నిన్న “దొర” – నేడు “రెడ్డి”..!

hcu c cf

అధికారంలో ఉన్న రాజకీయ నేతలకు పరిపాలనతో పాటు, అభివృద్ధి ముసుగులో కమీషన్ల వ్యాపారం చేయడం అనవాయితీగా మారుతోంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కొందరు నేతలు జైళ్ల దారి పట్టడమే దీనికి నిలువెత్తు సాక్ష్యం. అందులో తెలంగాణ నేతలు కూడా తక్కువేమీ కాదని చెప్పక తప్పదు. భూములు, నిధులు, నీరు, విద్య, ఉద్యోగం కోసం దశాబ్దాలుగా పోరు చేసి సాకారం చేసుకున్న ప్రత్యేక  తెలంగాణ తిరిగి దొరలు, రెడ్డి నేతల దోపిడీకి గురవుతోంది. నిజాం పాలకుల నిరంకుశత్వానికి ఎదురొడ్డిన ప్రాంతాలలో నేడు ఊహించని రీతిలో ఖాకీల లాఠీ మోతలను ప్రతిధ్వనిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంపై పదేళ్ల పాటు గడీ కట్టుకొని పాలించిన భారత రాష్ట్ర సమితి (భారాస), ప్రస్తుతం అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పోకడలను ఒకసారి విశ్లేషించుకోవలసిన అవసరం ఉంది. కెసిఆర్ నేతృత్వంలోని భారాస ప్రభుత్వం ప్రత్యేక “గూఢచారి” వ్యవస్థను ఏర్పరచుకొని సామాన్యులు, మేధావుల అంచనాలకు దొరకకుండా అక్రమాలకు పాల్పడడం ఒక ఎత్తు. దీనికి కాళేశ్వరం ప్రాజెక్టులో లొసుగులు, ఫార్ములా ఇ రేస్ నిధుల మళ్లింపు, ధరణి పోర్టల్ ముసుగులో భూ దందాలు, లిక్కర్ మాఫియాలో బినామీలు, ఇంటలిజెన్స్ ముఠా ఆగడాలు ఇలా అనేక అపవాదులను ఉద్యమ పార్టీగా చెప్పుకున్న  భారాస మూటగట్టుకుంది. ఇక, “తాడిని తన్నే వాడుంటే దాని తలతన్నే వాడు ఉంటాడు” అన్నట్టు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకవైపు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందనే పొగడ్తలతో పాటు తెర వెనుక భూ బాగోతాలు నడిపిస్తోందనే బహిరంగ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతంలోని కంచ గచ్చిబౌలి భూముల తగాదా దీనికి తాజా ఉదాహరణ చెప్ప వచ్చు.

అనేక ఏళ్లుగా అతీగతీ లేని 400 ఎకరాల పైచిలుకు భూమి వ్యవహారం  ఒక్కసారిగా వెలుగులోకి రావడం, వివాదంగా మారడం చర్చకు, రాజకీయ రచ్చకు దారి తీసింది. రోజుల వ్యవధిలోనే ఈ తంతు కాస్తా సుప్రీంకోర్టు వరకు చేరింది. ఇప్పటికే కాంక్రీట్ జంగిల్ గా మారిన భాగ్యనగరం, దాని శివారు ప్రాంతాలు పచ్చదనం కోసం పడిగాపులు కాస్తున్నాయి. మూగ జీవాలు, పశుపక్షాదులు పచ్చని చెట్టు కోసం, గుప్పెడు గూటి కోసం తహతహలాడుతున్నాయి. సుమారు 20 ఏళ్లుగా అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ సిటీ, సైబర్ టవర్స్ ఇలా అభివృద్ధి కోసమని వేల ఎకరాల్లో చెట్లను రూపుమాపారు. నగరం నాలు మూలలని ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా తీర్చి దిద్దారు. దీంతో, చిట్టడవుల్లో ఉండాల్సిన చిరుతలు రోడ్ల పైకి రావడం, నెమళ్ళు,కుందేళ్ళు, దుప్పులు, అడవి పందులు ఇతర వన్య ప్రాణులు వేటగాళ్ల కు  ఆహారంగా మారి ఆనవాళ్లు లేకుండా పోయాయి. చెట్లు లేక కొన్ని పక్షులు సెల్ ఫోన్ టవర్లను అవాసాలుగా మార్చుకొని రేడియేషన్ తో కమిలి పోతున్నాయి. కొన్ని జంతువులు నీడ లేక ఔటర్ రింగు రోడ్డు, హైవేల పైకి వస్తూ వాహనాల కిందపడి చనిపోతున్నాయి. ఇంతటి దుర్భర పరిస్థితులు తెలిసిన ప్రభుత్వ పెద్దలు, తల పండిన అధికారులు ప్రకృతి సంపాదను కాపాడుతూ, పచ్చదనాన్ని పెంచాల్సింది పోయి అందుకు విరుద్ధంగా వ్యవహరించడం బాధాకరం. ఇళ్ల నిర్మాణానికి ఎకరం, రెండు ఎకరాల్లో అభివృద్ధి చేసుకోవడంలో అర్ధం ఉంది.

emply in

ఉద్యోగాల ముసుగు…

అభివృద్ధి, భారీ ప్రాజెక్టులు, ఉపాధి ముసుగులో వందల ఎకరాల్లోని చెట్లను కూకటి వేళ్ళతో నేలమట్టం చేసి, వన్యప్రాణులకు ఆవాసం లేకుండా చేయడం, పశుపక్షాదులను పారద్రోలడాన్ని రాజకీయ పార్టీలు, పర్యావరణ పరిరక్షణ సంస్థల వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అందుబాటులో ఉన్న ఆ నాలుగు వందల ఎకరాల భూమిని చక్కని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చు. వన్యప్రాణులకు జాగా లేకుండా చేసి, ఐదు లక్షల ఉద్యోగాల ఆశ చూపి వందల ఎకరాలను కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని  అనాలోచిత చర్య అని సామాజిక వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. భూములను తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నంలో గత ప్రభుత్వాలు కూడా తెలివిగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రకటనలు గుప్పించిన సందర్భాలను రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఎత్తిన గుట్టలు, చెట్లను చదును చేసిన హైటెక్ సిటీ, నానక్ రామ్ గూడ, పుప్పాల గూడ, మణికొండ, కోకపేట, శంషాబాద్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో వేల ఎకరాల భూములను కార్పోరేట్ సంస్థల చేతుల్లో పెట్టారని, కానీ, అక్కడ పనిచేస్తున్న వారిలో స్థానిక యువత కంటే  ఇతర రాష్ట్రాల వారి సంఖ్య అధికంగా ఉన్నదని వివరిస్తున్నారు. కంచ గచ్చిబౌలి లోని ప్రతిపాదిత ప్రాజెక్టుల్లో కూడా రేపు ఇదే పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషిస్తున్నారు. పుట్టగొడుగు లాంటి రాళ్ళు, నెమళ్లు, జింకలు, ఇతర జంతువులు, పెద్ద సంఖ్యలో పక్షులు, “నక్షత్ర తాబేళ్ళు” ( తాబేళ్ళు – ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్‌) అరుదైన జాబితాలో  ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ 400 ఎకరాల భూముల్లో చెట్ల నరికి వేత పై దాదాపు అన్ని రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు ముప్పేట దాడికి దిగాయి. ప్రకృతి నాశన పనులను అడ్డుకునే నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.  జీవవైవిధ్యాన్నీ , పర్యావరణాన్ని సంరక్షించవలసిన రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు దిగడం చాలా దారుణమని వ్యాఖ్యానించాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ భూములను కార్పోరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తే, తాము మళ్ళీ అధికారంలోకి వస్తే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని కెటిఆర్ ప్రకటన చేయడం పారిశ్రామిక వర్గాల్లో కొత్త చర్చకు తెర లేపింది.

sup in

ఇదేం పని ? – “సుప్రీమ్”

ఈ కేసును “సుమోటో” కేసుగా అత్యవసర విచారణకు చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం రాష్ట్ర  ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టింది. వివాదాస్పద భూమి ప్రాణ స్వయంగా పర్యటించి వాస్తవ పరిస్థితి పై తక్షణమే వివరాలు సేకరించాలని తెలంగాణ హై కోర్టు రిజిస్ట్రార్ ని గురువారం మధ్యాహ్నమే సుప్రీం కోర్టు  ఆదేశించింది.  సాయంత్రానికి రిజిస్ట్రార్ పంపిన దాదాపు 100 ఎకరాల్లో చెట్ల నరికివేత సమాచారం, చెరువు పక్కన  వన్య ప్రాణుల రోదన  ఫోటో లను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి ఆదేశాల జారీ చేసే వరకు చెట్లు నరక వద్దని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. అంత హడావిడిగా అధికారులను, యంత్రాలను మోహరించి చెట్లను నరికివేయాల్సి అవసరం ఏముందని? అభివృద్ధి పనులకు సంబంధించి పర్యావరణ పరిరక్షణ అనుమతులు తీసుకున్నారా లేదా?  చెట్ల నరికివేతకు అటవీ శాఖ అనుమతి ఉందా లేదా? అనే అంశాలపై సమాధానం చెప్పాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అదేవిధంగా సుమారు 100 ఎకరాల మేర చెట్లనారికివేత, కంచ గచ్చిబౌలిలో వివాదాస్పద 400 ఎకరాల భూమిపై సెంట్రల్ ఎంపవర్ మెంట్ కమిటీ వ్యక్తిగతంగా విచారణ చేపట్టి ఈ నెల 16వ తేదీ లోగా నివేదిక అందజేయాలని సూచించింది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీమ్ కోర్టు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధంగా చెంపపెట్టు లాంటిదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *