“చె గువేరా” ఆలోచనలు అంటూ జనసేనకి హైదరాబాద్ లో పురిటి నొప్పులు పోసిన పవన్ కళ్యాణ్ తన పోరాట మార్గాన్ని మార్చుకున్నారా? సంపాదన అక్కర లేదంటూ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన “తమ్ముడు” ఆలోచనా సరళి ఎందుకు మారింది. “చెగువేరా” ఎక్కడ.. సనాతన ధర్మం ఎక్కడ? పొంతన లేని అంశాలను పవన్ ఎందుకు ఎంచుకున్నారు? భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి దగ్గర కావడానికా? లేక తెలుగు దేశాన్ని కాదనే సొంత ఎజెండా ఎదైనా ఉందా? లేక మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు హవాలో సీట్లు గెలవడం ఇష్టం లేకనా? చంద్రబాబు ఆలోచనలు ఎక్కడ “చె గువేరా” పోరాటం ఎక్కడ? ఇవన్నీ ఒక్క ఆంద్రప్రదేశ్ ప్రజల్లోనే కాదు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రజలు, ఆయన అభిమానుల్లో రేగుతున్న ప్రశ్నలు, సందేహాలు.
తిరుపతి స్వామి వారి లడ్డూ ప్రసాదం పై చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలి వానగా మారుతున్న తరుణంలో ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేత మడి కట్టుకొని తన ఆధ్యాత్మిక ధోరణిలో ఉండాల్సింది పోయి ఒక్క సారిగా “సనాతన ధర్మం” అంటూ నినాదాన్ని ఎత్తుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. వాస్తవానికి ఈ నినాదం చంద్రబాబు వంటి రాజకీయ ఉద్దండునికి ఒంటపట్టదు. ఆ విషయం పవన్ కి అంతగా తెలియదనే అంశం చర్చకు దారి తీసింది. పవన్ కళ్యాణ్ ఏ రకంగా సనాతన ధర్మం పై మాట్లాడినా తెలుగు రాష్ట్రాల ప్రజలు దాన్ని భిన్న కోణాల్లో విశ్లేషిస్తున్నారు. అంతేకాదు,గతంలో చేసిన ప్రకటనలను కూడా ఆయన “ధర్మం” తో పోల్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక రాష్ట్రానికి మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ “సెక్యులర్” అనే పదాన్ని పవన్ ఎలా విస్మరిస్తున్నారనే బలమైన వాదనలకు తెర లేచింది. అందుకే స్టార్ నటులు ప్రకాష్ రాజ్, ఓ యూట్యూబ్ నటి పవన్ పై విరుసుకు పడుతున్నారు. “గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వత ఇంకో అవతారం, ఎంటీ అవాంతరం – ఎందుకీ అయోమయం” అంటూ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించడం దుమారం రేపింది.
దీనికి తోడు నువ్వు “ఆమె”ను పెళ్ళి చేసుకున్నప్పుడు “సనాతన ధర్మం” ఎక్కడికి పోయిందని ఓ యూ టూబర్ ప్రశ్నించడం సగటు వ్యక్తిని ఆలోచనల్లో పడేసింది. ఆమె మాట్లాడిన తీరు, భాష ఎలా ఉన్నా, జనంలో ఆమె పట్ల ఎలాంటి అభిప్రాయం ఉన్నా లేవనెత్తిన అంశాలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అంతేకాదు, దీక్షలో ఉన్న పవన్ చెప్పులు వేసుకొని మరీ కనిపించడం కూడా చర్చనీయాంశమైంది. బాధ్యత గల హోదాలో ఉన్న వ్యక్తి రెండు రకాల కోణాల్లో కనిపించడం సినిమా తరహాలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నాయకుడు స్థిరమైన ఆలోచనలు, ఒకే లక్ష్యం, ఒకే బాటలో వెళ్తుంటే అభిమానులు, ప్రజలు అనుసరించే అవకాశం ఉంది. కానీ, ఒకవైపు పోరాటం అంటూ “చెగువేరా” పుస్తకాన్ని చూపే వ్యక్తి, అదే చేతితో సనాతన ధర్మం పై నడవడంతో ప్రకాష్ రాజ్ పేర్కొన్నట్టు కొంత అయోమయంగానే ఉంటుంది. రాజకీయ పరిశీలకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మొదలైన చర్చలు ఎక్కడికి దారి తీస్తాయో వేచి చూడాలి.