పాలన అంటే "ప్రతీకారం"..! - EAGLE NEWS

పాలన అంటే “ప్రతీకారం”..!

Tar c

ప్రజాస్వామ్యంలో రాజకీయం వేరు. పగ, కక్షలు, కార్పణ్యాలు వేరు. రాజకీయాలు అనేక లక్ష్యాలతో నాయకులు, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తాయి. కక్షలు వ్యక్తిగత వ్యవహారాలతో ముడిపడి పగతో రగిలిపోతున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే పార్టీలు ఏ రాజకీయం చేయాలనుకున్నా అవి రాజ్యాంగానికి కట్టుబడి తీరాలి. అదే కక్ష సాధింపునకు తెగించాలనుకుంటే నీతి, నియమాలతో గానీ, ఏ చట్టంతో గానీ పని లేదు. మూర్ఖపు ఆలోచనలతో వ్యూహాలు వేస్తే చాలు. నువ్వా…నేనా…అంటూ రోషాలు పెంచుకుంటూ బలం చూపుకుంటే అదే హీరోయిజం. అసలు నాయకులలో రాజకీయాలు, వ్యక్తిగత కక్షలు వేరువేరుగా ఉండాలి. ఈ రెండింటి ముడిపెడితే ప్రజలకు అపార నష్టం వాటిల్లుతుంది. అదే ఇప్పుడు జరుగుతోంది. దీనికి మనదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. పట్టింపులూ, పంతాలతో రాజ్యాలు కనుమరుగైన చరిత్ర ఉంది. గత దశాబ్ద కాలంగా మన దేశ రాజకీయాల్లో ఈ వింత సంస్కృతి పెనవేసుకుంటోంది.

download
మరువలేని గుర్తులు

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇదే విష సంస్కృతి 15 ఏళ్లుగా జడలు విప్పుతోంది. దేశ స్వాతంత్య్రం తర్వాత రాజకీయ పార్టీల్లో ఎన్నడూ లేని నీచమైన ఎత్తుగడలు సామాన్యుల సంక్షేమానికి గొడ్డలి పెట్టుగా మారాయి. రెండు, మూడు దశాబ్దాల కిందటి వరకు ఎన్నికల  సమయంలో మాత్రమే  కనిపించే రాజకీయ కక్షలు రానురానూ వ్యక్తిగత పగలుగా రూపాంతరం చెందడం ఆందోళనకు గురి చేస్తోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి దాపురించింది. అందుకే సభల్లో ప్రజా సమస్యలపై  పోరాడే స్వరం లేకుండా పోతోంది. ఎప్పుడో మూడు దశాబ్దాల కిందట తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత మధ్య కనిపించిన “కసి” రాజకీయం ఇప్పుడు  తెలుగు రాష్ట్రాలకు పాకడం దురదృష్టకరం. అటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా తక్కువ కానట్టు వ్యవహరించడం విచారకర పరిణామం. దేశంలో పెచ్చుమీరుతున్నరాజకీయ కక్ష సాధింపుల పై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజాక్షేమాన్ని కోరే “ఈగల్ న్యూస్” తన సూక్ష్మ దృష్టిని “కక్ష రాజకీయాల” పై సారించింది. అదే ఈ విశ్లేషణ సారాంశం.

Untitled 1 copy
అప్పట్లో అలా…

కేంద్రంతో పాటు ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో సుమారు రెండు దశాబ్ధాలుగా రాజకీయ పార్టీలు తమ దృష్టి ప్రజా సమస్యల పై కంటే ప్రత్యర్ధి పార్టీ నేతల వ్యక్తిగత వ్యవహారాల పై సారిస్తున్నాయి. ఒక ప్రభుత్వంలో ఏదైనా అవినీతి జరిగితే దానికి అనేక కారణాలు, పలువురి ప్రమేయం తప్పకుండా ఉంటుంది. ఆ వాస్తవాలు విచారణలో తేలాలి. బాధ్యులను శిక్షించాలి. ఇదీ ఒక కేసు పరిణామం. కానీ, కొన్నేళ్లుగా జరుగుతున్న తంతు మాత్రం చిత్రంగా ఉంది. ఎన్నికల్లో ఒక పార్టీ గెలవగానే ప్రజా సంక్షేమ పనులకు తిలోదకాలు ఇచ్చి, పాత ప్రభుత్వంలో లొసుగులను వెలికితీయడం, అవసరమైతే ఒకటే లక్ష్యంగా అరెస్టులు చేసి జైలుకు పంపడం పాలనలో భాగం అయింది. బీహార్ గడ్డి కేసు లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టు నాటి ఉదాహరణ. స్పెక్ట్రం కేసులో కనిమొళి అరెస్ట్. మొన్న ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు. ఇలా రాజకీయంగా అరెస్టుల పరంపర జరుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా గుర్ గ్రామ్ భూమి వ్యవహారంలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను విచారించడం, నేషనల్ హెరాల్డ్ షేర్ల  బదలాయింపు ఆరోపణల్లో సోనియా, రాహుల్ పై చార్జీ షీట్ తతంగం. వక్ఫ్ బిల్లు ఆమోదం వెంటనే ఈ వ్యవహారం చోటుచేసుకోవడం విశేషం. జగన్ కూడా ఈ బిల్లుపై వ్యాఖ్యానించిన ఒక్క రోజులోనే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు యాక్టివ్ అయ్యారు. జగన్ భారతి సిమెంట్ పెట్టుబడులు “నీకు అది నాకు ఇది” దారిలో వచ్చాయంటూ దాల్మియాకు చెందిన 790 కోట్ల విలువ చేసే ఆస్తులను ఇ.డి. జప్తు చేసింది. ఇలా దేశంలో అధికార పార్టీ తనకు అవసరం అనిపించిన ప్రతిసారి నోటీసులు, విచారణలు, అరెస్టుల పేరుతో అసలు విషయాలపై సామాన్యుల దృష్టి మరల్చే చర్యలకు పాల్పడడం జగమెరిగిన సత్యమే. కాకపోతే, గతంలో కాంగ్రెస్ పార్టీ, అంతకు మించి ఇప్పుడు బిజెపి అంతే తేడా.

