ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటితో పాటు ప్రజల ఆలోచనల్లోనూ విప్లవాత్మక చైతన్యం కనిపిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా అధికార పక్షం, విపక్షం పనితీరును పూసగుచ్చినట్టు పరిశీలిస్తున్నారు. మనదేశం లోనే కాదు అగ్రరాజ్యం అమెరికా ప్రజలు సైతం రాజకీయాలను, వాటి నాయకుల పోకడలను క్షుణ్ణంగా గమనిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ వ్యవహారాలు, దాని నాయకులు ఎత్తుగడలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలో ఉన్నవారు అనాలోచితంగా తోక జాడిస్తే అదును చూసుకొని దాన దాన్ని కత్తిరిస్తున్నారు. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఇది నిజమే అనిపిస్తోంది. ఈ సందర్భంగా అమెరికా ప్రజలే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల చైతన్యాన్ని కూడా ఒక్కసారి సమీక్షించుకోవలసిన అవసరం ఉంది. అగ్రరాజ్యంలోనూ, తెలుగు రాష్ట్రాలలోనూ పోరాడే నేతలను జైలుకు పంపాడాన్ని జనం అంగీకరించడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై “ఈగల్ న్యూస్” అందిస్తున్న విశ్లేషనాత్మక ప్రత్యేక కథనం..
రాజకీయ నాయకులూ, కేసులు, ఎన్నికలు, గెలుపు-ఓటముల తిరుతెన్నులను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు బయట పడుతున్నాయి. ఆంధ్రా – అమెరికా ఎన్నికల ఫలితాలకు సంబంధించి విశ్లేస్తే దగ్గరి పోలికలు ఉన్నాయి. దీనికి కొన్ని ఉదాహరణలు.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో అరెస్టు అయి చంచల్ గూడ జైలుకి వెళ్ళారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో తిరుగు లేని అధిక్యతతో చంద్రబాబునాయుడు ప్రభుత్వం పై విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు.
అదేవిధంగా నిధుల కుంభకోణం అభియోగాల పై జగన్ ప్రభుత్వ టిడిపి అధినేత చంద్రబాబును గత ఏడాది అరెస్టు చేసి రాజమండ్రి జైలుకి పంపింది. మొన్న కొన్ని నెల్ల కింద అక్కడ జరిగిన ఎన్నికల్లో ఆంధ్రా ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని మట్టు పెట్టారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ఇక, తెలంగాణ విషయానికి వస్తే భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో అరెస్టు అయి జైలుకి వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డికి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పదేళ్ల కేసీఆర్ పాలనకు స్వస్తి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కాకలుతీరిన నేతలు ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి కావాలని ఆశించాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రేవంత్ వైపే మొగ్గు చూపింది. ఆయన్నే ముఖ్యమంత్రిని చేసింది.
ఇక, అమెరికా ఎన్నికల ఫలితాలు కూడా అటూఇటూగా తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను పోలి ఉండడం గమనార్హం. అక్కడ అధికార డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ బలమైన పోటీ ఇచ్చినప్పటికీ మాజీ అధ్యక్షులు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, తెలుగు రాష్ట్రాల్లో జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన జగన్, రేవంత్, చంద్రబాబుకు లభించిన ప్రజాదరణ అమెరికాలో ట్రంప్ సైతం పొందినట్టు తేలిపోతోంది. పోర్న్ స్టార్ కి డబ్బు చెల్లించారనే ఆరోపణపై ట్రంప్ ను కూడా గత ఏడాది న్యూయార్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఆయన కోర్టుకు వెళ్లిన సంఘటన విస్తృతంగా ప్రచారం అయింది. అంతేకాదు, మొన్నటి ఎన్నికల ప్రచారంలో జరిగిన కాల్పుల సంఘటన సైతం అమెరికా ప్రజల్లో ట్రంప్ పై సానుభూతి పెరిగింది. అదే ఫలితంగా కావచ్చు 113 ఏళ్ల కిందటి చరిత్రను పునరావృతం చేసి ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. దీన్నిబట్టి చూస్తే, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేధింపులకు పాల్పడే పార్టీలకు గానీ, నేతలకు గానీ ఆంధ్రా ప్రజలైన, అమెరికా వాసులైన సరైన సమాధానం చెబుతారనేది కొసమెరుపు.