ప్రకృతి పట్ల తెలంగాణ ప్రాంతానికున్న ఆరాధనకు, తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక తత్వానికి బోనాల ఉత్సవాలు నిదర్శనంగా నిలుస్తాయని , పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను, వైభవాన్ని బోనాలు జగద్వితం చేశాయని. బోనాల పండుగను పురస్కరించుకుని సురేఖ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ సృష్టి కొనసాగింపుకు మూలమైన మహిళలు సదా ఆరాధనీయులనే సందేశాన్నిస్తుందని మంత్రి అన్నారు. ప్రకృతిని తల్లిగా భావిస్తూ, బోనాలతో అమ్మవార్లకు పండుగ చేసే ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నదన్నారు. హైదరాబాద్ లో ప్రతి ఏటా కోలాహలంగా జరిగే బోనాల పండుగ గంగా జమున సంస్కృతిని ప్రతిబింబిస్తుందని మంత్రి తెలిపారు. గోల్కొండ బోనాల ఉత్సవాలకు ముస్లింలు తమవంతు సహకారం అందించడమే దీనికి తార్కాణం అని మంత్రి స్పష్టం చేశారు. ఈ యేడాది 20 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ బోనాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం సకల సంపదలతో సుభిక్షంగా వర్ధిల్లాలని మంత్రి సురేఖ ప్రార్థించారు.