అనుకున్నట్టే జరిగింది. చారిత్రక భాగ్యనరంలోని జూబ్లిహిల్స్ శాసనసభ నియోజక వర్గ ఉప ఎన్నికలలో తిరిగి కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో రెపరెపలాడిన గులాబీ జెండా తలవంచింది. ఈ ఫలితంతో కారు షెడ్డుకి పోయి, దాని దొర ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యే సంకేతం జారీ అయినట్టు తేలిపోయింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన భారత రాష్ట్ర సమితి, దాని అధినాయకత్వం, మందీ మార్భలం సతికిల పడ్డట్టు అయింది. గత శాసన సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన భారాస ఆ ఓటమిని రాజకీయ కోణంలో చూస్తే బాగుండేది. అలా కాకుండా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పెద్ద తప్పు చేశారనే రీతిలో గులాబీ నేతలు ప్రచారానికి దిగడం పెద్ద దెబ్బగా భావించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై కెటిఆర్, కౌశిక్ రెడ్డి లాంటి నేతలు ఇష్టానుసారంగా ఆరోపణలు, దూషణలు చేయడం కూడా తెలంగాణ జనానికి నచ్చడం లేదనడానికి జూబ్లిహిల్స్ హిల్స్ ఎన్నికల ఫలితం ఓ ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
జూబ్లిహిల్స్ హిల్స్ ఫలితం కాంగ్రెస్ గెలుపు, భారాస ఓటమిని విశ్లేషిస్తే ఆసక్తికరంగా ఉంటుంది. గత ఎన్నికల్లో ఓటమి విషయం తెలియగానే తెలంగాణ సమాజం మీద అలిగినట్టు, లేదా కోపం వచ్చినట్టు అప్పటి ప్రగతి భవన్ ను రాత్రికి రాత్రే ఖాళీ చేసి సొంతూరుకి వెళ్ళి పోయిన గులాబీ దళపతి కేసిఆర్ సుమారు రెండేళ్లుగా బయటకు రావడం లేదు. ఆరోగ్యం బాగా లేకుంటేనో, బంధువులు చనిపోతేనో తప్ప బయటకు రావడం లేదు. సామాన్య జనానికే కాదు, పార్టీ నేతలకు, సొంత బిడ్డకు దూరం అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ జనాన్ని మరచి పోయారు.ఇక గులాబీ దళం, దాని అనుచర గణం నమ్ముకున్న “చిన్న సారు” (కెటిఆర్) కాంగ్రెస్ పార్టీ పై కంటే, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వ్యక్తిగతంగా కక్షగట్టినట్టు ప్రవర్తించడం మరో సమస్య. తన పార్టీ ప్రచారం కంటే రేవంత్ రెడ్డిని అడ్డంగా దూషించడం నిజంగా భారాసకు మరో దెబ్బ. అభివృద్ధి పనులను అడగాల్సిన విపక్షం వ్యక్తిగత వ్యవహారాలపై దృష్టి సారించడం పార్టీపై మరింత ప్రభావితం చూపే ప్రమాదం ఉందని పరిశీలకుల అంచనా.
జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారం విషయానికి వస్తే భారాస ఘోరంగా విఫలం అయింది. అక్కడ బలంగా ఉన్న మజ్లిజ్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించకపోవడం తమ పార్టీకే నష్టం అనే విషయాన్ని భారాస చాలా తేలికగా తీసుకుంది. చనిపోయిన ఎం.ఎల్.ఎ. గోపినాథ్ పై సానుభూతిని మాత్రమే నమ్ముకుంది. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు అదే గోపినాథ్ కుటుంబ వ్యవహారంపై గుప్పుమన్న రచ్చను భారాస రాజకీయంగా కనీసం కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయలేదు. ఇవ్వన్నీ పక్కన పెడితే భారాస అధినేత కేసీఆర్ జూబ్లిహిల్స్ లో అడుగు పెట్టకపోవడం పెద్ద తప్పిదం. ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గల్లీ లీడర్ల వరకు ఎవరి స్థాయిలో వాళ్లు ప్రచారం చేశారు. కానీ, కెసిఆర్ మాత్రం కన్నెత్తి కూడా చూడ లేదు. అసలు ఈ ఎన్నికను ఆయన ఎంత మాత్రం పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించ లేదు. ఇదే విషయం పై అదే పార్టీ నేతలు తీవ్ర అసంతృగా ఉన్నారు. కానీ, ఇది “తప్పు దొరా” అని చెప్పే సాహసం చేయలేక ఓటమిని అంగీకరిస్తున్నారు. రాజకీయ వ్యూహం లేకుండా ఎన్నికలలోకి దిగితే ఫలితం ఎలా ఉంటుందనే దానికి “జూబ్లీ” తీర్పు నిలువెత్తు నిదర్శనం.
