నరేంద్రమోడీ, నీరబ్ మోడీ, అదానీ… దేశంలో 2014 వరకు ఈ మూడు పేర్లలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే జనానికి తెలుసు. ఎన్.డి.ఎ. అధికారం చేపట్టక ముందు వరకు వ్యాపార రంగంలో అదానీ ఒక అడ్రస్ లేని వ్యక్తి. నీరబ్ మోడీ జాడ కూడా ఎవ్వరికీ తెలియదు. అలాంటి అనామకులు రాజకీయాల అండదండలతో దేశ ప్రజలు చూస్తుండగానే అనతి కాలంలోనే అపర కుబేరులుగా మారారు. వీళ్ళ అక్రమ మార్గాల ధాటికి దశాబ్దాలుగా వివిధ వ్యాపారాల్లో ఉన్న అనేక మంది కోలుకోలేని నష్టాల్లో కూరుకుపోయారు. దేశంలో ఒక వెలుగు వెలిగిన అనిల్ అంబానీ లాంటి వారే అందుకు ఒక ఉదాహరణ. పదేళ్లలో దేశంలోని వివిధ వ్యాపారాల్లో వేల కోట్ల పెట్టుబడులతో వైరస్ మాదిరిగా అత్యంత వేగంగా చొచ్చుకు పోయిన “అదానీ గ్రూప్” ఎదుగుదల నిజంగా ఆశ్చర్య పడాల్సిన విషయం. రాజు తలచుకుంటే దేనికీ కొదవలేదు అన్నట్టు విపక్షాలు మొర పెట్టుకుంటున్నట్టు మోడీ పుణ్యమా అంటూ అదానీ రూపంలో “కట్టల”పాము దేశాన్ని చుట్టి పడేసింది. ఒకవిధంగా చెప్పాలంటే వ్యాపార రంగాన్ని మింగే ఆర్థిక “అనకొండ”లా అవతరించింది. వ్యాపారాన్ని చేజిక్కించుకోవడానికి “అందితే ఫోన్ కాల్, అందక పోతే అవినీతి” అనే పాత సూత్రానికి అదానీ తన పద్ధతిలో గుజరాతీ మెరుగులు పెట్టారు. “నాకు అది – నీకు ఇది” అవినీతి దొంగ దారికి అమెరికా వీధులను సైతం వదల కుండా పక్కా వ్యూహాలు రూపొందించారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే అదానీ నామస్మరణ మొదలైంది. కేవలం ఆరేడు ఏళ్లలో టాటా, బిర్లా, అంబానీ లను తలదన్ని ఊహించని రీతిలో ఆర్థిక శిఖరాలను చేరుకున్నారు. దేశ కుబేరునిగా ఫోర్బ్స్ నుంచి పేరు గడించడమే కాకుండా, ఒక సందర్భంలో ప్రపంచంలోనే మూడో ధనవంతునిగా గుర్తింపు పొందారు.
అక్రమాల “అనకొండ” అదానీ..!
వంద కోట్ల సంపద అంటేనే మామూలు విషయం కాదు, అలాంటిది పదేళ్లలో అదానీ పది లక్షల కోట్ల పడగపై కుర్చున్నాడంటే సామాన్య విషయం కాదు. దేశం లోని ప్రతీ రాష్ట్రంలో ఆదాయాన్ని సమకూర్చే బడా కాంట్రాక్టులు మొత్తం ఏదో ఒక రూపంలో అదానీ చేతుల్లో చేరాయి. పెట్రోల్, గ్యాస్, గనులు, సిమెంట్, ఇనుము, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, అనేక ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ లావాదేవీలు ఒకటేంటి ప్రతీ వ్యాపారంలో అదానీ నరాలు విస్తరించాయి. ఆయన అకాల ఎదుగుదల వెనుక ఎవరున్నారనే సామాన్యుని ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోడీ అనే సమాధానం వస్తోంది. కేంద్రంలో ఆయన ప్రభుత్వం అధికారం చేపట్టడంతోనే అదానీ తెరపైకి రావడం, జెట్ స్పీడ్ తో కుబేర స్థానాన్ని అక్రమించడమే ఇందుకు కారణం. ఆర్థిక వేత్తలు సలహాల కంటే, అక్రమ వ్యూహాలు ఒక్కటే అదానీ ని అందనంత ఎత్తుకి తీసుకు వెళ్ళాయని ఆర్థిక రంగ విశ్లేషకులు అంచనా. కాంగ్రెస్ పార్టీ సైతం అది నుంచి ఇదే ఆరోపణ చేస్తూ వస్తోంది. అదానీ వెనుక మోడీ ఉన్నారా లేక ఇంకెవరైనా ఇతర నేతలు ఉన్నారా అనేది ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్న. అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ.) అదానీ భారత్ లో వెలగబెడుతున్న అక్రమాలపై అరా తీసిందంటే, ఆయన వెనక ఉన్న రాజకీయ “వెన్నుపూస” మోడీ పై కూడా కన్నేసి ఉంటారు. ఆకాలంలో అదానీ ఎదుగుదల వెనుక మోడీ, ఆయన ప్రభుత్వ ప్రోత్సాహం ఉందన్న సమాచారాన్ని కూడా అమెరికా నిఘా సంస్థ సేకరించినట్టు సమాచారం. లేకుంటే, అదానీ భారత దేశంలో లంచాలు ఇవ్వడానికి అమెరికా లాంటి అగ్ర దేశాన్ని ఎన్నుకునే సాహసం చేయరని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా అమెరికా అదానీ కేసు విషయంలో దాని పద్ధతిలో ముందుకు వెళ్తే అనేక వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.