పాతికేళ్ల భారత రాష్ట్ర సమితి (భారాస) చరిత్రలో ఎవ్వరూ ఊహించని తుపాను సొంత ఇంటి నుంచే మొదలైంది. సాధారణంగా ఒక పార్టీలో కుంపటి గానీ, అసంతృప్తి గానీ వేరే నేతల నుంచి రాజుకుంటుంది. కానీ, భారాసలో మాత్రం పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు కన్న కూతురు కవిత నుంచే ఉత్తరం రూపంలో గుప్పుమన్నది. దీంతో అనేక రకాల సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. భారాసలో ఏక చక్రాధిపత్యం నడుస్తుందా? అధినేత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారా? పార్టీలో ప్రజాస్వామ్యం కొరవడిందా? నేతల అభిప్రాయాలు, సూచనలు చెప్పే అవకాశం కూడా లేదా? కెసిఆర్ ఒంటెద్దు పోకడలు నేతల నోరు కట్టేస్తున్నాయా? అందుకే మాటల్లో చెప్పలేక కవిత లేఖ రాసిందా? లేకపోతే దీని వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? ఇలాంటి అనేక ప్రశ్నలు రాజకీయ నాయకులు, సామాన్య జనం మెదడు తొలుస్తున్నాయి. కెసిఆర్ కి తన అభిప్రాయాలను లేఖ రూపంలో తెలియజేయడం అలవాటే అనీ, గతంలో కూడా ఇలాంటి లేఖలు రాశానని కవిత కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. కెసిఆర్ కి రాసిన ఉత్తరం ఆమె దేశంలో లేని సమయంలో రోడ్డెక్కి కొడైకూయడం పలు అనుమానాలకు దారితీసింది. కవిత ఆ లేఖ తానే రాశానని, ఇదేమీ కొత్త కాదని, గతంలో కూడా కెసిఆర్ కి ఉత్తరాలు రాశానని స్పష్టం చేశారు. అయితే, ఈ సారి లేఖ వ్యవహారం బయటకు పొక్కడంతో కవిత ఆందోళన వ్యక్తం చేశారు.

ఉద్యమ పార్టీలో “వేగులు (కోవర్ట్ ముఠా) ఉన్నారని, కెసిఆర్ చుట్టూ దయ్యాలు” తిరుగుతున్నాయని ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రంలో రాజకీయ చర్చలకు తెర లేచింది. భారాసలో కీలక నేతగా ఉన్న కవిత నోటి నుంచి ఒక్కసారిగా అసంతృప్తి మాటల తూటాలు పేలడంతో ప్రతీ ఒక్కరూ అవాక్కయ్యారు. దీంతో కుటుంబ కలహాలు పార్టీకి చుట్టుకున్నాయా అనే సందేహం కలుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు జనాన్ని కలవని కెసిఆర్ కనీసం ఆరు నెలల పాటు జైలులో ఉన్న కూతురు కవితను ఒక్కసారి కూడా కలిసే ప్రయత్నం ఎందుకు చేయలేదనే వాదనలు మళ్ళీ రచ్చబండల వద్ద చర్చలుగా మారాయి. కవితకు పార్టీ విధానాలు నచ్చలేదా లేక కెసిఆర్ పోకడను విభేదిస్తోందా అనే అంశాలను రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ రజతోత్సవ సభలో కెసిఆర్ ప్రసంగంలోని లోపాలను లేఖలో ఎత్తి చూపిన కవిత, అమెరికా నుంచి రాగానే పేర్లు వెల్లడించకుండా వారికి దయ్యాల రూపం ఇచ్చి ఆవేదన వెళ్లగక్కారు. కెసిఆర్ దేవుడంటూ ఆయన చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయని, కోవర్ట్ లు చేరారని తీవ్ర పదజాలం వాడడం వెనుక బయటకు రాని బలమైన కారణం ఉందనేది స్పష్టం అవుతోంది. అయితే, కోవర్ట్ లు పార్టీలో అంతర్గతంగా ఉన్నారా లేక భారాస వ్యూహాలను వేరే పార్టీలకు చేర వేస్తున్నారా అనేది కవిత మాత్రమే చెప్పాల్సిన రహస్యం. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ప్రగతి భవన్ నుంచి ఆ దయ్యాలు ఉన్నాయా లేక అధికారం పోయాక ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అవి కెసిఆర్ చుట్టూ చేరాయా అనే బేతాళ ప్రశ్నలకు సమాధానం చెప్పించే మాంత్రికుడు ఎవరనేది అన్ని వర్గాలలో ఆసక్తికరమైన చర్చగా మారింది.