

సిబిఐ…ఆ పేరు వింటే చాలు నేరస్తులు, హంతకులు, ఆర్ధిక మోసగాళ్ళు, అంతర్జాతీయ స్మగ్లర్లు ఇలా ఎవరికైనా గుండెల్లో గుబులు పుడుతుంది. ఏదైనా కేసు చేపడితే దాన్ని సమర్ధవంతంగా పూర్తి చేయగలమనేది ఆ శాఖాధికారుల గట్టి నమ్మకం. ఆ సత్తా కూడా సిబీఐకి ఉంది. అలా సాధించిన కేసులు అనేకం ఉన్నాయి. అందుకే ఇంత పెద్ద భారత దేశంలో దానికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం. అంతేకాదు, న్యాయం జరుగుతుందనే భరోసా. కేసుల విచారణలో ఆచితూచి వ్యవహరించే సిబీఐకి కొన్ని సందర్భాల్లో తల నొప్పులు తప్పడం లేదు. అప్పుడప్పుడు రాజకీయ ఒత్తిడులు, కొన్ని కేసుల్లో ఉన్నతాధికారుల ఉదాసీనత, మొదటి దశలోనే కోర్టుల జోక్యం ఇవ్వన్నీ సిబీఐ మనుగడకు సవాళ్లుగా మారుతున్నాయి. ఇంతకాలం దానిపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసేలా కనిపిస్తున్నాయి. ఇటివల జరుగుతున్న కొన్ని పరిణామాలు దీనికి అద్దం పడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాల్లో సిబీఐ పనితీరుపై ఒకింత సామాన్యుల్లో అసంతృప్తి పెరుగుతోంది. దానికి కారణం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వ్యవహారం. ఏళ్ళు గడుస్తున్నా అతీగతి లేదు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని డేడ్ లైన్ విధించే వరకూ కేసు విచారణ నత్త నడకలా సాగింది. అంతే కాదు, ఈ కేసు విచారణను తెలంగాణ పరిధిలోకి మార్చడంతో పురోగతి పై అప్పట్లో అంచనాలు పెరిగాయి. కానీ, ప్రధాన నిందితులుగా అరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు బెయిలుపై బయటికి వచ్చి దర్జాగా తిరుగుతున్నారు. సిబీఐ ప్రధానంగా అనుమానిస్తున్న ముఖ్యులు మాత్రం అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. దీనికి ఉదాహరనే వైఎస్ అవినాష్ రెడ్డి. ఆయన కనీసం విచారణకు కూడా ససేమిరా అనడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అరెస్టుకు మాత్రమె కాదు విచారణకు కూడా రాకుండా ఎత్తుకు పై ఎత్తులతో తప్పించు కోవడం సినిమా కథలను తలపిస్తోంది. విచారణకు హాజరుకావాలని సిబీఐ ఎన్ని సార్లు నోటిసులు పంపిన ఏదో ఒక కారణం చూపుతూ కాలయాపన చేయడం పరిపాటైంది. ఈ విషయంలో కొందరు సీనియర్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్బంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, సిబీఐ నోటిసులు పంపుతున్న అవినాష్ రెడ్డి కూడా వైసిపి కి చెందిన పార్లమెంట్ సభ్యుడే కాక, జగన్ కు దగ్గరి బంధువు కావడం. జగన్ కూడా గతంలో సిబీఐ నుంచి పాఠాలు నేర్చుకున్న అనుభవం ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. పుష్కర కలం కిందట కిందట వివిధ ఆరోపణల్లో జగన్ సిబీఐ నుంచి కొన్నిసార్లు నోటిసులు, మరి కొన్నిసార్లు ఏకంగా సమన్లు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ, పార్టీ అధ్యక్షునిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా జగన్ మాత్రం సిబీఐ నుంచి అందే ప్రతీ నోటిసుకి సానుకూలంగా స్పందించి, ఎక్కడ ఉన్నా గడువు తేదీన సంబంధిత అధికారుల ముందు హాజరయ్యేవారు. తనపై వచ్చిన ఆరోపణలు, నమోదైన కేసుల వెనుక ఉన్న అనేక కారణాలు తెలిసి కూడా జగన్ సిబీఐ అధికారుల నోటీసులను గౌరవించడం నిజంగా గొప్పతనమే.