కోల్ కతా అర్జీ కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచారం ఘటనలో ఆసుపత్రి సిబ్బందితో పాటు పోలీసులు, బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతదేహం పడి ఉన్న తీరును చూశాక అది ఆత్మహత్యని ఎలా భావించారని వైద్య సిబ్బందిని ప్రశ్నించింది. డాక్టర్ ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి కుటుంబానికి చెప్పడం వెనక కారణమేంటని నిలదీసింది. అదేవిధంగా ఈ దారుణం ఉదయం చోటుచేసుకోగా మధ్యాహ్నం 4 గంటల వరకు పోస్టుమార్టం పూర్తయిందని గుర్తుచేస్తూ ఎఫ్ఐఆర్ మాత్రం రాత్రి 11:45 గంటలకు నమోదు చేసినట్లు ఉందని వెల్లడించింది. అంత జాప్యం ఎందుకు జరిగిందని, అప్పటి వరకు ఏంచేస్తున్నారని పోలీసులను ప్రశ్నించింది.ఈ దారుణానికి సంబంధించిన వార్తలలో బాధిత డాక్టర్ పేరు, ఫొటోలను కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, కోల్ కతా వైద్యురాలి హత్యాచారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. మంగళవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ను మరో కాలేజీకి బదిలీ చేయడాన్ని తప్పుబట్టింది. ఈ హత్యాచారం కేసులో ప్రిన్సిపాల్ ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరో కాలేజీకి ఎలా పంపించారని బెంగాల్ ప్రభుత్వాన్ని సీజేఐ బెంచ్ ప్రశ్నించింది.