తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులు అనేక ఏళ్లుగా ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తుంటే చేతికి వచ్చే అవకాశాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం నిజంగా దుర్మార్గపు చర్యలే. ఉమ్మడి ఆంధ్రా రాష్ట్రంలో సరైన అవకాశాలు లేక, ఉన్నా ఇబ్బడిముబ్బడిగా ఉన్న పోటీని తట్టుకోలేక తెలంగాణ బిడ్డలు నానా గోస అనుభవించారు. “మా చదువులు మావే అని, మా ఉద్యోగాలు మాకే సొంతం” అంటూ గంపెడు కోరికల మధ్య పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణలో మొన్నటి వరకు వారికి ఎంత మాత్రం న్యాయం జరగలేదనేది బహిరంగ రహస్యం. గత పదేళ్లుగా నిరుద్యోగుల కలలు కల్లలుగానే మిగిలి పోయాయి.

పదేళ్ల పాటు పాలన పగ్గాలు చేతిలో పెట్టుకొని రాష్ట్ర భవితను “ప్రగతిభవన్” ప్రహరీ గోడ దాటనివ్వని అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉద్యోగ నియామకాలకు ముళ్ల కంచె వేశారని చెప్పవచ్చు. దీనికి ప్రగతిభవన్ ముందు రోడ్డుపై వేసిన ఇనుప కంచె, బారికేడ్ లు సజీవ సాక్ష్యంగా కనిపించేవి. పదేళ్ల పాలనతో కేసిఆర్, కేటీఆర్, హరీష్, కవిత వంటి గులాబీ నేతలు అభివృద్ది ముసుగులో హడావిడి చేశారే తప్పితే, నిరుద్యోగ యువతకు, పేద వర్గాల వారికి ఒరగా బెట్టింది ఏమి లేదనేది ప్రజాభిప్రాయం. ఆ ఫలితాన్ని గత ఎన్నికల్లో స్పష్టం చేశారు. ఏడెనిమిది నెలల కిందట రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి మార్గాలను, ఉపాధి అవకాశాలకు ఎంతో కొంత పదును పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం తొక్కి పెట్టిన పారామెడికల్, కానిస్టేబుల్ ఉద్యోగాలను ఇప్పటి ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని “లీకేజి ముఠా” నిర్వాకం కారణంగా రద్దయిన గ్రూప్ 1 పరీక్షకు ఇప్పటి ప్రభుత్వం గత నెలలోనే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. మరికొద్ది రోజుల్లో డి.ఎస్.సి, గ్రూప్2 పోస్టులను కూడా భర్తీ చేయడానికి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇక్కడే సమస్య తలెత్తింది. ఉద్యోగాల కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావలసిన నిరుద్యోగులు ఆయా నియామకాలను వాయిదా వేయాలని రొడ్డెక్కడం విస్మయ కలిగిస్తోంది. భారత రాష్ట్ర సమితి అనుబంధ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఐదారు రోజులుగా నిరసనలు ముమ్మరం చేశారు. పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేయడం కొంతమేర సబబుగానే ఉన్నప్పటికీ, అర్హత పరీక్షను డిసెంబర్ వరకు వాయిదా వేయాలనడం అర్థరహితంగా ఉందని నిరుద్యోగ సంఘాల నేతలే వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం నిరుద్యోగ యువత చేస్తున్న ఆందోళనలు హరీష్ రావు, కేటీఆర్ వంటి నేతలు వత్తాసు పలుకుతున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. గత పదేళ్లుగా ఉద్యోగాల ఊసే ఎత్తని భారాస నేతలు ప్రస్తుతం చేపట్టే నియామకాలను అడ్డుకునే ప్రయత్నాలు చేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత మధు యాష్కి ఎదురుదాడికి దిగారు. ఒకటి,రెండు ప్రయివేట్ శిక్షణ సంస్థలకు దోచి పెట్టడానికే భారాస అనుబంధ విద్యార్ధి సంఘం ఆందోళనలకు దిగిందని ఆయన వ్యాఖ్యానించారు. నిజంగా ఉద్యోగం కోసం రాసే వారు ఉద్యోగాలను వాయిదా వేయాలని కోరుకోరని,ఉద్యోగాలు వాయిదా వేయడం వల్ల శిక్షణ ముసుగులో 100 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని మధు యాష్కీ పేర్కొన్నారు. దశాబ్ద కాలంగా ఉద్యోగాల కోసం నోరు మెదపని విద్యార్ధి సంఘం ఇప్పుడు ఉద్యోగాలను అడ్డుకునే ధోరణిని పలువురు తప్పు పడుతున్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, జరుగుతున్న ఆందోళన పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.