arrest c
బాబు అరెస్టు

ఇక తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న  దౌర్భాగ్య  పరిస్థితిని రాజకీయ పరిశీలకులే కాదు, సామాన్య జనం సైతం ఈసడించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరిపాలనతో పాటు కక్ష సాధింపుల పరంపర కొనసాగుతోంది. ఆంధ్రాలో  వైసిపి అధికారంలో ఉన్నప్పుడు తమపై అరాచకం చేశారనే పగ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సైతం వైసిపి అనుయాయులను యడాపెడా అరెస్టు చేస్తున్నారు. ఆయనలో ఆ కసి ఉండడానికి బలమైన కారణం ఉంది.  జగన్ అధికారంలో ఉన్నప్పుడు  అకారణంగా తనను జైలుకు పంపారనే ఆవేదన. పరిపాలన  అనుభవం లేని జగన్ చంద్రబాబు నాయుడుని జైలుకి పంపడమే లక్ష్యంగా చేసుకోవడం ఘోర తప్పిదం. అదే ఇప్పుడు ఆంధ్రాలో శాంతి భద్రతలకు సవాలుగా మారింది. వైసీపీకి ఏ మాత్రం తీసిపోనట్టు తెలుగుదేశం ప్రభుత్వం కూడా జగన్ అనుయాయులను వెతికి వెంటాడుతోంది. ఎంత మాత్రం అవకాశం దొరికినా అరెస్టు చేస్తోంది.

పగ ప్రతీకారంలో తెలంగాణ కూడా ఏమీ తీసిపోలేదు. పదేళ్లు అధికారాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి వివిధ కారణాలను సాకుగా చూపి రేవంత్ రెడ్డిని రాత్రికి రాత్రే అరెస్టు చేసింది. ఆ కసి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలచి వేస్తోంది. కానీ,  ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా అరెస్టులు జరగక పోయినా కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ పై విచారణల పర్వం కొనసాగుతోంది. ముఖ్య నేతల్లో రగులుతున్న పగ వల్ల ఆ ప్రభావం పరిపాలన పై పడుతోంది. గతంలో రాగా, ద్వేషాలు ఎన్నికల వరకు మాత్రమే పరిమితం అయ్యేవి. బలం ఉన్న  పార్టీ అధికారంలో, సీట్లు తక్కువగా పొందిన పార్టీ ప్రతిపక్షంలో తమ పాత్ర పోషించడం అనవాయితీ. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత మధ్య స్నేహ పూర్వక సంబంధంతో  ప్రజా  సమస్యల పై యుద్ధం జరగాలే తప్ప కుటుంబ వ్యవహారాల చర్చలు కాదు.

download 5
రాజకీయ దరహాసం

దీనికి ఉమ్మడి రాష్ట్రంలో వై ఎస్ రాజ శేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు నిలువెత్తు నిదర్శనం. వీళ్లలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా అది ఎన్నికల వరకే పరిమితం అయ్యేది. శాసనసభలో అధికార, విపక్ష పార్టీల మధ్య సహృద్భావ వాతావరణం కనిపించేది. 2009 వరకు ఇదే పరిస్థితి ఉండేది. కానీ, రాష్ట్రం విడిపోయిన తర్వాతే వ్యక్తిగత స్వార్థాలు ఎక్కువైయ్యాయి. ప్రతిపక్ష నేతలు ఫామ్ హౌస్ లో కాలక్షేపం చేయడం, బెంగుళూరు ప్యాలెస్ లో సేద తీరడం వాటి వాస్తవాలు చూస్తున్నాం. వీళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టడం గగనంగా ఉంది. అంటే అధికారం ధ్యాస తప్ప ప్రజాసమస్యలు వాళ్లకు పట్టవని తేలిపోతోంది. అదే అందలం ఎక్కిస్తే మాత్రం దర్జాగా సభలో ఆసీనులై కాలర్ ఎగురవేస్తారు.

దేశంలో రాజకీయ అనుభవం లేనివాళ్ళు సంపాదనే ధ్యేయంగా పార్టీలను పెట్టడంతో సమస్య మరీ జటిలంగా మారింది. దీనివల్ల పాలన గాడి తప్పి ప్రజలు సమస్యలను ఎదుర్కోవలసిన దుస్థితి దాపురించింది. నేతల్లో వ్యక్తిగత కక్షలు తగ్గితేనే పరిపాలన ఫలాలు సామాన్యులకు చేరుతాయి. లేకుంటే శాంతి, భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే కాబోలు “టైమ్స్” ప్రభావశీలుర తాజా జాబితాలో ఒక్క భారతీయునికి కూడా చోటు దక్కలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *