గత రెండు రోజులుగా పుట్టలో పడుకున్న పాములు బయటకు వచ్చి నన్ను నిందించే ప్రయత్నం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ విధానాల గురించి వివరించి వారి సందేహాలను నివృత్తి చేసామని తెలిపారు. 24గంటల విద్యుత్ సరఫరా విషయంపై సాంకేతికంగా వివరించే ప్రయత్నం చేసామని, కేటీఆర్, బీఆరెస్ మా వీడియోను ఎడిట్ చేసి ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. బీఆరెస్ చిల్లర రాజకీయ ప్రయత్నంతో రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పై చర్చకు అవకాశం వచ్చిందని, వైఎస్ పాదయాత్ర చేసి ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి నెరవేర్చారని రేవంత్ గుర్తు చేశారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటన జరిగిన సందర్భంలో కేసీఆర్ హెచ్ఆర్డీ విభాగం అధ్యక్షుడుగా ఉన్నారని, బషీర్ బాగ్ కాల్పుల ఘటన సందర్భంలో కేసీఆర్ కీలక స్థానంలో ఉన్న కేసీఆర్ ఆనాడు ఉచిత విద్యుత్ సాధ్యం కాదని చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ హామీపై తొలి సంతకం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ మాత్రమే అని, రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థల పంపిణీ విషయంలో జైపాల్ రెడ్డి ఎంతో చొరవ చూపారు. జనాభా ప్రాతిపదికన కాకుండా వినియోగం ప్రాతిపదికన విద్యుత్ పంపకాలు జరపాలని ఆయన సోనియాను ఒప్పించారన్నారు. అందుకే తెలంగాణకు 53శాతం, ఏపీకి 47 శాతం విద్యుత్ ఇచ్చేలా ఆనాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.వ్యవసాయం అంటే ఏమిటో నాకు తెలుసు, నాగలి పట్టడం, గుంటుక కొట్టడం తెలిసిన వాడిని కేటీఆర్ లా నేను అమెరికాలో బాత్రూంలు కడగలేదని వ్యాఖ్యానించారు. వాస్తవంగా కేసీఆర్ 24 గంటలవిద్యుత్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని, కేసీఆర్ పాలనలో ఏ ప్లస్ గ్రేడ్ ఉన్న డిస్కంలు సీ మైనస్ కు పడిపోయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో మొదటి పది స్థానాల్లో ఉన్న డిస్కంలు కేసీఆర్ హయాంలో చివరి పడి స్థానాల్లోకి పడిపోయాయని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరతమని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17న మా మేనిఫెస్టోలో ప్రకటిస్తామన్నారు. నేను చంద్రబాబు శిష్యుడినని చెబుతున్నారు. మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారని, చంద్రబాబు దగ్గర చెప్పులు మోసిన మీరు నా గురించి మాట్లాడుతారా అని రేవంత్ విరుసుకుపడ్డారు. నేను పాస్ పోర్ట్ బ్రోకర్ కొడుకును కాదని, వరి వేస్తే ఉరే అని చెప్పిన నీచుడు కేసీఆర్ అని విమర్శించారు.