ప్రశాంత్ కిషోర్… ఈ పేరు సామాన్య జనానికి అంతగా తెలియదేమో, కానీ, ఎన్నికల సంగ్రామంలో జరిగే రాజకీయ చదరంగంలో ఆయన ఒక వ్యూహకర్తగా పార్టీలకు, నాయకులకు సుపరిచితుడు. దశాబ్ద కాలం కిందట కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడంలో కిషోర్ వ్యూహం కూడా కారణం అనే ప్రచారం ఉంది. అంతే కాదు,2012వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో మోడీ మూడోసారి అధికారంలోకి రావడానికి కూడా ఆయనే ప్రధాన కారణం అనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ఆయన దేశంలోని వివిధ రాజకీయ పార్టీలను ఆకర్షించారు. ఒక్క బిజెపికి మాత్రమే కాదు,కాంగ్రెస్ పార్టీ సహా వై ఎస్ఆర్ సీపీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలకు సైతం ఆయన వ్యూహ రచనలు చేశారు.

2017 మే లో వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి కిషోర్‌ను తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. ఐ పాక్ సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీకి సమర శంఖారావం, అన్న పిలుపు, ప్రజా సంకల్ప యాత్ర అనే కొన్ని ప్రచార కార్యక్రమ వ్యూహలను సిద్ధం చేసింది. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలల్లో ఒక్కచాన్స్ నినాదంతో జగన్ అధికారంలోకి వచ్చారు. 2018 సెప్టెంబరు 16న జనతాదళ్ (యునైటెడ్) రాజకీయ పార్టీలో చేరారు. పౌరసత్వ సవరణ చట్టం (2019) అంశం పై ఆ పార్టీ అధినేత నితీష్ కుమార్ తో మనస్పర్థలు రావడంతో 2020 జనవరి 29న కిషోర్ ని జెడియు నుంచి బహిష్కరించారు. ఆ తరువాత ఆయన తిరిగి సర్వేల పై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే కొన్ని నెలల కిందట జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి శాసన సభ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రూపొందించారు. కానీ, ఫలితాల్లో అవి తారుమారు కావడం చర్చలకు దారి తీసింది. జాతీయ మీడియా కూడా ఆయన తప్పిదాలను ఎత్తి చూపాయి. కిశోర్ దశాబ్ద కిందట చేసిన సర్వేలతో పోలిస్తే ఈ మధ్య చేపట్టిన సర్వేలలో శాస్త్రీయత లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు. అందుకే ఫలితాలు భిన్నంగా వచ్చాయని పేర్కొంటున్నారు. ఆయా రాజకీయ పార్టీలు పెంచి పోషించిన ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు వేయడానికి కాలు దువ్వుతున్నారు.

తాజాగా ఆయన ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున పార్టీని లాంఛనంగా ప్రకటించనున్నట్టు పాట్నాలో వెల్లడించారు. 2025లో రాష్ట్రంలో తమ పార్టీ ప్రజా రంజక పాలన తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, బీహార్ వంటి రాష్ట్రంలో కిషోర్ ఒంటరి పోరు చేస్తారా లేక భారతీయ జనతా పార్టీ, జెడియు లను ఎదుర్కొనడానికి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో చేతులు కలుపుతారానే చర్చలు తెరపైకి వచ్చాయి. దేశంలో అత్యంత భిన్నంగా ఉండే బీహార్ ఓటర్ల మనసు దోసుకోవడానికి, సొంత గెలుపు కోసం, రాజకీయ పార్టీల మధ్య ఎదిగిన కిషోర్ ఎలాంటి వ్యూహాలు, ఎత్తుగడలు రూపొందిస్తారో తెలియాలంటే మరో కొన్ని నెలలు వేచి చూడాలి.