తనపై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, వ్యక్తులు, ప్రసార సాధనాల పై పరువునష్టం దావా వేస్తానని తెలంగాణలో ఉద్యమ పార్టీ నేతృత్వంలోని “ఒంటెద్దు” ప్రభుత్వంలో పదవీ విరమణ చేసినా కీలక పాత్ర పోషించిన సీనియర్ ఐఎఎస్ అధికారి జనవరి నెలలో చేసిన బెదిరింపులు అందరికీ గుర్తుండే ఉంటాయి. 2018లో కొత్తపల్లిలోని ఫార్మాసిటీ ప్రాంతంలో25 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు వచ్చిన బలమైన ఆరోపణల పై సోమేష్ వెంటనే స్పందించి వివరణ ఇచ్చారు.అదే సందర్భంలో ప్రసార సాధనాలకు వార్నింగ్ కూడా ఇచ్చారు.
తను కొనుగోలు చేసిన భూములు తమ కష్టార్జితం అనీ, ఎవరైనా దీనిపై మాట్లాడితే కోర్టు కు వెళ్తా అని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో 2018 సంవత్సరం లోనే వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు సోమేశ్ కుమార్ వెల్లడించారు. దీనికి ప్రభుత్వ అనుమతి కూడా ఉందని చెప్పారు. అయితే, అక్కడ ఫార్మా సిటీ అభివృద్ది చెందుతుందని తెలిసే సోమేష్ కుమార్ ముందుగా భూములు కొనుగోలు చేశారనేది ప్రధాన ఆరోపణ. ఎలాంటి సాగు లేని సుమారు 25 ఎకరాల 19 గుంటలు భూమి పేర 14 లక్షల రూపాయల మేర రైతుబంధు డబ్బు పొందినట్టు వార్తలు గుప్పుమన్నాయి.
నోరు మెదపని సోమేష్..!
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఆయన మరో వివాదంలో పీకల లోటు ఇరుక్కు పోయారు. భారత రాష్ట్ర సమితి హయంలో జరిగిన జీ.ఎస్.టి. అవకతవకల కేసు ఇప్పుడు సోమేష్ మెడకు చుట్టుకుంది. గుట్టు చప్పుడు లేకుండా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకొని ప్రయివేట్ సంస్థతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.ఈ కుంభకోణంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఇప్పటికే ఈ కేసులో వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిందితులుగా ఉన్నారు. వివిధ కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు ప్రాథమిక ఆధారాలతో సోమేష్ కుమార్ పై కూడా కేసు నమోదు చేసి ఐదో నిందితుడిగా గుర్తించారు. భూముల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలను అత్యంత చాకచక్యంగా తిప్పికొట్టిన ఆయన జీఎస్టీ కుంభకోణం పై పెదవి విప్పకపోవడం గమనార్హం. పోలీసులు నమోదు చేసిన కేసుపై సోమేష్ కుమార్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.