గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ ప్రభుత్వంపై పగ పట్టినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షంగా వ్యవహరి చేయాల్సిన బారాస నేతలు రాష్ట్రంలో ఉద్యమ వ్యూహాలను అమలు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం అందుతోంది. ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని అడ్డుకోవడమే ప్రధాన ఎజెండాగా ఎంచుకోవడం, వీలున్న ప్రతీ అంశం పై చర్చలకు బదులు రచ్చ చేయడమే గులాబీ దళం లక్ష్యంగా ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారాస మహిళా సభ్యులపై చేసిన వ్యాఖ్యలను అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం పై కేటీఆర్ అతి దారుణంగా నాలుక జారడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. పదేళ్లుగా చెరువుల ఒడ్డున వెలసిన అక్రమ వ్యవసాయ క్షేత్రాలు, భవనాలను కులగొట్టడాన్ని సైతం కేటీఆర్ వివాదం చేయాలని ప్రయత్నించడం ఆశ్చర్యంగా ఉంది.ఒక్క జన్వాడ ,గండిపేట, కోకాపేట, మాదాపూర్,పోచారం, నల్లచెరువులే కాదు హైదరాబాద్ నలు చెరుగులా ఉన్న అనేక చెరువులు పదేళ్లలో అక్రమణలు మాత్రమే కాదు, కొన్ని చెరువులు కనిపించకుండా పోయాయి. ఇప్పుడు జాన్వాడ వ్యవహారంలో శాటిలైట్ బొమ్మలు చూపుతున్న మాజీ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కి మిగతా చెరువుల బొమ్మలు కనిపించడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే, పదేళ్లుగా తమ అధికారాన్ని ఏ మేరకు విస్తరించారో మహిళా కమిషన్ వద్ద జరిగిన వ్యవహారమే నిలువెత్తు సాక్ష్యం. దాదాపు అన్ని శాఖల్లో తెలంగాణ ముసుగు కప్పి భారాస “వేగు”లను ఏర్పాటు చేసుకున్నట్టు కమిషన్ కార్యాలయంలో కేటీఆర్ సమయం, సందర్భం లేకుండా రాఖీలు కట్టించుకోవడమే ఉదాహరణ. కమిషన్ లో నియమ,నిబంధనలకు కట్టుబడాల్సిన సభ్యులు కేటీఆర్ కి రాఖీలు కట్టడం ఏమిటనే వాదనలు తలెత్తాయి. ఆయన పై అంత అభిమానం ఉంటే మొన్నటి రక్షా బంధన్ రోజున ఇంటికో, ఫామ్ హౌస్ కో వెళ్ళి రాఖీలు కడితే బాగుండేదని సూచనలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి ఆయా సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిన దుస్థితికి దారితీసింది.
ఇదిలాఉంటే, మహిళా జర్నలిస్టులను సైతం భారాస తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం విడ్డూరంగా ఉంది. ముఖ్యమంత్రి సొంత ఊరులో రుణ మాఫీ విషయాలు తెలుసుకోవడానికి వెళ్లిన ఇద్దరు మహిళా పాత్రికేయుల వ్యవహారంలో తలెత్తిన వివాదాన్ని గులాబీ నేతలు తమ గంపలోకి ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు. చేశారు కూడా. పాత్రికేయ వృత్తి పరంగా వారిపై జరిగింది నిజంగా క్షమార్హం. కానీ, ఆ తర్వాత ఆ ఇద్దరు విలేకరులకు భారాసతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం సామాజిక మాధ్యమాలు ద్వారా ఒక్కసారిగా గుప్పుమనడంతో పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా మారింది.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని చులకన చేసి మాట్లాడడం, రక్షణ సిబ్బంది లేకుండా తాము రమ్మన్న చోటుకు రావాలని కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పట్ల రాజకీయ విశ్లేషకులు కూడా విస్టుపోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, ఇంటెలిజన్స్ భాగోతం, ఫార్ములా రేసు గోల్ మాల్, ధరణి లొసుగులు వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మల్లించడంలో భాగంగానే అధికార పార్టీ చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. ఉద్యమ సమయంలోనూ ప్రతీరోజూ ఏదో ఒక అంశాన్ని ఎజెండాగా తీసుకొని శ్రేణులను ప్రేరేపించినట్టే, ప్రస్తుతం ప్రభుత్వం పై గులాబీ శ్రేణులను ఉసిగొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.