“పాత్రికేయం”పరువు పోతోంది..

images 49

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు, మూడు దశాబ్దాలుగా కుప్పలు తెప్పలుగా విస్తరిస్తున్న పేపర్లు, టివి ఛానళ్ళు, సామాజిక మాధ్యమాలు ఆయా సంస్థల యాజమాన్యాల స్వప్రయోజ నాల కోసం జర్నలిజాన్ని తాకట్టు పెడుతున్నా యనే వాదనలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా జర్నలిస్టులే పాత్రికేయ విలువలకు తిలోదకాలు ఇవ్వడం సిగ్గు చేటుగా ఉంది. తెలుగు పాత్రికేయ విలువలు పూర్తిగా చచ్చి పోతున్నాయా? ఒక పత్రికలో, ఛానల్ లో వచ్చిన కథనాలు మరో మాధ్యమానికి ఎందుకు మింగుడు పడడం లేదు? కులం పిచ్చితో నడుస్తున్న ఛానళ్ళు , వాటిలో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన పాత్రికేయులు కనీస విజ్ఞతను ఎందుకు కోల్పోతున్నారు? కేవలం ప్రచారం, రేటింగ్స్ కోసం విలువలను మరచి పోతున్నారా? ఆరోపణలు, విమర్శలు సహజం అనే వాస్తవాన్ని పట్టించుకోవడం లేదా? ఒక రాష్ట్రంలో తమ అనుచర పార్టీ అధికారంలోకి రాగానే యాంకర్లు, విలేకర్లు ఎందుకు రెచ్చి పోతున్నారు? ఒక్క స్వామీజీనే కాదు, సమాజంలో ఇంకా అనేక మంది ఉన్నారు, ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి, జర్నలిస్టులుగా చెప్పుకుంటున్న మీకు వీటిపై పట్టింపు లేదా? ఇవ్వన్నీ ఇప్పుడు సామాన్యున్ని తొలుసుస్తున్న ప్రశ్నలు.

images 48

పత్రికలు, ఛానళ్లలో కొద్ది రోజులుగా వెలుగు చూస్తున్న పరిణామాలతో జర్నలిజంలో వివరణలు, సవరణలు అనే ప్రాథమిక విషయాన్ని తుంగలో తొక్కి కసిగా తెరపై మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది. 30 ఏళ్ల అనుభవం ఉన్నట్టు చెప్పుకుంటున్న యాంకర్ గా మారిన విలేకరి వాస్తవానికి 2006లో బంజారా హిల్స్ లో ప్రారంభమైన ఛానల్ లో వెలగబెట్టిన వ్యవహారాలు పాత్రికేయ రంగ మిత్రులకు తెలియనిది కాదు. అప్పట్లో ఆ ఛానల్ లో సదరు యాంకర్ పై గుప్పుమన్న విషయాలు బహిరంగ రహస్యమే. ఆయన దగ్గర పని చేసిన ఓ విలేకరి ఆంధ్రప్రదేశ్ లో ఏ స్థాయికి వెళ్ళారో విచారిస్తే బయట పడుతుంది. ఆ తర్వాత కొంత కాలానికి జూబ్లీ హిల్స్ లో 2013లో పుట్టుకొచ్చిన మరో ఛానల్ లో ఆయన ఏ మేరకు, ఎంత కాలం పని చేశారనేది ప్రస్తుతం సమీక్షించుకోవాల్సిన అంశం. ఆయన ఆ ఛానల్ ని ఎందుకు విడారనేది ప్రధానం. విలేకరిగా వాస్తవాలను బయట పెట్టాల్సిన వ్యక్తి, ఒక ఛానల్ హాట్ సీటులో కూర్చొని ఏళ్ల తరబడి ఒక పార్టీ, నేతలపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం తెలుగు ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. ప్రశ్నించే స్థాయిని మరచిపోయి నిలదీసి, కసిగా మాట్లాడడం ఆయన మొదట్లో పని చేసిన సంస్థలో కచ్చితంగా నేర్పి ఉండరు. నేర్పరు కూడా. యాభై ఏళ్ల చరిత్ర ఉన్న ఆ సంస్థ, దాని యాజమాన్యం అందుకు పూర్తీ విరుద్ధం కూడా.

