భారత న్యాయ వ్యవస్థ నిజంగా అత్యంత గౌరవ ప్రదమైనది. అందుకే దాని పని తీరును ప్రశ్నిస్తే నేరం, తెలివితక్కువ తనం. అది ఒక రాజ్యాంగ ఉల్లంఘన.. తెలిసి చేసినా, తెలియక చేసినా సుమోటో కింద విచక్షణ అధికారంతో కేసులు.. మరి అదే కోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా కొత్త తీర్పులు వెలువడితే..ఎవర్ని ప్రశ్నించాలి? దిక్కు ఎవరు? న్యాయ శాఖ మంత్రిని కలవాలా? రాజ్యాంగ నిబంధనల అమలు కర్త రాష్ట్రపతిని ఆశ్రయాయించాలా? ఒకవేళ ఆ సాహసం చేస్తే అదీ రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందా? అసలు న్యాయ వ్యవస్థలోఏ కేసు విచారణలోనూ ఇప్పటి వరకు ఏ ఒక్క బడా నేత, వ్యాపార వేత్త పరోక్షంగా జోక్యం చేసుకోవడం లేదా? న్యాయ దేవత సాక్షిగా సమాధానం చెప్పగలరా? ఇలాంటి అనేక ప్రశ్నకు సమాధానం కోరుతోంది నేడు దేశంలోని పాత్రికేయ కుటుంబం. సమాజానికి నాలుగో స్తంభంగా గుర్తిస్తూ విలేకరులకు వివిధ సౌకర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు భూములు కేటాయించడం పై సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించిన తీర్పు తీరు తెన్నులు తీవ్ర నిరసనకు దారి తీస్తున్నాయి. ఈ తీర్పు నేపధ్యంలో జర్నలిస్టులకు సైతం ఆత్మ గౌరవం ఉంటుదని చెప్పడానికే విశ్లేషణాత్మకంగా “ఈగల్ న్యూస్” ఈ కథనాన్ని అందిస్తోంది.జర్నలిస్టులకు నగరాల్లో విలువైన భూములను కేటాయించడం సమంజసం కాదని తాజాగా తీర్పు ఇవ్వడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక జిల్లాలో పని చేస్తున్న వారికి అదే ప్రాంతంలో కాక, ఇతర ప్రాంతాల్లోని అటవీ భూముల్లోనో, జనావాసాలు లేని నిర్జన ప్రాంతంల్లోనో భూములు ఇవ్వాలన్నట్టు పేర్కొనడం పట్ల పాత్రికేయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ తాజాగా “సుప్రీం” ఇచ్చిన తీర్పు ఉదాహరణగా నిలిచింది. 17 ఏళ్లుగా “సుప్రీం” గడప ముందు వేచి చూస్తున్న ఈ కేసు అసలు వ్యవహారం, తీర్పులు, వాటి తెన్నులను పరిశీలిస్తే ఇలా ఉంది.
ఇదెక్కడి న్యాయం “సుప్రీమ్”…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2007లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లోని విలేకరులకు అప్పటి నగర శివార్లలోని నిజాం పేట్, పేట్ బషీరాబాద్ ప్రాంతాల్లో కలిపి 70 ఎకరాల భూమి కేటాయించారు. అదే సమయంలో ఎంఎల్ఎ లు, ఎంపి లు, ఐఎఎస్, జడ్జిలకు కూడా వివిధ ప్రాంతాల్లో భూములు కేటాయించారు. వివిధ కోణాల్లో ఇది గిట్టని కొందరు కోర్టును ఆశ్రయించారు. దాదాపు 16 ఏళ్ల విచారణ అనంతరం ఎన్.వి.రమణ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న కాలంలో 2022 సంవత్సరంలో ప్రధాన కేసు నుంచి జర్నలిస్టులను విడదీసి వీరిని సమాజ సేవకులుగా గుర్తించి, ఇంటి స్థలాలు కేటాయించడం సమంజసమే అంటూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కూడా ఆయన అందులో స్పష్టం చేశారు. చాలీ చాలని జీతాలతో నిత్యం వార్తల కోసం తాపత్రయ పడే జర్నలిస్టులను ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారులతో సమానంగా చూడడం సరికాదని చెబుతూ ప్రధాన కేసు నుంచి విలేకర్ల కేసును విడదీసి మరీ జస్టిస్ రమణ తీర్పు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ తీర్పునకు అనుగుణంగా అప్పటి వరకు పెండింగులో ఉన్న పేట్ బషీరాబాద్ ప్రాంతం లోని 38 ఎకరాల భూమిని కూడా జవహర్ లాల్ నెహ్రు ముచ్యువల్ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ తంతు జరిగింది. మాజీ ప్రధాన న్యాయమూర్తి రమణ ఇచ్చిన తీర్పునకు తిరుగులేదని, మరి కొన్ని రోజుల్లో స్థలాలు తమ చేతికి వస్తాయని 11 వందల మంది సీనియర్ జర్నలిస్టులు ఆశ పడ్డారు. పడుతున్నారు. రమణ తీర్పు శిరోధార్యంగా ఊహించుకున్నారు. ఈ తీర్పు అనంతరం స్థలం అభివృద్ధికి అప్పులు చేసి మరీ కొండంత ఆశతో సొసైటీకి కొంత డబ్బు చెల్లించారు. ఇదంతా 2022లో జస్టిస్ రమణ పదవీ విరమణ చేయడానికి ముందు జరిగిన వాస్తవం. కానీ, ప్రధాన కేసు నుంచి జర్నలిస్టుల కేసును విడదీనప్పటికీ ఈ నెల 25వ తేదీన “సుప్రీమ్” వెల్లడించిన ప్రధాన కేసు తీర్పులో విలేకర్లను చేర్చడం అంతుపట్టని వ్యవహారంగా మారింది.
ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఖన్నా బెంచ్ ఇచ్చిన తీర్పులోని న్యాయ పరమైన అంశాలతో, గతంలో అదే చీఫ్ జస్టిస్ రమణ ఇచ్చిన తీర్పును బేరీజు వేసుకోలేక జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం లోని జస్టిస్ రమణ ఆధ్వర్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం, ఖాన్నా నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వెల్లడించిన తీర్పులలో ఏది వాస్తవం అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో రమణ ఇచ్చిన తీర్పు ఆధారంగా తమకు న్యాయం చేయాలని కోరుతూ కొందరు సభ్యులు రాజ్యాంగ అమలు అధిపతి అయిన రాష్ట్రపతిని సైతం కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే తీర్పు వాస్తవం అయితే, దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, మెట్రో నగరాల్లో జర్నలిస్టులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటి స్థలాలు కేటాయించడం ఇక పై సాధ్యం కాదని జర్నలిస్టు సంఘ నేతలు తేల్చి చెబుతున్నారు. రాజ్యాంగంలోని 14వ అధికరణకు విరుద్ధంగా ఈ కేటాయింపులు జరిగాయని సుప్రీంకోర్టు అభిప్రాయ పడడంపై కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి. అది కొత్తగా పుట్టుకు వచ్చిన ఆర్టికల్ కాదు. ఒకవేళ దాని కింద భూములు కేటాయించడం తప్పు అయితే దశాబ్దాలుగా సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్న అంశం పై సమాధానం ఏమిటనే ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. జర్నలిస్టుల విషయంలో జస్టిస్ రమణ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఒకసారి సమీక్షించాలని కోరుతున్నారు. సుప్రీమ్ తీర్పు అత్యంత దురదృష్టకరమని, మానవీయ కోణంలో ఆలోచించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం విజ్ఞప్తి చేస్తోంది. కార్పోరేట్ సంస్థలు చెల్లిస్తున్నట్టే, తాము కూడా ప్రభుత్వ విలువ మేరకు 17 ఏళ్ల కిందట భూమి కొనుగోలు చేశామని, ఈ 70 ఎకరాల విషయాన్ని ధర్మాసనం మరోసారి సమీక్షించాలని హైదారాబాద్ జవాహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ సభ్యులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సుప్రీం కోర్టు తీర్పు పై న్యాయ, సాంకేతిక పరమైన అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
కనీసం ఆలోచించండి..
“శాసనసభ్యులకు, సివిల్ సర్వెంట్లకు, జర్నలిస్టులతో ఏమి పోలిక? భారీ జీతాలున్నాయా, అంతకుమించిన భత్యాలున్నాయా, పెన్షన్లున్నాయా, కొందరు సమకూర్చుకునే భూరి అనధికార ఆదాయాలున్నాయా? న్యాయమూర్తులు ప్రభుత్వ ఔదార్యాలకు దూరంగా ఉండాలనుకుంటే అర్థం చేసుకోవచ్చు! అరకొర బతుకుల పాత్రికేయుల మీద ఈ నైతిక బండరాయి ఎందుకు? ప్రభుత్వం మంచి చేసుకోవాలనుకుంటే మాత్రం, యజమానులను కాదని మచ్చిక కాగలరా? పాలకులతో చేయి కలిపే యాజమాన్యాలను వారించగలరా?” ఇదీ తెలంగాణ లోని తల పండిన పాత్రికేయుల సూటి ప్రశ్న. ఈ తీర్పుతో “సమానత్వం” అనే పదానికి “సుప్రీమ్” తప్పక స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ సమయం కుడా వచ్చింది.