అంతిమ తీర్పు – అయోమయం..!

jnj sup2 c copy

భారత రాజ్యాంగం…బ్రిటిష్ పాలకుల మూలాలు ఉన్న దీన్ని, అందులోని అధికరణలను ప్రతీ భారతీయుడు నేటికీ విధిగా అనుసరించాల్సి ఉంది. ప్రతీఒక్క నిబంధనల్ని గౌరవించాలి. ఇది ప్రజాస్వామ్యంలో తప్పదు.
దేశ పౌరుల గౌరవాన్ని, తప్పు, చెడులను పర్యవేక్షిస్తూ గాడిన పెట్టే బాధ్యత దేశంలో న్యాయ వ్యవస్థది. దానికి అందరూ తలవంచక తప్పదు. విశాలమైన న్యాయ శాస్త్రంలో తలపండిన మూర్తులు చెప్పిందే శిరోధార్యం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇదే రాజ్యంగం దేశ పౌరులు తమ స్వేచ్ఛకు భంగం వాటిల్లినప్పుడు ప్రశ్నించే హక్కుని కూడా ప్రసాదించింది. దేశంలో సమానత్వ హక్కు చెప్పే ఆర్టికల్ 14కి ఎంత ప్రాధాన్యత ఉందో, ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడే, ప్రశ్నించే హక్కుకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాతిపదికనే జర్నలిజంలో మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న పాత్రికేయుడిగా ఈ కథనం రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టు ఇచ్చిన ఒక తీర్పుని విశ్లేషించే ప్రయత్నం చేస్తోంది మా “ఈగల్ న్యూస్”.

jnj members
జర్నలిస్టుల నిరీక్షణ

దేశంలో ప్రజల కోసం పనిచేస్తున్న మూడు స్తంభాలకు తోడుగా జర్నలిజానికి నాలుగో స్తంభంగ పాలకులు గుర్తించారు. చట్టం, న్యాయం, ధర్మాల సరసన పాత్రికేయాన్ని చేర్చారు. పాలకులకు , ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న పాత్రికేయ వృత్తికి అనేక నియమ, నిబంధనలు ఉన్నాయి. వాటికి లోబడే విలేకరులు పనిచేయాలి. ఆది నుంచి అదే చేస్తున్నారు..భవిష్యత్తులో కూడా చేస్తారు. అలాంటి ప్రయివేటు రంగంలో పనిచేస్తున్న కలం వీరుల సంక్షేమం కోసం దశాబ్దాలుగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది ఇంటి స్థలాల కేటాయింపు. సమాజంలో కేవలం సేవకే పరిమితమై, జీతాల పైనే జీవనం సాగిస్తున్న అర్హులైన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న జీవిత కాల ప్రయోజనం ఈ ఇళ్ల స్థలం. ఈ సౌకర్యానికి కూడా ఇటీవల సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఒక్కసారిగా గండి కొట్టింది.

jnj hanumth ravi
పోరాటానికి బాసటగా …

ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమానంగా జర్నలిస్టులను “ఎలైట్ గ్రూపు”గా పరిగణిస్తూ ఒక సిరా చుక్కతో ధర్మాసనం జర్నలిస్టుల ఆశలను తల కిందులు చేసింది. దీంతో అనేక రకాలుగా సంపాదించే ప్రజా ప్రతినిధులు ఎక్కడ, పెన్షన్ పొందే ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ అంటూ ఏ ఆధారం లేని విలేకరులు దిక్కు తోచని పరిస్థితిలో పడ్డారు.

ఆ తీర్పును గౌరవించరా!

ఇదిలా ఉంటే ఈ కేసుపై 2022 ఆగష్టు నెలలో సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ఇంటర్‌లోక్యుటరీ అప్లికేషన్ (ఎ.ఐ) లేదా మధ్యంతర తీర్పు లోని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా అదే కోర్టు నుంచి మరో ప్రధాన న్యాయమూర్తి గత నెలలో తీర్పు ఇవ్వడంతో జర్నలిస్టులు ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. జర్నలిస్టు సంఘాలు సైతం విస్తు పోయాయి. సుమారు 16, 17 ఏళ్లుగా కోర్టులో నలుగుతున్న హైదారాబాద్ సీనియర్ జర్నలిస్టుల ఇంటి స్థలాల కేటాయింపునకు చెందినా ఇదే కేసుపై 2022వ సంవత్సరంలో జస్టిస్ ఎన్వీ రమణ విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల కేసుతో జతగా ఉన్న జర్నలిస్టుల కేసుని జస్టిస్ రమణ ప్రత్యేకంగా పరిగణించారు. అందుకే ఆ ప్రధాన కేసు నుంచి జర్నలిస్టుల విషయాన్ని విడదీసి, చాలీచాలని జీతాలతో సమాజంలో నాలుగో స్తంభంగా పని చేస్తున్న విలేకరులను మిగతా వారితో పోల్చడం సరికాదని, జీవిత కాల ప్రయోజనం కింద హైదారాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇంటి స్థలాలు కేటాయించడం సమంజసమే అనే అభిప్రాయంతో జస్టిస్ రమణ వివరణాత్మకంగా తీర్పు ఇచ్చారు. దీంతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, జర్నలిస్టులు కూడా ఊపిరి కొంత పీల్చుకున్నాను. అంతేకాదు, వివాదంగా ఉన్న 38 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం గత సెప్టెంబర్ నెలలో సొసైటీకి బదిలీ చేసింది.

ramana judgmnt
మధ్యంతర తీర్పు

రేపో మాపో, ఇంటి జాగాలు చేతికి వస్తాయని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న సొసైటీ సభ్యులను గత నెలలో సుప్రీమ్ కోర్టు కోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పు తీవ్ర నిరాశకు గురిచేసింది. జస్టిస్ రమణ తీర్పును ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల ప్రధాన కేసుతో సమంగా అత్యంత తెలికాక జర్నలిస్టుల కేసుని సైతం జత చేసి ధర్మాసనం తీర్పు ఇవ్వడం ఇప్పుడు వాదనలకు తెర లేపింది. జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం ఇక మీదట దేశం లోని ఏ ఒక్క జర్నలిస్టుకి ఇంటి స్థలాలు దక్కే అవకాశం లేదనే ఆందోళన మొదలైంది. జర్నలిస్టు సంఘాలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరో ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ సభ్యులు అప్పట్లో ప్రభుత్వ నిబంధనల మేరకు డబ్బు చెల్లించి మరీ స్థలాలు కొనుగోలు చేశారనే ప్రాథమిక అంశాన్ని సుప్రీమ్ కోర్టు ఎందుకు లెక్కలోకి తీసుకోలేదంటున్నారు. వడ్డీ తో పాటు డబ్బు తిరిగి ఇవ్వడం ముఖ్యం కాదని, ఇది జర్నలిస్టుల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఈ కేసు పూర్వపరాలను ప్రస్తుత ధర్మాసనం మరోసారి సమీక్షించాలని జర్నలిస్టు సంఘాలు కోరుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *