“గులాబీ” పై “కాషాయం”మోజు..!

lovebirds c

అయ్యో ఇదెక్కడి లొల్లి.. కెసిఆర్ బిడ్డ కవితక్క అలక బడితే తెలంగాణ సంగతేమో గానీ అటు దుబాయిలో బుర్జ్ ఖలీఫా బోసిబాయే… ఆస్ట్రేలియాలో “బతుకమ్మ” సతికిలబడే.. న్యూజిలాండ్ లోనూ గులాబీ “కివీస్” చిన్నబోయే…మొత్తంగా అక్క తిరిగిన అన్ని చోట్లూ అయోమయం… గందరగోళంగా మారిపోయే… పదేళ్లుగా అన్న, చెల్లెళ్ళు కలిసి సరదాలు, సంబురాలు చేసిన అమెరికా, ఐరోపా దేశాల్లో ఇదే వింత పరిస్థితి… ఉద్యమ పార్టీ కుటుంబంలో రాజుకున్న కలహాల వేడి ఇంత కాలం గులాబీ గుబాళించిన విశ్వం నలుమూలలా దావానలంలా వ్యాపించింది. రాజకీయం, తెలంగాణ సమస్యల విషయం పక్కకి వెళ్ళి కెసిఆర్ కుటుంబ వ్యవహారాలు ఏమిటనేది తాజా చర్చగా మారింది. భారాసలో బయటి వ్యక్తికి స్థానం కల్పించకుండా పార్టీ పగ్గాలను వీడని నాలుగు స్తంభాలలో (కెసిఆర్ , కెటిఆర్, కవిత, హరీష్ రావు) ఒక స్తంభం ఒరిగిపోయి ఎదురు తిరగడం పార్టీకి తీరని నష్టం. కవిత, కెటిఆర్ ల సంభాషణలే రచ్చబండల వద్ద, ఇంటి అరుగుల పైనా గుసగుసలుగా కనిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అసలు కెసిఆర్ ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం పోయాక ఫామ్ హౌస్ కే పరిమితమై మౌన మునిగా ఎందుకు మారారు అనే వాదనలు వస్తున్నాయి. ముఖ్యంగా కవిత సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా సొంత అన్నయ్య కెటిఆర్ ని లక్ష్యంగా చేసుకొని సంధించిన వ్యాఖ్యలు భారాసలో చర్చల రచ్చకు దారి తీశాయి. పార్టీలో ఒక్క కెసిఆర్ ని తప్ప కవిత కెటిఆర్ ని, ఆయన కోఠరీ పెత్తనాన్ని దుయ్యబట్టారు.

no loksabha

భారాసను భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడానికి కుట్ర జరుగుతోందనే కవిత మాటలు అత్యంత తీవ్రమైనవి. పార్టీలో కీలక నేతగా ఉన్న ఆమె ఆధారాలు లేకుండా ఈ విషయం బయటకు పెట్టారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విలీనం పై ఇప్పటికే పార్టీ ముఖ్యనేతల్లో చర్చలు జరిగే ఉంటాయని సందేహం వ్యక్తం చేస్తున్నారు. జైలులో ఉన్నప్పుడే విలీన ప్రతిపాదన తన దృష్టికి తీసుకువచ్చినట్టు కవిత స్పష్టంగా చెప్పారు. అంటే సుమారు ఏడాదికి పైగా భారాస, భాజపాల మధ్య గుట్టుచప్పుడు కానీ వ్యవహారం నడుస్తోందనేది కవిత మాటలతో తేలిపోయింది. అయితే, విలీన ఆలోచన కేవలం భారాస తరఫున మాత్రమేనా లేక భాజపా పాచికలు కూడా ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. కవిత వ్యాఖ్యలను బట్టి చూస్తే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టి, ఆధిపత్యం చెలాయించాలంటే భాజపాకు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ సహకారం అవసరం. అందుకే తమిళనాడు తరహాలో తెర వెనుక రాజకీయ వ్యూహం చేస్తున్నట్టు అర్థం అవుతోంది. కవిత చెప్పారంటే నూటికి నూరు శాతం విశ్వసనీయమైన సమాచారంగా నమ్మవచ్చు. కానీ ఆమె మిన్నటి చిట్ ఛాట్  సంభాషణాల్లో ఏ ఒక్క విషయానికి కూడా సూటిగా సమాధానం చెప్పకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, కెటిఆర్ పై ఉన్న అసహనాన్ని మాత్రం ఆయన పేరు చెప్పకుండానే వెల్లడించారు. ఇదిలా ఉంటే, బీజేపీలో భారాస విలీనానికి ఎవరితో చర్చించారో బయట పెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేయడం కొసమెరుపు. ప్రస్తుతం జరుగుతోంది కవిత కుటుంబ వ్యవవహారమని, దీనిపై ఎవరూ స్పందించవద్దని సూచించారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *