ఎవరి “మార్కు” పాలన..!

babu mark c

ఆంద్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కొత్త ప్రభుత్వ పాలన అందరినీ ఆకర్షిస్తోంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు  పరిపాలన ఆలోచనలు, రూపొందించే వ్యూహాలు ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తాయనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిన విషయమే. నెల రోజుల పాలనలో రాష్ట్ర అభివృద్ది కోసం ఆయన పడుతున్న ఆరాటం ప్రతీ ఒక్కరూ చూస్తూనే ఉన్నారు. అమరావతి అభివృద్ది, విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారం, భోగాపురం విమానాశ్రయ నిర్మాణం, రైతు సమస్యల పై ముఖ్యమంత్రి చేస్తున్న కృషి ప్రశంసలు పొందుతోంది. అయితే, నెల రోజుల ఆయన పాలనలో తెర వెనుక మరో కోణం కూడా కనిపించడం విశేషం. రాజకీయాల్లో చతురుడిగా, పాలనలో ముఖ్య కార్యనిర్వణాధికారి (సిఈఓ)గా పేరున్న చంద్రబాబు నాయడు ప్రభుత్వంలో కనిపిస్తున్న కొత్త కోణం పై “ఈగల్ న్యూస్” ప్రత్యేక కథనం.

babu lokesh in

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కి పదేళ్ల పాటు, విభజన తర్వాత ఆంధ్రా కు ఐదేళ్ళ పాటు సమర్ధవంతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు నిర్వహించారు. ఇది అందరికీ తెలిసిన సంగతే. హైదారాబాద్ నగరాన్ని “హైటెక్ ” ఆలోచనలతో అభివృద్ధి చేసి, ప్రస్తుతం అమరావతి రూపకల్పనకు తాపత్రయ పడుతున్నారు. రానున్న కాలంలో అమరావతి నగర అద్భుతాన్ని కూడా ప్రజల ముందు ఆవిష్కరిస్తారనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఆ దిశలో ముమ్మర ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇక, ఐదేళ్ళ జగన్ ప్రభుత్వం పై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిన చంద్రబాబు ఆంద్రప్రదేశ్ కి రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అయితే, గతంతో బేరీజు వేస్తే ఆయన పాలన విధానం, పద్ధతిలో స్పష్టమైన తేడా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఆయన పాలనలో గతంలో ఎన్నడూ చూడని సంఘటనలు ఈ సారి వెలుగు చూస్తున్నట్టు చెబుతున్నారు.

ycp3

శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయడంలో బాబుది అందెవేసిన ఆలోచన. అలాంటిది, ఆయన అధికారంలోకి వచ్చీ రావడంతోనే వివిధ జిల్లాల్లో నేర పూరిత ఘటనలు రాజుకున్నాయి. ఎన్నికల ఫలితాల రోజు నుంచే అనేక ప్రాంతాల్లో పరస్పర దాడులు మొదలయ్యాయి. అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే తెలుగు దేశం పార్టీ నేతల్లో అవేశం పెరగడం, కొందరిని అరెస్టు చేయడం, ఆస్తుల కూల్చి వెతలు, ఘాటైన విమర్శలు చంద్రబాబు పాలన తెరపై కనిపించడం కొంత మేరకు ఆందోళన కలిగించే అంశం. కక్ష సాధింపులో కూడా అచితుచి ఆలోచించి, అవకాశం కోసం ఎదురు చూసే బాబు, అధికారంలోకి రాగానే ఆ చర్యలను ఎందుకు కట్టడి చేయలేక పోతున్నారనేది చర్చలకు దారి తీస్తోంది.అయితే, గత ప్రభుత్వ తీరు ఒక్కటే దీనికి  ప్రధాన కారణం అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వైసిపి పాలనలో తమపై జరిగిన వేధింపులు, దాడులు, అరెస్టులు వంటి అంశాలు తెలుగుదేశం అధినాయకత్వం, పార్టీ శ్రేణుల్లోనూ ఈ ఆవేశానికి కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 15 సంవత్సరాలు రెండు రాష్ట్రాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అల్లర్లు, కక్ష సాధింపు చర్యలకు తావు కనిపించేది కాదని, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఆ సూచనలు స్పష్టంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలకు చంద్రబాబు అరెస్టు ఒక్కటే ముఖ్య కారణంగా అంచనా వేస్తున్నారు.

ycp offic demol

చంద్రబాబు అరెస్టుతో కసితో ఉన్న టిడిపి శ్రేణులు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో పరిస్థితులు గందరగోళంగా మారాయి. బాబు అధికారంలోకి రాగానే వైసిపి కార్యాలయాన్ని నేలమట్టం చేయడం, మరో పది జిల్లాల్లోని కార్యాలయాలకు నోటీసులు జారీ చేయడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వివిధ జిల్లాల్లో వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసి అరెస్టుల వరకు వెళ్ళడం మరో తంతు. రామకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై కేసు పెట్టడం, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామ ఆంజనేయులు, సునీల్ కుమార్, డాక్టర్ ప్రభావతిలను సైతం ఇరికించడం చంద్రబాబు పాలన “మార్కు”కి భిన్నంగా ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. అదే దారిలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం పై భూవివాదం కేసు నమోదు చేశారు. అరెస్టు సమయంలో చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే టిడిపి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఫిర్యాదుపై వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు అయింది.

ycp6

తాజాగా అన్నమయ్య జిల్లా మొలకలచెరువులో వైసీపీకి చెందిన మాజీ సర్పంచ్ రవీంద్ర రెడ్డి పై టిడిపి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.కుప్పం  మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ సుధీర్ కి చెందిన ఆసుపత్రిపై రాళ్ళతో దాడి చేయడం వివాదానికి దారి తీసింది. కాకినాడలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. ఇలా బాబు అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆయన గతంలో చేసిన 15 ఏళ్ల పాలనలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ కనిపించలేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట జరుగుతున్న ఘటనలు చంద్రబాబు “మార్కు” పాలన మారిందా అనే ఆలోచనలు రేకెత్తుతున్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *