ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమర్థవంతుడైన పోలీసు అధికారిగా ప్రశంశలు అందుకున్న ఐపిఎస్ అధికారి పెండ్యాల సీతా రామాంజనేయులు ఎక్కడ తప్పటడుగు వేశారు? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర నేతలకు సన్నిహితంగా ఉన్న ఆయన శత్రువుగా ఎలా మారారు? టిడిపి నేతలకు దగ్గర అని తెలిసి కూడా జగన్ మోహన్ రెడ్డి పీ.ఎస్.ఆర్. ని ఏరికోరి ఎందుకు దగ్గరకు తీశారు? చేసిన తప్పిదాల కంటే సామాజిక వర్గ వేటకు చిక్కుకున్నారా? ఇవీ పీ.ఎస్.ఆర్. అరెస్టుతో ప్రస్తుతం సీనియర్ పోలీసు అధికారులు, సామాజిక పరిశీలకులలో తలెత్తుతున్న ప్రశ్నలు. వైసిపి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పోలీసు విభాగాధిపతిగా వ్యవహరించిన ఆంజనేయులు అరెస్టు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ సరిహద్దుల్లోనూ ఆయన పనితీరును సమీక్ష చూసుకోవలసిన అవసరం ఉంది. ఆయన సేవలు సక్రమమా లేక అక్రమమా అనే ప్రస్తుత వాదనలను పక్కనపెట్టి గత ప్రభుత్వంతో ఆయన వ్యవహరించిన తీరు, అనేక మంది నేతలు పీఎస్ఆర్ తో అంటకాగిన గతాన్ని “ఈగల్ న్యూస్” తన పాఠకులకు అందించాలనే నిర్ణయమే ఈ ప్రత్యేక విశ్లేషణ.

1992 వ సంవత్సరం బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్ కి చెందిన సీతారామాంజనేయులు ఉమ్మడి తెలుగ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పని చేశారు. 1997 నుంచి 2004 వరకు ఆయన పని చేసిన ప్రతీ చోటా సంచలనాలు, వివాదాలకు తెర లేచేది. రౌడీ షీటర్లకు, కరడుగట్టిన దొంగలకు పీఎస్ఆర్ కంటే ఆయన “గన్” చూస్తేనే హడల్. ఎందుకంటే ఎన్ కౌంటర్ చేస్తారనే భయం. ఖమ్మం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఈ తరహా సంఘటనలు చోటుచేసుకున్నాయి.
ఇక, సీతారామాంజనేయులు సర్వీసులో అత్యంత జటిలమైన అంశం ఒక్కటే. ఆయన ఖమ్మం జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు 1998వ సంవత్సరంలో మర్లకుంట అనే గ్రామంలో వెలుగు చూసిన వన్య ప్రాణాల విందు బాగోతం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ విందును అప్పుడు కూడా మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించారు. ఈ విందులో నెమళ్ళు, కృష్ణ జింకలు, కుందేళ్ళు, దుప్పులు వంటి వన్య ప్రాణులను ఆహారంగా పెట్టారనేది బలమైన ఆరోపణ. ప్రముఖ నేతలు ఈ విందులో పాల్గొన్నారు. అయితే, ఆరోపణలకు సాక్ష్యంగా కొన్ని ఆధారాలు బయట పడినా వాటికి విలువ లేకుండా పోయింది. మరికొన్ని సాక్ష్యాలు బూడిదగా మారాయి. చంద్రబాబు ప్రభుత్వం అప్పటి వన్య ప్రాణుల సంరక్షణ ప్రధాన అధికారి రామకృష్ణ నేతృత్వంలో విచారణ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. కానీ, కొన్నేళ్ల తర్వాత ఈ కేసులోని “పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత” నిందితులు నిర్దోషులుగా బయట పడ్డారు. ఈ తతంగంలో ఎస్పీగా పీఎస్ఆర్ చంద్రబాబు ప్రభుత్వానికి వివిధ కోణాల్లో సాయపడ్డారనేది బహిరంగ ఆరోపణ. ఈ కేసు అనంతరమే టీడీపీ కీలక నేతలతో ఆయనకు సంబంధాలు బలపడ్డాయనే వాదనలూ ఉన్నాయి. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పని చేసినప్పుడు కూడా అక్కడి నేతలతో సఖ్యతగానే ఉండే వారు. కానీ, ఆయన హైదరాబాద్ నిఘా విభాగంలో పని చేసిన సమయంలో ప్రభుత్వంతో బయటకు తెలియని ఘటనలు చోటుచేసుకున్నట్టు సమాచారం. అందుకే ఆయన దేశ సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) లో ఐ.జి.గా డిప్యూటేషన్ పై వెళ్లినట్టు పోలీసు వర్గాల ద్వారానే తెలుస్తోంది.

“రామా” తేడా ఎక్కడ..?
2019వ సంవత్సరంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర సర్వీసు నుంచి తిరిగి ఆంధ్రప్రదేశ్ కి వచ్చారు. వైసిపి ప్రభుత్వంలో కీలకమైన నిఘా విభాగం అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఆ ప్రభుత్వ కొఠరీలో అంచెలంచెలుగా ఐదేళ్ల పాటు చోటుచేసుకున్న అక్రమాలు పీఎస్ఆర్ “లాఠీ”కీ అంటుకున్నాయి. వైసిపి ప్రభుత్వ అడ్డగోలు వ్యవహారాల్లో సహకరించారని గత ఏడాది అధికారంలోకి వచ్చిన బాబు ప్రభుత్వం పీఎస్ఆర్ ని సస్పెండ్ చేసింది. ఆయనపై నిఘా ఉంచింది. నటి జిత్వానీ కేసు పేరు బయటకు చెబుతున్నప్పటికీ, ఇప్పటికీ వైసీపీ నేతలకు సహకరిస్తున్నారనే అంతర్గత అభియోగంతో అరెస్టు చేశారు. అయితే, గత రెండు రోజులుగా ఈ అరెస్టుపై రచ్చబండల వద్ద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన సీతారామాంజనేయులు అరెస్టు వెనుక ప్రస్తుత అధికార పార్టీకి చెందిన మరొక అత్యంత బలమైన సామాజిక వర్గ ఒత్తిడి ఉన్నట్టు వాదనలు వస్తున్నాయి. జగన్ ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలోనే పీఎస్ఆర్ అరెస్టు జరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, సాధారణంగా తన ప్రభుత్వంలో నమ్మకంగా పని చేసిన వారి పట్ల చంద్రబాబు నాయుడు గౌరవంగా ఉంటారు. అవకాశాన్ని బట్టి అవసరం ఉన్నప్పుడు వారికి చేయుతనిస్తారు. అలాంటిది ఒకప్పుడు అత్యంత సన్నితంగా ఉన్న సీతా రామాంజనేయులు వ్యవహారం అరెస్టు చేసే వరకు వెళ్లిందంటే దాని వెనుక ఉన్న కారణాలపై ఆసక్తి పెరిగింది. ఒక్క జత్వానీ కేసులో మాత్రమే అయితే అంత సీనియర్ అధికారిని అరెస్టు చేయాల్సిన అవసరం లేదనేది మరో వాదన. టిటిపి, వైసిపి ప్రభుత్వాల తెరవెనుక కక్షలు బయట పడితే తప్ప సామాన్యులకు అంతుపట్టని ఇలాంటి అధికారుల అరెస్టు వ్యవహారం కొలిక్కి రాదు.