ముఖ్యమంత్రి కేసీఆర్ ను అసెంబ్లీలో చెట్టుకు ఉరి తీసినా, గల్ఫ్ దేశాల్లో మాదిరిగా రాళ్లతో కొట్టినా తప్పు లేద ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రైతులందరూ కేసీఆర్, కేటీఆర్ లను చెట్టుకు కట్టేసి.. రాళ్లతో కొట్టినా తప్పు లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి మాటలు అనటానికి ఏ మాత్రం భయపడటం లేదన్నారు. 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు కేసీఆర్ మాదిరిగా దోపిడీకి పాల్పడలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీర్, కేటీఆర్ ఇద్దరూ సైబర్ నేరగాళ్ల మాదిరిగా ధరణి పేరుతో తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి బుధవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ తెలంగాణ ప్రజలకు జీవన్మరణ సమస్య గా మారిందని అన్నారు. ధరణి పోర్టల్ వెనక దొరలు, రాజులు ఉన్నారని, కేసీఆర్ దోపిడీ, దొంగతనానికి అడ్డు అదుపులేకుండా పోయిందని ఆరోపించారు. ధరణి దోపిడీపై శోధిస్తున్నా కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయన్నారు.. రాష్ట్రంలో భూ లావాదేవీలన్ని ధరణి పోర్టల్ ద్వారా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ నిర్వహిస్తోంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ వాస్తవానికి దివాళా తీసిన కంపెనీ. గతంలో రూ.90 వేల కోట్ల అప్పులు చేసి బ్యాంకులను నిండా ముంచింది. దివాళా తీసిన కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొదటి తప్పుని రేవంత్ రెడ్డి విమర్శించారు.
.‘‘ ప్రజల భూముల వివరాలన్నింటినీ ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టారు. ఐఎల్‌ఎఫ్ సంస్థలో ఫిలిప్పీన్‌కు చెందిన కంపెనీల పెట్టుబడులు ఉన్నాయి. ప్రజల భూముల వివరాలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని నేను మొదటి నుంచి చెబుతున్నా. ధరణి నిర్వహణపై ఐఎల్‌ఎఫ్ సంస్థతో రూ.150కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. ఐఎల్‌ఎఫ్ సంస్థకు చెందిన 99శాతం వాటాను టెరాలసిస్ టెక్నాలజీస్ అనే సంస్థ కొనుగోలు చేసింది.70లక్షల భూ యజమానుల వివరాలను ఐఎల్‌ఎఫ్ సంస్థకు విక్రయించారు’’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ధరణితో నష్టం వచ్చిందని కాగ్ రిపోర్ట్ లో పేర్కొన్నారని వివరించారు. ఒడిశాలోనూ ఐఎఫ్ ఎల్ ఎస్ సంస్థే ధరణిని నిర్వహించిందని, అలాంటి సంస్థతో కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కల్లు తాగిన కోతిలా ఎగురుతున్నారు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.