నీళ్ళ కోసం అరి గోసలు పడి అల్లాడిన నల్లగొండ కన్నీళ్ళను తుడిచిన కార్యసాధకుడు కేసీఆరేనని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంచినీళ్ళ కోసం పడ్డగోసలు అన్నీ ఇన్నీ కావని 2014కు ముందు ఏ దినపత్రికను తిరిగేసినా తెలుస్తుందని చెప్పారు. ఒకనాడు సూర్యాపేటలో మంచినీళ్ళంటే మూసీ మురికినీళ్ళ మూట అని ఇప్పుడు ఎక్కడ చూసినా జలాల ఊటగా మారిందని అది నేడు తెలంగాణ అంతటా జలోత్సవంగా జరుగుతుందని తెలిపారు. హైదరాబాదు నుండి ఖమ్మం వెళుతూ మార్గమధ్యంలో సూర్యాపేటలో వీరాచారి డాబాలో ఆగిన జూలూరు అక్కడ మంచినీళ్ళను తాగి ఆనాటి నీళ్ళబాధను గుర్తు చేసుకున్నారు. ఇదే రోజు తెలంగాణ ప్రభుత్వం మంచినీళ్ళ పండుగను జరుపుకుంటున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో నీళ్ళుతాగాలంటే పచ్చటి రంగులోని నీళ్ళే తాగక తప్పని పరిస్థితి ఉండేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు సూర్యాపేట లాంటి అతిపెద్ద పట్టణానికి మంచినీటిని సరఫరా చేయడానికి మూసీలో బావి తవ్వి అక్కడి నుంచి తీసుకువచ్చేవారని అన్నారు. అక్కడి నుండి వచ్చిన మంచినీళ్ళను ఫిల్టరు బెడ్డుకు పంపి సరఫరా చేసేవారన్నారు. ఆ వచ్చిన నీళ్ళు కూడా పచ్చరంగులో ఉండేవి. మహానగర బస్తీ పాయిఖానా నీళ్ళు సూర్యాపేట బస్తీకి మంచినీళ్ళ క్రింద సరఫరా చేస్తున్నారని ఆనాటి జల ఉద్యమ నాయకుడు దుశ్చర్ల సత్యనారాయణ చేసిన ఆగ్రహ ప్రకటనను గుర్తు చేసుకున్నారు. ఇంత భయంకరమైనటువంటి సమస్యకు రాష్ట్రం వచ్చాక మంత్రి జగదీష్ వచ్చిన తర్వాతే సూర్యాపేట నీళ్ళ గోస తీరిందని ఆయన తెలిపారు. జగదీష్ చర్యలు చేపట్టక ముందు రెండు మూడు రోజులకొకసారి మంచినీళ్ళు సరఫరా చేసేవారు. మంచినీళ్ళు లేక సూర్యాపేట ప్రజలు వలసపోయే స్థితి వచ్చిందని హృదయవిదారకమైన విషయాన్ని కేసీఆర్ కు తెలియజేసి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు రెండు టియంసీల నీటిని తెప్పించి మంచినీటి సమస్యను తీర్చిన ఘనత జగదీష్ కే దక్కుతుందన్నారు. సాగర్ జలాలను దోసపాడు దగ్గర లిఫ్టు నుంచి అనాసి పురం చెరువుకు మళ్ళించి అక్కడి నుంచి మంచినీటి సప్లయి చేయడం జరిగిందన్నారు. జగదీష్ ఈ పని పూర్తి చేశాకే సూర్యాపేట మంచినీళ్ళ రంగు మారిందని మంచినీళ్ళు వచ్చాయని జూలూరు పేర్కొన్నారు.