సౌత్ గు”లాబీ” ఉచ్చులో కేజ్రీవాల్ …!

kavit kejri cf

ఢిల్లీ మద్యం కొనుగోళ్ల కుంభకోణానికి తెలంగాణనే ప్రధాన అడ్డాగా మారిందా ? ఆ వందల కోట్ల  గోల్ మాల్ తంతు కవిత కనుసన్నలలోనే జరిగిందా?  తెలంగాణాలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కవిత ఢిల్లీ మద్యం పాలసీలో అడుగు పెట్టిందా? నీతి, నిజాయితీ అంటూ “చీపురు కట్ట” పట్టుకొని అవినీతిని ఊడ్చి వేయాలనే సంకల్పంతో  రాజకీయాల్లోకి వచ్చిన  సివిల్ సర్వెంట్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్,  కవిత అవినీతి కోఠరీ వలలో చిక్కుకున్నారా? ఇలాంటి అనేక ప్రశ్నలకు కవిత ముఠానే కారణం అనే సమాధానం వస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని సమీకరణాలను పరిశీలిస్తే అదే వాస్తవం అనే సందేహం కలుగుతోంది.

kavita arest

తెలంగాణలో మద్యం వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యక్తి కవితకు కీలక సలహాదారుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో మద్యం పేరు వినిపిస్తే గుర్తొచ్చేది “మాగుంట” పేరు. విదేశీ మద్యం కానీ, ఐఎమ్ఎఫ్ఎల్ క్వాలిటీ కానివ్వండీ, ఛీప్ లిక్కర్ అనుకోండి మద్యం వ్యాపారంలో “మాగుంట” గ్రూప్ చేయి తిరిగిందనే విషయం రెండు రాష్ట్రాలలో అందరికీ తెలిసిన రహస్యమే. ఒకవిధంగా చెప్పాలంటే మద్యం వ్యాపారంలో అందే వేసిన చేయి “మాగుంట”. ఎక్కడ ఎలాంటి మద్యం విక్రయాలు చేస్తే మెరుగైన లాభాలు వస్తాయనేది అంచనా వేయడంలో పెట్టింది పేరు. అందుకే ఢిల్లీ మద్యం విధానంలో పక్కా ప్రణాళికను అమలు చేయడానికి వ్యూహం వేసింది. ఎవరితో చేతులు కలిపితే పథకం సమర్ధవంతంగా అమలు చేయవచ్చనేది ఈ సిండికేట్ ఆలోచన. ఇందుకు తెలంగాణలో మాంచి ఊపు మీద ఉన్న ఎమ్మెల్సీ కవితను ఎంచుకున్నారు. ఇదే విషయం సౌత్ లాబీలో అరెస్ట్ అయి  అప్రూవర్‌గా మారిన వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ కవిత మధ్యవర్తిత్వంతో కేజ్రీవాల్‌ని కలిసినట్లు విచారణలో వెల్లడైందని విశ్వసనీయ సమాచారం.

kcr kejriwl 1

కేజ్రీవాల్ ని కలవడానికి ఆప్ కీలక నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాజీ సెక్రటరీ సీ అరవింద్ సహకారం తీసుకున్నట్టు తెలుస్తొంది. తెలుగు వారైనా మద్యం వ్యాపార ఉద్దండుల కనుసన్నల్లో పని చేసే అభిషేక్ బోయినపల్లి, (రాబిన్ డిస్టిలరీస్‌లో డైరక్టర్) గోరంట్ల బుచ్చిబాబు( ఎకౌంటెంట్), అరుణ్ పిళ్ళై (మద్యం వ్యాపారి) పి. శరత్ చంద్రా రెడ్డి (అరబిందో గ్రూప్ – ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్)వంటి వారు ఢిల్లీ మద్యం విధానంలో వ్యవహరించాల్సిన దొడ్డి దారులను కవిత నేతృత్వంలో మనీష్ కి, ఆయన అనుచరులకు వివరించినట్టు తెలుస్తోంది. 2021-2022 ఢిల్లీ ఎక్సైజ్ విధానం నిబంధనలకు విరుద్ధంగా ఉందని,  వ్యాపారులకు వారి ఇష్టానుసారంగా  కోట్ల రూపాయల  మినహాయింపు ఇచ్చారనేది ఈ కేసులో ఉన్న ప్రధాన ఆరోపణ. అంతేకాక ఈ విధానం రూపకల్పనలో వందల కోట్ల రూపాయలు “క్విడ్ ప్రొ కొ”(నీకు ఇది.. నాకు అది) రూపంలో చేతులు మారాయనేది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అభియోగం.  దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన ఈ కేసులో వారం రోజుల కిందట కవిత అరెస్టు కావడం ఒక ఎత్తైతే, మొన్న నాటకీయ పరిణామాల మధ్య సాక్షాత్తూ దేశ రాజధాని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారం చర్చగా మారింది. లోక్ సభ ఎన్నికల తరుణంలో ఈ అరెస్టుల వ్యవహారం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *