భారత రాష్ట్ర సమితి (భారాస) పార్టీలో దాదాపు తిరుగుబాటు నాయకురాలిగా ఎదుగుతున్న కెసిఆర్ కుమార్తె, ఎం.ఎల్.సి. కవిత దూకుడు ఇటు తెలంగాణ జనంలోనూ, అటు వివిధ రాజకీయ వర్గాల్లోనూ రకరకాల ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. పార్టీ చెట్టు నీడలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించి, అంతులేని అధికారాన్ని అనుభవించిన కవిత పదేళ్ల పాటు “ఆవేదన” అనుభవించినట్టు వెల్లడించడం ఒకింత విడ్డూరంగా కనిపిస్తోంది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఆడంబరం ఏ స్థాయిలో వెలుగొందనే గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. భారాస అధికారంలో ఉన్నంత కాలం ప్రభుత్వంలో కవిత మాట శాసనంగా ఉండేదన్న వాస్తవం ఏ ఒక్కరూ మర్చిపోలేనిది. ముఖ్యమంత్రిగా కెసిఆర్ సామాన్య జనానికి అందుబాటులో లేనప్పుడు ఎవరికైనా ఏదైనా “పని” అవసరం ఉంటే “కవితక్క”ని ఆశ్రయించడమే మార్గం తప్ప మరో మాట ఉండేది కాదు. ఆమెను కలిస్తే చాలు ఏ పని అయినా ఇట్టే ముందుకు సాగేది. దీనికి సచివాలంలోనూ, ఆమె పేషీ ల్లోనూ అనేక ఉదాహరణలు ఉన్నాయి.

ఒకవిధంగా చెప్పాలంటే కెసిఆర్ హయంలో కవిత “పవర్ బ్రాండ్” గా మాత్రమే కాదు “పవర్ సెంటర్” గా మెరిసిందనడంలో సందేహం లేదు. మంత్రిగా అన్నయ్య కెటిఆర్ తన పనులు తాను చేసుకువెళ్తుంటే, మరోవైపు అంతకు రెట్టింపుగా కవిత తన వ్యవహారాలను చక్కబెట్టుకోవడంలో మునిగి పోయే వారు. అందుకే అనేకమంది వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు, ఉన్నతాధికారులు అధికారులు కవితను కలవడానికి రోజుల తరబడి వేచి ఉండే వారు. ఆమె అధికారంలో ఉన్నప్పుడు తెర వెనుక ఎన్ని జరిగినా కళ్ళ ముందు కనిపించే వాటిలో ప్రధానమైనవి మద్యం కుంభకోణం, అమరవీరుల స్థూపం. సిబిఐ చెబుతున్నట్టు కవిత కనుసన్నల లోనే డిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంలో మద్యం టెండర్ల కుంభకోణం జరిగింది. ఈ ఆరోపణలు తప్పించుకోలేక కవిత ఆరు నెలల పాటు తీహార్ జైలు జీవితం గడపాల్సి వచ్చింది. కవిత జోక్యంతోనే హవాలా రూపంలో కోట్ల రూపాయలు చేతులు మారాయనేది సిబిఐ సేకరించిన వివరాలు. ఇక, కోట్ల రూపాయల వ్యయంతో నగరం నడిబొడ్డున నిర్మించిన తెలంగాణ అమర వీరుల స్మృతి స్థూపం నిధుల్లోనూ పెద్దమొత్తంలో గోల్ మాల్ జరిగిందనేది బలమైన మరో ఆరోపణ. రూపాయి ఖర్చుకి పది రూపాయల లెక్కలు చూపారనేది బయటకు తెలియని వాస్తవం. అయితే, అధికారంలో ఉన్నప్పుడు “రాణి భోగం” అనుభవించిన కవిత పదేళ్ల పాటు “ఆవేదన” అనుభవించా అంటూ వ్యాఖ్యలు చేయడం అర్థం కాని విషయం. దీంతో జైలుకి వెళ్ళిన కవిత మానసిక వేదన అనుభవించారేమో అనుకుంటున్న ఆమె అభిమానులు, భారాస శ్రేణులు ఒక్కసారిగా నివ్వెర పోయారు. ఆమె పదేళ్ల పాటు వేదనలో ఉన్నారా అంటూ అవాక్కయ్యారు. రాజకీయంగా ఆవేదనకు గురయ్యారా లేక కుటుంబ వ్యవహారాలలోనా అనే అంశాలను బేరీజు వేసుకుంటున్నారు. పరోక్షంగా అన్న పై పిడికిలి ఎత్తిన కవిత ఒక్క కెసిఆర్ ని మినహా ఇటు కాంగ్రెస్ పార్టీని, అటు బిజెపిని దుయ్యబడుతోంది. కానీ, భవిష్యత్ మాత్రం భారాస అంటూ పర్యటనలకు కాలు దువ్వుతోంది. తెలంగాణ ఆడబిడ్డ దశాబ్ద కాల ఆవేదన దీనికి అనేది ఏదో ఒక వేదికగా వివరిస్తుందని వేచి చూద్దాం.