ శాఖను సమర్ధవంతంగా అభివృద్ది చేయడం పై పవన్ దృష్టి సారిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగు నింపే పంచాయతీ రాజ్ శాఖ పనితీరుని మెరుగు పరచాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిగా పవన్ పై ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను దళిత నేత మంద కృష్ణమాదిగ కూడా ఆక్షేపించారు.
హోమ్” ఒక్కటేనా ఇంకేమైనా..?
ఇదిలా ఉంటే, తన మంత్రిత్వ శాఖ పై నేటికీ పూర్తీ స్థాయి పట్టు సాధించలేని పవన్ పక్క మంత్రిత్వ శాఖ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కొంతమంది మంత్రులతో ఇదే విషయం గురించి చర్చించినట్టు సమాచారం అందింది. పవన్ వ్యాఖ్యలను కట్టడి చేయకపోతే ఈ రోజు హోం శాఖ మంత్రి స్థానంలో నేను ఉంటే అన్న వ్యక్తి రేపు ముఖ్యమంత్రి స్థానంలో నేను ఉంటే అని మాట్లాడే ప్రమాదం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. హోమ్ మంత్రి పదవి అంటే సినిమాలో మాదిరిగా ఇష్టానుసారంగా వ్యవహరించడం కాదనే సలహాలు కూడా వస్తున్నాయి. మిత్రపక్షంగా ఉన్నందున ఈ వ్యవహారం పై చంద్రబాబు నాయుడు పరోక్షంగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ పాలనలో గాడి తప్పిన పోలీసు వ్యవస్థను కొద్దిరోజుల్లో అదుపులోకి తీసుకువస్తామని క్లారిటీ ఇచ్చారు.