తెలుగు రాష్ట్రాల్లో అడవుల నుంచి వన్య ప్రాణులు జనారణ్యంలోకి రావడానికి నానారకాల కారణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని అదిలాబాద్,కరీంనగర్ జిల్లాల్లో, ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి, శ్రీ శైలం తదితర జిల్లాల్లో పచ్చని చెట్ల అడవులను వదిలి కాంక్రీట్ జంగిల్ లోకి ఎందుకు వస్తున్నాయనే చర్యలు మొదలయ్యాయి. వన్య ప్రాణుల స్వభావాన్ని బట్టి చూస్తే అవి సాధారణంగా జనావాసాల మధ్యకి వచ్చే అవకాశం లేదు. తమ ఉనికికి ముప్పు వాటిల్లే బలమైన ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే జన సంచారం వైపు చూస్తాయి. ఇటీవల జరిగిన వరుస సంఘటనలను బట్టి విశ్లేషిస్తే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా శేషాచల అడవులు విస్తరించి ఉన్న తిరుమలలో రెండు నెలలుగా చిరుతలు భక్తుల మధ్యకు వచ్చి దాడులకు పాల్పడిన ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. శేషాచల అడవుల్లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఎర్రచందనం చెట్ల నరికివేత, వాటి అక్రమ రవాణా వల్ల అడవి జీవాలు ఉనికిని కోల్పోతున్నాయి.
అదేవిధంగా మరో వైపు అధికారుల కనుసన్నల్లోనే విచ్చల విడిగా జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారం కూడా చిరుతలు, ఎలుగు బంట్లు బయటికి వస్తున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. అడవిలోని పలు చోట్ల మైనింగ్ కోసం జలెటిన్ స్టిక్ లతో భారీ పేలుళ్లు జరపడం సమస్యగా మారింది. ఈ భారీ శబ్దాలకు భయపడి వన్య ప్రాణులు జనారణ్యంలోకి పరుగులు తీస్తున్నాయి. కొంత కాలం కిందటి వరకు ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకునేందుకు జరిగిన కూంబింగ్ కూడా పడకేయడంతో కలప, ఎర్ర చందనం, మైనింగ్ మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే వాదనలు తలెత్తుతున్నాయి. గతంలో మాదిరిగా కూంబింగ్ ఆపరేషన్ జరిగితే సమస్య కొంత మేరకు పరిష్కారం అవుతుందని సీనియర్ పోలీసు, అటవీ శాఖల అధికారులు సూచిస్తున్నారు. తిరుమల కొండల్లో ముప్పై కి పైగా బోన్లు ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో పవిత్ర క్షేత్రం ఐన శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థాన ప్రాంగణంలోకి ఎలుగు బంటి రావడం మరో సమస్యగా మారింది. ఈ మధ్య అక్కడి నందీశ్వరుని విగ్రహం సమీపంలో ఎలుగు అడావిడి చేసింది.
ఇక తెలంగాణాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భద్రాచలం, ఏటూరు నాగారం, వరంగల్, అదిలాబాద్, కరీం నగర్ జిల్లాల్లోని అడవుల నుంచి కలప స్మగ్లర్ల నిర్వాకం వల్ల వన్య ప్రాణులు జనారణ్యంలోకి వచ్చే దుస్థితి నెలకొంది. డప్పు చప్పుళ్ళు, జిలెటిన్ స్టిక్ ల పేలుళ్ల శబ్ధాలు జంతువుల మనుగడకు సవాలుగా నిలిచాయి. సంబధిత అధికారులకు అన్ని విషయాలు తెలిసి కూడా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడం పట్ల పర్యావరణ వేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు చిత్త శద్ధితో స్మగ్లర్ల ఆగడాలను అరికడితే వన్యప్రాణులను కాపాడుకోవచ్చని అభిప్రాయ పడుతున్నారు.