గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం రానున్న బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించాలని గల్ఫ్ జెఏసి బృందం హైదరాబాద్ లో మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ లను వేరు వేరుగా వినతి పత్రాలు సమర్పించారు. గల్ఫ్ తదితర దేశాల లోని వలస కార్మికుల సంక్షేమం కోసం ‘గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని, సమగ్ర ప్రవాస భారతీయుల విధానం (ఎన్నారై పాలసీ) ప్రవేశపెట్టాలని వారు కోరారు. రాష్ట్ర గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ సంఘాల నాయకులు దొనికెని క్రిష్ణ, మంద భీంరెడ్డి, గంగుల మురళీధర్ రెడ్డి, తోట ధర్మేందర్ తదితరులు గల్ఫ్ జెఏసి బృందంలో ఉన్నారు. గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి స్పష్టమైన జీవో విడుదల చేయాలని, గల్ఫ్ తదితర దేశాలకు వెళ్లిన వారి గురించి సమగ్ర సర్వే చేయించాలని, రేషన్ కార్డుల నుండి, ఓటర్ లిస్ట్ నుండి గల్ఫ్ కార్మికుల పేర్లు తొలగించవద్దని విజ్ఞప్తి చేశారు.