ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లలో, చెవుల్లో, చేతుల్లో, మనసులో అవినీతి ఉందని, ఆయన అవినీతి ఆకాశాన్ని అంటిందని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ విమర్శించారు. అయన చేస్తున్న అవినీతిని అక్రమాలను కవర్ చేయడానికే మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేయడంలేదన్నారు. టీఎస్ హెచ్ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించలేదని, వారం రోజుల్లో కమిషన్ చైర్మన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సదాశివపేట పోలీసులపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అక్కడి సీఐ, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కేఏ పాల్ కోరారు.ధరణి ద్వారా తమ ఛారిటీ భూములు లాక్కున్నారని ఆరోపించారు.కేసీఆర్‌ను కలవడానికి వెళితే తనను అడ్డుకున్నారని, అవినీతి మీద ప్రశ్నిస్తున్న అని భయపడి తనను సీఎం కలవలేదన్నారు. ఎవరినైన ఫినిష్ చేసేస్తా అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని, నన్ను ఫినిష్ చేయలేవు కేసీఆర్.. నువ్వు ఫినిష్ అవుతున్నావని మండిపడ్డారు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి కేసీఆర్ సూచనల మేరకే తొలగించారాని, ఆయన స్నేహితుడైన కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షునిగా నియమించుకున్నాడని విమర్శించారు.