అటవీ భూమిలో “రామదూత”…!

లంచాలకు అలవాటు పడ్డ అధికార యంత్రాంగం అండదండలతో భక్తి ముసుగులో మోసాలకు పాల్పడుతున్నాడు ఓ నకిలీ స్వామీజీ. అటు అటవీ శాఖ, ఇటు పంచాయితీ రాజ్ శాఖల అలసత్వం వల్ల ప్రభుత్వ స్థలాన్నే ఆక్రమించి పూటకో వేషంతో కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఈ “కొత్త దేవుడు”  సుమారు పాతికేళ్ళుగా బహిరంగ అక్రమానికి పాల్పడుతున్నా ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోందో అంతుపట్టని వ్యవహారం. ఇదంతా ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరులోని “రామదూత” ఆశ్రమంలో చోటుచేసుకున్నభాగోతం. జాతీయ రహదారి పక్కనే కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిలో తన లీలలు సాగిస్తున్నాడు. భక్తుల అమాయమత్వాన్ని అసగగా చేసుకోవడం ఒక ఎత్తైతే, ప్రభుత్వ అధికారులకు లంచాలు ముట్టజెప్పడం మరో కోణం. రెండు దశాభ్దలకు పైగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని ఏ అధికారి పట్టించుకోలేదు. ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోడానికి ఏ ప్రభుత్వమూ ప్రయత్నించక పోవడం పలు రకాల అనుమానాలకు దారితీస్తోంది. ఎవరో ఒక నిజాయితీ పరుడైన అధికారి అడుగు ముందుకు వేసినా పై నుంచి అభ్యంతరాలు రావడం పరిపాటైంది. అటవీ శాఖ, పంచాయితీ రాజ్ శాఖల ఆధీనంలోని సుమారు ఐదారు ఎకరాల పోరంబోకు భూములను ఆశ్రయ నిర్వాహకులు వెంకటేశ్వర్లు అక్రమించాడని ఆధారాలతో ప్రభుత్వానికి ఫిర్యాదు అందినా దాన్ని కాస్తా తోక్కిపెట్టారు.

raaduta

అయితే, గతంలో లోకాయుక్త “రామదూత” అక్రమాలను తీవ్రంగా పరిగణించి వెంటనే విచారణ జరపాలని ఆదేశించింది. దీంతో  తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటి  రెవిన్యూ శాఖ   ప్రిన్సిపల్ సెక్రటరి ఉషారాణి “రామదూత” పేరుతో ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని 15358 నంబరుతో 2021సంవత్సరం మే నెల 28వ తేదిన మెమో ద్వారా జిల్లా అధికారులను ఆదేశించారు.రెండేళ్ళు దాటినా ఆ ఆదేశాలను పట్టించుకున్న జాడ మాత్రం కనిపించలేదు. దీంతో విచారణకు వచ్చిన అధికారులు లంచాలు తీసుకుని నివేదికను తోక్కిపట్టారన్న విమర్శలు తలెత్తాయి. ఇదిలా ఉంటే చేవూరు గ్రామంలోని సర్వే నెంబర్ 879లో ఉన్న దాదాపు 40 ఎకరాల భూమి తనదే అంటూ ఆశ్రమంలో భారీ షెడ్ లను నిర్మిస్తూ, మొక్కలు నాటుతున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. బాహాటంగా జరుగుతున్న ఈ అక్రమాన్ని ప్రభుత్వమూ, అధికారులు పట్టించుకోకపోవడంతో న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షులు నార్నెవెంకటసుబ్బయ్య చెప్పారు. రాష్ట్ర రెవిన్యూశాఖ మంత్రికి కూడా ఈ అక్రమ ఆశ్రమం పై అవగాహనా ఉందనీ అయినా పట్టించుకోక పోవడం విచారకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *