నాన్నకు “రాజకీయం”తో…

letter c

ఏడాది కాలంగా అధికారానికి దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపిన ఆయన బిడ్డ కవిత మధ్య ఎలాంటి కథ మొదలైంది. రాజకీయ అంశాలపై కవిత కెసిఆర్ కి రాసిన లేఖలో ఆంతర్యం ఏమిటనేది రచ్చబండ పై చర్చకు తెర లేపింది. తండ్రి మాట జవదాటని కవిత ఆయన తప్పిదాలను ఎత్తి చూపుతూ లేఖ రాయాల్సిన అవసరం పై రకరకాల వాదనలు మొదలయ్యాయి. ఈ లేఖపై సామాన్య జనంతో పాటు, రాజకీయ విశ్లేషకులు సైతం చాలా లోతుగా ఆలోచిస్తుంటారు. తెలంగాణలో తిరిగి ఉనికి చాటుకోవడానికి భారత రాష్ట్ర సమితి వేసిన మొదటి ఎత్తుగడగా కొందరు భావిస్తున్నారు. జాతీయ పార్టీలను అడ్డుకోవడానికి తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ అవసరం అనే విషయం పై భా.రా.స. అధినాయకత్వం కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. తమిళనాడు రాజకీయాల మాదిరిగా తెలంగాణ లోనూ మరో ప్రాంతీయ పార్టీ ఉండాలనేది భారాస అంతర్గత ఎజెండాలో ప్రధానంగా మారినట్టు సమాచారం. ఇదే విషయం కొన్ని సందర్భాల్లో బయటకు పొక్కింది.

kaviha airport 1
kcr kavitha 1

తిట్టిందా.. పొగిడిందా..!

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి దండయాత్ర చేయడానికి, ఓట్లను చీల్చడానికి రెండో ప్రాంతీయ పార్టీ అనివార్యమని భారస అధినాయకత్వం దృఢంగా భావిస్తోందని తెలుస్తోంది. ఈ వ్యూహంలో విజయం సాధిస్తే అధికారం తథ్యం అన్నట్టు భారాస అగ్రనేతలు విశ్వసిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల నుంచే సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే రాజకీయ చదరంగంలో కవితని బరిలోకి దించినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు మూడున్నర ఏళ్ల గడువు ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచే ప్రణాళికను ఆచరణలో పెడితే ఫలితం దక్కే అవకాశం ఉందని, ఆ దిశగా అడుగులు వేయడానికి ఇదే సరైన సమయమని భారాస నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కొందరు రాజకీయ వ్యూహకర్తల సలహాలను సైతం తీసుకున్నట్టు వెల్లడైంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఏడాది కాలంగా జరిగిన, జరుగుతున్న అనేక అంశాలు, విషయాలపై ఒకవైపు వివరిస్తున్నట్టు, మరోవైపు ప్రశ్నిస్తున్నట్టూ కవిత  కెసిఆర్ కి  లేఖ రాయడం విశ్లేషకుల అంచనాకు దగ్గరగా ఉంది. దీంతో ఫామ్ హౌస్ వేదికగా రాజకీయ వ్యూహ రచన జరుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

letter
ప్రచారంలో ఉన్న లేఖ

కవిత రాసిన లేఖలో పార్టీ నాయకురాలిగా తన వేదన వెళ్ళబుచ్చుకున్నట్టు కనిపిస్తోంది. భారాస రజతోత్సవ వేడుకల్లో కెసిఆర్ పసలేని ప్రసంగం చేశారనేది లేఖలో ప్రధాన లక్ష్యంగా అర్ధం అవుతోంది. కవిత లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తే కెసిఆర్ ని ఒకవైపు పొగుడుతూనే, మరోవైపు లోపాలను ఎత్తిపొడవడం రాజకీయంగా చర్చలకు దారి తీసింది. ప్రసంగమో  దాదాపు 17 అంశాలపై లోపం ఉందని కవిత వివరించింది. వరంగల్ లో సభ జరిగిన సుమారు నెల రోజులకు కవిత లేఖ బయటకు పొక్కడం ఏమిటనేది ఆ పార్టీ వర్గాలలో అనేక మందికి అంతుపట్టడం లేదు.. ఆమె లేఖలో  లేవనెత్తిన అంశాలను తండ్రితో  నాలుగు గోడల మధ్య చర్చించే వీలుంది. ఇంట్లో ఏ సంధర్భంలో అయినా ఆయనతో చర్చించే అవకాశం కవితకు ఉంది. పార్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి సోదరుడు కెటిఆర్ లేకుంటే హరీష్ రావు, సంతోష్ ల సహకారం తీసుకొని లేఖలోని అంశాలనే కెసిఆర్ కి వివరించవచ్చు అనే రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి. కవిత దేశంలో లేని సమయంలో, ఆమె రాష్ట్రానికి వచ్చే ముందు రోజు లేఖ బయటకు పొక్కడం మరో అంశం. విదేశీ పర్యటన నుంచి వస్తున్న కవితకు అభిమానులు స్వాగత సన్నాహాలు చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో కేవలం తెలంగాణ జాగృతి జండాలు మాత్రమే కనిపించాయి. భారాస జండాలు కనుమరుగు కావడం ఆశ్చర్య పరుస్తోంది. రెండు రోజులుగా తెరపైకి వస్తున్న వ్యవహారాలు ఒకవిధంగా చెప్పాలంటే కింది స్థాయి కార్యకర్తలను కొంత అయోమయానికి గురి చేస్తున్నాయి. సొంత  కూతురు తండ్రికి లేఖ రాయడం, కవిత స్వాగత కార్యక్రమంలో భారాస జెండాలు కనిపించక పోవడం, ఉద్యమ నేతగా పేరున్న కెసిఆర్ కి ఎలా మాట్లాడాలో కవిత సూచించడం, సలహాలు ఇవ్వడాన్ని కెసిఆర్ ఎలా స్వీకరిస్తారనేది పార్టీ వర్గాలలో ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *