వైద్య విద్యా శాఖలో బదిలీల తంతుకు అవినీతి చీడ పట్టినట్టు కనిపిస్తోంది. కొందరు సూపర్ స్పెషాలిటీ విభాగాల ప్రొఫెసర్ల బదిలీ వ్యవహారంలో కోఠి లోని డి.ఏం.ఇ. కార్యాలయం మొదలు సచివాలయంలోని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల చేతివాటం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మొన్నటి బదిలీల్లో వేరే ప్రాంతానికి వెళ్ళి పోవలసిన హైదారాబాద్ లోని వివిధ ఆసుపత్రుల సూపర్ స్పెషాలిటీ విభాగాల ప్రొఫెసర్లకు నేటికీ ఎలాంటి బదిలీ ఉత్తర్వులు జారీ చేయకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. వీళ్ళ బదిలీపై గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టడానికి సాక్షాత్తూ ఆరోగ్యశాఖ మంత్రి విజిలెన్స్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. సంఘాల నాయకులుగా చెప్పుకునే కొందరు ఉద్యోగులు, అధికారి కుమ్మక్కై బదిలీలను రచ్చ చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఒకేచోట ఉంటున్న వారిని గుర్తించి 40 శాతం మందిని తప్పనిసరి బదిలీ చేయాలనేది ప్రభుత్వ నిబంధన. ఏ శాఖ అయినా ఈ నిబంధనకు కట్టుబడి ఉండాలి. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ లోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కొందరు వైద్యులు తమ పై బదిలీ వేటు పడకుండా పావులు కదిపారు. వైద్య విద్య శాఖలోని కొందరు పై స్థాయి అధికారులు, సంఘాల నాయకులు కలిసి మూడో కంటికి తెలియకుండా వ్యవహారం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సుమారు 15 మందికి పైగా సూపర్ స్పెషాలిటీ విభాగాల ప్రొఫెసర్లపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వారిపై బదిలీల ఊసే లేకపోవడం గమనార్హం అవినీతి ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. వీరు దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కొనసాగడం అనుమానాలకు ఊతమిస్తోంది.
పైరవీలు పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారడం వల్లనే వీరికి ఉత్తర్వులు జారీ కాలేదని ఆరోగ్య శాఖ వర్గాల ద్వారానే తెలుస్తోంది. ప్రభుత్వం చెబుతున్నట్టు బదిలీల్లో వాస్తవంగా పారదర్శకత ఉంటే ఈ 15 మంది కూడా తప్పనిసరిగా బదిలీ కావలసిందే అని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. వీళ్లను బదిలీ చేయక పోవడం వల్ల అర్హత ఉన్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఈ విషయంలో ఆరోగ్య శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలని వివిధ ఆసుపత్రుల వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బదిలీలపై వస్తున్న ఆరోపణల పై విజిలెన్స్ బృందం విచారణ చేపట్టిందని, నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెప్పారు.