తెలంగాణ ఉద్యమంలో అమరులైన త్యాగదనులకు నివాళిగా ఉద్యమ పార్టీ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన అమరవీరుల స్మారక కేంద్రం “అమరజ్యోతి” నిర్మాణ వ్యయంపై క్రమంగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఉద్యమ స్ఫూర్తి ఉట్టిపడేలా, చూడగానే అమరులను స్మరించుకునేలా సకల హంగులతో నగరం నడిబొడ్డున తళుకులీనుతున్న అమరజ్యోతి నిజంగా తెలంగాణకు గర్వకారణమని చెప్పడంలో సందేహం లేదు. దాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పం కలిగినందుకు అప్పటి ప్రభుత్వాన్ని కొనియడక తప్పదు. అమరజ్యోతి కేంద్రాన్ని అద్భుతంగా రూపకల్పన చేసినందుకు అధికార యంత్రాంగాన్ని సైతం ప్రతీ ఒక్కరు అభినందించాల్సిన అవసరం ఉంది. సుమారు ఐదేళ్ళ నిరంతర శ్రమతో జాతీయ, అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు దీని నిర్మాణంలో పాలుపంచుకున్నాయి.
గత ఏడాది జూన్ నెలలో అత్యంత కనుల పండువగా దీన్ని ప్రాంభించారు. కళా విన్యాసాలు, లేజర్ షోల మధ్య ప్రజలకు అంకితం చేశారు. తెలంగాణ గడ్డ మీద చిరకాలం నిలిచిపోయేలా చేపట్టిన ఈ నిర్మాణం పై ఇప్పుడిప్పుడే ఆరోపణలకు తెర లేస్తోంది. హుస్సేన్ సాగర్ నదీ తీరాన 3.29 ఎకరాల్లో కొలువుదీరిన ఈ కేంద్రానికి దాదాపు 178 కోట్ల రూపాయల వ్యయం అయినట్టు చెప్పడం అనుమానాలకు దారి తీస్తోంది. మూడు అందస్తుల నిర్మాణానికి అంట మొత్తంలో ఖర్చు అవడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. కొందరు స్ట్రక్చరల్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలకు చెందిన వారు సైతం అధ్గికారుల లెక్కలు చూసి నివ్వెర పోతున్నారు. మొదట్లో 80 కోట్ల రూపాయల మేర అంచనా వేసిన ఇదే ప్రాజెక్టుకు దుబాయ్ కి చెందిన సంస్థతో జరిపిన చర్చల అనంతరం అదే వ్యయాన్ని ఒక్కసారిగా 178 కోట్ల రూపాయలకు పెంచడం గమనార్హం. 2.88.461 చదరపు అడుగుల (బిల్డ్ అప్) ప్రాంతంలో రెండు సేల్లార్లు, నలుగు అంతస్తుల నిర్మాణానికి ఎంత సాంకేతక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా అన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం లేదని రోడ్లు, భవనాల శాఖకు చెందిన కొందరు అధికారులే వెల్లడించడం గమనార్హం. పలుఫులు సీనియర్ ఇంజనీర్లు సైతం ఇదే అంశాన్ని లేవనెత్తడం అనుమానాలకు దారి తీస్తోంది.
కన్సల్టెన్సీలు, నిర్మాణ సంస్థలు,అమర జ్యోతిని పర్యవేక్షించిన నేతలు, అధికారుల మధ్య కోట్ల రూపాయలు చేతులు మరి ఉండవచ్చుననే బలమైన ఆరోపణలు వస్తున్నాయి. నిర్మాణ వ్యవహారమలో దుబాయ్ నిర్మాణ సంస్థతో సంప్రదించడం, నిర్మాణానికి ఉపయోగించిన స్టీలుని జర్మనీ దేశం నుంచి దిగుమతి చేసుకోవడం మూలంగా సామాగ్రి కొనుగోలు వ్యయం కంటే నిధుల దుర్వినియోగం ఎక్కువగా జరిగి ఉండవచ్చనే వాదనలు గుప్పుమంటున్నాయి. దీని నిర్మాణ పటిష్టత కోసం వంద మెట్రిక్ టన్నుల స్టీలు(క్లాడింగ్), మరో 15 వందల టన్నుల సాధారణ స్టీలుని వినియోగించినట్టు అధికారుక లెక్కలు చెబుతున్నాయి. అయితే, మన దేశంలో స్టీలుకి సంబంధించి అనేక బడా కంపెనీలు ఉన్నప్పటికీ స్టీలు ప్యాబ్రికేషన్ కోసం దుబాయ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మన దేశం నుంచి ఇతర దేశాలకు నాణ్యమైన స్టీలు ఎగుమతి అవుతుంటే బయటి దేశాల నుంచి దాన్ని దిగుమతి చేసుకోవలసిన అవసరం ఏమిటనేది అంతుపట్టని వ్యవహారమని కొందరు సాంకేతిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అమర జ్యోతికి అయిన వ్యయం పై నిపుణుల పర్యవేక్షణలో తిరిగి అంచానా వేయిస్తే అసలు విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందనే సూచనలు వస్తున్నాయి. అప్పట్లో ఓ కీలక నేత జ్యోక్యం వల్లనే దుబాయ్ సంస్థతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. అత్యంత సున్నితమైన ఈ వ్యవహారంపై ప్రస్తుత ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.