కన్న తండ్రి కూడా మొహం చూడని కూతురు దారి ఎటు… నాన్న చుట్టూ దయ్యాలు చేరాయి అంటూ భారాస నాయకులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? తన “జాగృతి” ఊసు తప్ప భారత రాష్ట్ర సమితి (భారాస) పేరుని కూడా కవిత ఎందుకు ఉచ్ఛరించడం లేదు.. “లిక్కర్ క్వీన్” గా దేశ వ్యాప్తంగా పేరు గడించి, ఆరు నెలలపాటు తీహార్ జైలు జీవితం గడిపిన కవితను జనం నాయకురాలిగా ఎలా చేరదీస్తారు…. ఇలాంటి అనేక బేతాళ ప్రశ్నలు ప్రస్తుతం తెలంగాణ ప్రజల్లో మరింతగా పెరుగుతున్నాయి. ఈ సందేహాల విశ్లేషణలో భాగమే మీ కోసం “ఈగల్ న్యూస్” అందిస్తున్న ఈ కథనం.

కొద్ది రోజులుగా కవిత చేపడుతున్న కార్యక్రమాలు ఆమె సొంత ఎజెండాగా మారాయి. భారస ఎమ్మెల్సీ గా ఉంటూ ఆ పార్టీ జెండా ఆమె చుట్టు పక్కల గానీ, ఆ పార్టీ మాట గానీ కవిత నోట వినిపించడం లేదు. ఏదో సొంత పార్టీ నాయకురాలిగా వేదికలపై కనిపిస్తుంది. ఏ ఒక్క భారాస నేత ఆమె దరిదాపుల్లో కనిపించడం లేదు. కానీ, కవిత మాత్రం భారాస నాయకురాలిగా చెలామణి అవుతూ, తన “జాగృతి”ని మాత్రమే ప్రచారం చేసుకుంటోంది. అసలు ఆమె భారాస లో ఉన్నట్టా లేరా అనే అంశం సంశయంగా మారింది. కాళేశ్వరం డ్యామ్ లోపాల వ్యవహారంలో గత నెలలో విచారణకు వెళ్లినప్పుడు తండ్రికి బాసటగా ఎర్రవల్లి ఫామ్ హౌజ్ కి వెళ్లిన కవితకు అక్కడ అసలు విషయం అర్ధం అయింది. ఇంటికి వచ్చిన ఆడపడుచు వైపు కెసిఆర్ కన్నెత్తి చూడక పోవడం గమనార్హం. విచారణకు వెళ్తున్న తండ్రికి విజయ సంకేతాన్ని చేతికి కట్టాల్సిన ఆడపడుచు ఆమె ముందే వేరే వ్యక్తి ఆ పని చేస్తుంటే దూరంగా నిల్చుని చూడడమే కవిత వంతు అయింది. ఆ రోజు తండ్రి తనను దూరం పెట్టాడానే వేదన సైతం కవితలో స్పష్టంగా కనిపించింది. ఈ పరిణామం నిజంగా కవితకు పుట్టింట తీరని అవమానంగా నిలిచింది. ఈ తంతు మొత్తాన్ని తెలంగాణ సమాజం ఆలకించింది…ఆసక్తిగా తిలకించింది. అయితే, తండ్రి చుట్టూ దయాలు చేరాయనే వ్యాఖ్యను కెసిఆర్ తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. అందుకే ఇంటికి వచ్చిన బిడ్డను పలకరించడం కాదు, కనీసం ఆమె వైపు చూడకుండా “బిడ్డా.. ఆ దయ్యం నువ్వే” అని కెసిఆర్ మౌన సందేశం పంపినట్టు భారాస వర్గాలే చెప్పుకోవడం విశేషం.ప్రతీ కార్యక్రమంలో కెసిఆర్ ని వెన్నంటి ఉండే కవిత తండ్రి నుంచి గ్రహించిన మౌనాన్ని ఈ విధంగా అర్ధం చేసుకుంటుందో వేచి చూడాలి.
