ఎవరైనా సరే బహిరంగంగా, అదీ జన సమూహం మధ్య ఆయుధాలు అంటే కత్తులు, తుపాకులు వంటి ప్రమాదకరమైన మారణాయుధాలు చేత పట్టడం, వాటిని ప్రదర్శించడం చట్ట పరంగా తీవ్రమైన నేరం. అలాంటి వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ కి మాత్రం అవేమీ వర్తించినట్టు కనిపిస్తోంది. దీనికి కారణం ఆయనకు ఆంధ్రాలో ఉన్న “పవర్” అహమా లేక తెలంగాణ పోలీసులపై గౌరవం లేక పోవడమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్ లోని ఎల్.బి. స్టేడియంలో జరిగిన “ఓజీ” సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమ వేదికపై పవన్ కల్యాణ్ కత్తితో కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. తల్వార్ పట్టుకొని వేదిక పైకి వచ్చిన పవన్ అదే కత్తిని తిప్పుతూ అభివాదం చేయడంతో పోలీసులు సైతం ఒక్కసారిగా విస్తుపోయారు. సాధారణ వ్యక్తులు ఎవరైనా ఇలాంటి మారణాయుధాలను బహిరంగ ప్రదేశాల్లో అదికూడా జన సమూహం ముందుగాని, ఎదుట గానీ చూపించినా, ప్రదర్శించినా ఆయుధ నిరోధక చట్టం కింద శిక్షార్హులని పోలీసు అధికారులే స్పష్టం చేస్తున్నారు. అలాంటిది, ఒక క్రేజీ సినీ నటుడై ఉండడమే కాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న కల్యాణ్ ఆయుధం చేతపట్టి జనం మధ్యకు రావడం అంతుపట్టని వ్యవహారమని చెపుతున్నారు. ఈ సంఘటన పై ఏ ఒక్కరు ఫిర్యాదు చేసినా చట్ట పరంగా పవన్ ఇబ్బంది పడాల్సి వస్తుందని పోలీసు ఉన్నతాధికారులే వివరిస్తున్నారు.

