తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత్ రాష్ట్ర సమితిలో (బి ఆర్ ఎస్)లో అసమ్మతి రాజుకుంటోందా? సిట్టింగ్ ఎమ్మెల్యేలు, గత ఎన్నికలలో టికెట్ ఆశించి భంగపడ్డ వారు తమ మనుగడ కోసం అధినాయత్వాన్ని సైతం లెక్కచేయకుండా భరిలోకి దిగవచ్చా? ఈ రెండు ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికలకు నాలుగు నెలాల ముందే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బి ఆర్ ఎస్ లో వర్గ పోరు గుప్పుమనడ అసమ్మతికి సంకేతంగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. దాదాపు అన్ని శాసన సభ నియోజక వర్గాల్లో ఈ సమస్య ఉన్నప్పటికీ అధిష్టానం నిర్ణయం కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. గత ఎన్నకల్లో పార్టీ అగ్రనేతల బుజ్జగింపులు, హామీలు, ప్రలోభాలకు తలొగ్గి బరిలో నుంచి తప్పుకున్న జిల్లా స్థాయి నేతలు ఐదేళ్లు గడిచే సరికి తమ మనుగడకు ప్రాధాన్యం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా అధినాయకత్వం మాటలు నమ్మి ఇప్పటికీ ఏ పదవీ లేని వాళ్ళు తిరుగు బావుటా పట్టే అవకాశం చాలా చోట్లా కనిపిస్తోంది. అంతేకాక, గత ఐదేళ్లుగా పార్టీ జెండా మోస్తున్న చోటా మోటా నాయకులు కూడా ఎన్నికల బరి వైపు చూస్తున్నారు. ఇప్పడికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజక వర్గంలో రభస రోడ్డెక్కడం చర్చకు తీసింది. అక్కడ బారాసలో అసమ్మతి గళం ఒక్కసారిగా బయటికి వచ్చింది. ప్రస్తుత ఎమ్మెల్యే హరిప్రియకు ఎట్టి పరిస్థతుల్లోనూ టికెట్ ఇవ్వొద్దనే నిరసన గళం వినిపిస్తోంది. ఆమెకు తప్ప ఇతరులకు టికెట్ ఇవ్వాలని నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలకు చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు ఇంట్లో సమావేశమై నిర్ణయించినట్టు సమాచారం అందుతోంది.
ఇదిలా ఉంటే మరోవైపు స్టేషన్ ఘనపూర్ బిఆర్ఎస్ టికెట్ రాజయ్యకే ఇవ్వాలని డిమాండ్ లేస్తోంది. ఆయనకు టికెట్ ఇవ్వాలంటూ కార్యకర్తలు నిరసనకు దిగడం గమనార్హం. హన్మకొండ హైదరాబాద్ జాతీయ రహదారిపై బైటాయించారు. ధర్నా చేసి సీనియర్ నేత కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు.డియం వద్దు రాజన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గం లోని సెగలు బయటకు వస్తున్నాయి. అక్కడి నుంచి ఈ సారి తనకే సీటు ఖాయం అని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కుండ బద్దలు కొడుతున్నారు. ఈ మేరకు ఆయన తన అనుచరులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.
మంత్రి పదవి గానీ, రాజ్యసభకు గానీ పంపుతామని అధిష్టానం చెప్పడంతో గత ఎన్నికల్లో వెనుకంజ వేసిన మహేందర్ రెడ్డి ఇప్పుడు మాత్రం ఆ సీటు వదులుకునేలా లేరని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే మహేందర్ రెడ్డి విషయంలో పార్టీ అధినేత నిర్ణయం ఎలా ఉంటుదనేది తెలియాల్సి ఉంది. ఇదే సందర్భంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పరిస్థితి ఏమిటనేది చర్చకు వస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బిజెపిలు కొంత మేరకు పుంజుకున్న తరుణంలో బి ఆర్ ఎస్ లో బయటికి వస్తున్న అసమ్మతి సెగలను ఎలా అణచివేస్తుందనేది అధిష్ఠానం నిర్ణయం పై ఆధారపడి ఉంది. రాబోయే ఎన్నికల్లో 100 సీట్లు కైవసం చేసుకోవాలనే అంచనాలతో ఉన్న పార్టీ ఏలాంటి ఎత్తులు వేస్తుందో వేచి చూడాలి.