తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి కొందరు ప్రముఖులు, రాజకీయ నేతలు స్పందించక పోవడం విస్మయం కలిగిస్తోంది. జాతీయ స్థాయిలో కొందరు నాయకులు ఆయనను ఏదో రూపంలో పరామర్శిస్తుంటే అయన దగ్గర పనిచేసిన అనేక మంది స్పందించక పోవడం చర్చనీయాంశంగా మారింది. మమత బెనర్జీ, అఖిలేష్, రజినీ కాంత్ వంటి వారు తమ సానుభూతి తెలిపారు. కానీ, ఆయనతో అంటకాగిన తెలుగు రాష్ట్రాల నేతలు మాత్రం ఎలాంటి ప్రకటన చేయక పోవడం రాజకీయ పరిశీలకులను ఆలోచనలో పడేసింది. సాక్షాత్తూ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికీ స్పందించక పోవడాన్ని తెలుగుదేశం పార్టీ అభిమానులు తప్పు పడుతున్నారు. అంతేకాక అయన హయాంలో పదవులు పొందిన నేతలు సైతం పట్టనట్టు వ్యవహరించడం రాజకీయ ధోరణికి అద్దం పడుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎలాంటి ప్రకటన చేయక పోగా, అయన తనయుడు, మంత్రి కెటిఆర్ ఆ రాష్ట్రం సమస్య మాకెందుకు అని వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు మొదట చంద్రబాబు అరెస్టు పై స్పందించినా ఆ తర్వత ఎలాంటి ప్రకటన లేకపోవడాన్ని టిడిపి శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. ఇవ్వన్నీ చూస్తుంటే నిజంగా చంద్రబాబు నైపుణ్య అభివృద్ధి నిధుల దుర్వినియోగం లో అక్రమాలకు పాల్పడ్డరా అనే సందేహం తలెత్తుతోంది.