images 50

ఒక వ్యక్తిని, ఒక నేతను, ఒక పార్టీని వెంటబడి వేధించే శిక్షణ ఎక్కడ పొందారో ఆయనకే తెలియాలి. ఒక మీడియాలో వచ్చిన కథనానికి “నీ అంతుచూస్తా” అంటూ వార్నింగ్ ఇవ్వడం సామాన్య విలేకరికి సాధ్యం కాదు. ఆయన వెనుక సంస్ధ ఎగవేత, బలం ఉంటేనే అది సాధ్య పడుతుంది. కథనానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకుండా, తనలో ఏ లోపం లేనట్టు ప్రస్తుతంలో మునిగిపోయి ఇష్టానుసారంగా తెరపై మాట్లాడడం పట్ల సగటు ప్రేక్షకులే విస్తుపోతున్నారు. 30 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిగా జర్నలిస్టు విలువలను యాజమాన్యానికి వివరించి వారి తప్పు, ఒప్పులను సవరించాల్సింది పోయి, పాత్రికేయ విలువలు ఎంత మాత్రం తెలియని యజమానులకు వంత పాడుతూ, తన గొప్పతనం చెప్పే ప్రయత్నం చేయడం నిజంగా క్షమార్హం. కేసు పెడితే అది తేలడానికి ఏళ్ళ సమయం పడుతుందనే జర్నలిస్ట్ విశ్లేషణతో కావొచ్చు బహుశా మనిషి జీవిత కాలం ఎంత, అందులో ఆయన జీవిత కాలం ఎంత పూర్తీ అయింది, ఇంకా ఎంత కాలం ఉంది అంటూ రోజులు, గంటలతో లెక్క వేసి మరీ జనానికి తన సొంత జోస్యం చెప్పడం నిజంగా విడ్డూరమే. కానీ, సుద్దపూస లెక్కలు తేల్చడానికి ప్రభుత్వ యంత్రాంగంలో పద్ధతులు ఉన్నాయనే విషయం తెలిసి కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించదానికి ఆయన పని చేస్తున్న సంస్థ వెన్నుదన్నుగా ఉండడమే కారణం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కామాఖ్య దేవత ముసుగులో స్వామీజీ చెబుతున్న జోస్యం నూటికి నూరు శాతం తప్పు. ఆయన్ని పోషిస్తున్న వివిధ వర్గాల తప్పిదం దీనికి కారణం. హేతువాద సంఘాలు ఆయన పంతం పట్టాలి. ఆ జ్యోస్యుడు యాంకర్ 5 కోట్లు అడిగారని ఆరోపించడం పూర్తిగా వ్యక్తిగతం. దీనికీ, ఆయన పనిచేస్తున్న ఛానల్ కి సంబంధం లేని విషయం. సామాజిక మాధ్యమంలో స్వామీజీ ఆరోపించారు. అందుకు ఆయనపై దావా వేయడమైనా చేయాలి లేదా అదే మాధ్యమంలో తన వాదన వినిపించాలి. అంతేకాని, అలాటి పిచ్చి స్వామీజీలను అడ్డుగా పెట్టుకొని అంట ప్రాచుర్యం ఉన్న ఛానల్ లో మార్కెట్ చేసుకోవాలనే కుటిల ప్రయత్నం నిజంగా తప్పిదమే. అదే పోరాటం అయితే, దేశంలో కోట్ల మంది అమాయకులను ఆశ్రమాల ముసుగులో దోచుకుంటున్న, మోసం చేస్తున్న వందల మంది బడా స్వామీజీల పై 30 ఏళ్ల అనుభవంతో గళం ఎత్తితే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. అదీ జర్నలిజం. అదే పాత్రికేయం.

“చివరగా ఒక మాట, స్వామీజీ పై, ఛానల్ పై అనర్గళంగా, ధీమాగా ధ్వజమెత్తుతున్న సదరు యాంకర్ మానసిక ఆలోచనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. తను వార్తలు చదివే ఆ అరగంట, గంట వ్యవధిలో ప్రపంచంలోనో, దేశంలోనో లేక రాష్ట్రం లోనో ఏదోఒక పేలుడు గానీ, ఇతర ఘర్షణలు గానీ, పెద్ద ప్రమాదం గానీ జరగాలని కోరుకోవడం ఆయన నేర్చుకున్న జర్నలిజం. 2013లో ఆయన ఒక ఛానల్ లో విలేఖర్లకు శిక్షణ ఇచ్చే సమయంలో అదే విషయాన్ని బోధించడం గమనార్హం. అప్పుడు శిక్షణ పొందిన విలేకరులకు ఈ విషయం ఇప్పటికీ గుర్తుండడం విశేషం.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *