హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలకు సంబంధించి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పూర్తి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. శుక్రవారం ప్రగతిభవన్ లో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ తో కలిసి ఈ విషయమై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్ నగరంలోని జర్నలిస్టుల సంఖ్య ఎంత..? అర్హులైన జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు, అందరికీ ఇళ్లు కేటాయించడానికి ఎంత స్థలం అవసరం అవుతుందనే విషయాలను చర్చ లో ఆరా తీశారు. దీంతో పాటు జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ కి సంబంధించిన స్థలాలను సభ్యులకు అప్పగించే విషయంపై కూడా చర్చ జరగగా మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. సుప్రింకోర్టు తీర్పు మేరకు పేట్ బషీరాబాద్ స్థలాన్ని సొసైటీకి అప్పజెప్పే విషయం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. ఎలాంటి అనుమానాలకు,అపోహలకు తావు లేదని, ఇప్పేపటికే కేటాయించిన పేట్ బషీరాబాద్, నిజాంపేట్ భూములు సొసైటీకి మాత్రమే చెందుతాయని కూడా హామీ ఇచ్చినట్టు తెలిసింది. హైదరాబాద్ నగరంలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్లు ఇచ్చే విధంగా వారం, పది రోజుల్లో పూర్తిస్థాయి స్పష్టతను ఇచ్చే దిశగా చర్చలు జరిగాయి. దీంతో హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న దాదాపు నాలుగు వేల మంది జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. శుక్రవారం జరిపిన చర్చల వివరాలు, అకాడమీ సమర్పించిన నివేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి కేటీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.