కర్నూలు జిల్లా చరిత్ర…
తొట్టతొలి తెలుగు రాష్ట్రానికి రాజధాని “కందెన వోలు”.. అదే ఇప్పుడు మనం పిలుస్తున్న కర్నూలు.. ఎప్పుడో 11వ శతాబ్దిలో ఆలం పురంలో కట్టిన ఆలయం కోసం రాళ్లను తరలించే క్రమంలో నదిలోకి బళ్లు దిగేముందు వాటి చక్రాలకు కందెన రాయడానికి ఆపేవారట. దీని వల్ల ఈ ప్రాంతానికి కందెనవోలు అనే పేరు వచ్చిందని చరిత్రకారుల మాట. అదే రానురాను కర్నూలుగా రూపాంతరం చెందిదని ప్రచారం. 1799 లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించగా అప్పుడు ఈ జిల్లా హైదరాబాద్ నవబ్ సొంతం అయింది. అయన తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులని ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800వ సంవత్సరమలో ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు. అందుకే ఈ ప్రాంతాన్ని అప్పటి నుంచి ‘దత్త మండలం’ (సీడెడ్)గా వ్యవహరిస్తున్నారు. ఇక విజయనగర పాలకులు కర్నూలులో ఒక ఎత్తైన కట్టడాన్ని నిర్మించారు. అదే ఇప్పుడు నగర నడిబొడ్డున ఉన్న “కొండారెడ్డి బురుజు”. కర్నూలు నుండి సుమారు 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న గద్వాల కోటకు సొరంగ మార్గం ఉంది. తుంగభద్ర నది క్రింద నుండి గద్వాల కోటను అనుసంధానం చేయటం దీని ప్రత్యేకత. 17వ శతాబ్దంలో ముస్లిం ఆక్రమణదారుల నుండి తప్పించుకొనటానికి గద్వాల్ సంస్థానాదీశుడు ఈ సొరంగాన్ని ఉపయోగించేవాడని చరిత్రకారుల అభిప్రాయం. అయితే,1901వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఈ సొరంగ మార్గాన్ని మూసివేసింది. ఈ ప్రాంతాన్ని చాళిక్యులు, చోళులు, కాకతీయులు, విజయనగర రాజులూ పాలించినట్లుగా చరిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. కర్నూలులోని “కొండారెడ్డి బురుజు” అచ్యుత దేవరాయల హయంలో కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే. కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి ఇదే చోట బంధించడం వల్ల అప్పటినుంచి “కొండారెడ్డి బురుజు”గా పిలుస్తున్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, గాడిచర్ల హరి సర్వోత్తమరావు, చండ్ర పుల్లారెడ్డి , ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి ఈ జిల్లాకు చెందిన వారే.
విభజన తర్వాత..
తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇమ్మడి జిల్లాలో మార్పులు జరిగాయి. 2022వ సంవత్సరంలో జరిపిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లా లోని కొంత భాగాన్నివిదదీసి కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లలో కలిపారు.ప్రస్తుతం జిల్లా జనాభా 28 లక్షల వరకు ఉంది. ఉమ్మడి జిల్లాలో కర్నూలు, నంద్యాల పార్లమెంట్ స్థానాలతో పాటు, 8 శాసనసభ నియోజక వర్గాలు ఉండేవి.