బ్లాక్ టికెట్ కి “బెనిఫిట్” ముద్ర..!

benfit cf

అమాయక ప్రేక్షకుల నుంచి అడ్డగోలుగా డబ్బు గుంజే ప్రయత్నంలో సినిమాల “ప్రత్యేక ప్రదర్శన” అర్థమే మారిపోయింది.  చిత్ర పరిశ్రమ వ్యవహారంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వింత విధానాలు, నిర్మాతల “స్క్రీన్ ప్లే” విస్మయం కలిగిస్తున్నాయి. సినిమా తీసి దాన్ని డిస్ట్రిబ్యూటర్ (పంపిణీదారుల) వ్యవస్థ ద్వారా ప్రేక్షకులకు అందించాలనే పద్ధతి కొన్నేళ్ల కిందటి వరకు ఉండేది. ప్రజల డబ్బుతో బడా నిర్మాతలుగా ఎదిగిన కొందరు నిర్మాతలు మొదటి వారంలో డిస్ట్రిబ్యూటర్ లను పక్కన పెట్టి తమ పెట్టుబడిని రాబట్టుకోవడానికి ఏకంగా ప్రభుత్వాలనే “బ్రోకర్లు”గా మార్చారు. టికెట్ల అమ్మకాలలో కూడా తెలివిగా  ప్రభుత్వాలనే “బ్లాక్ టిక్కెట్లు” అమ్మిపెట్టే “వైట్ కాలర్” ఎజెంట్లుగా రంగంలోకి దించారు. దీంతో సినీ రంగం రాజకీయాలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తోందో సామాన్యులకు సైతం ఇట్టే తెలిసిపోతోంది. ఒక సినిమా విడుదల సమయంలో తెర వెనుక ఎలాంటి కథలు జరుగుతున్నాయో జగమెరిగిన సత్యం. ఈ ఆటలో సిగ్గూ, ఎగ్గూ లేని పావుగా తెరపై కనిపిస్తున్నది మాత్రం ప్రభుత్వాలే. అంతేకాదు, అడ్డు అదుపు, అవగాహన లేని సామాజిక మధ్యమాలది కూడా పెద్ద తప్పిదమే. ఒక సినిమా విడుదల కాకముందే, అది ప్రేక్షకులకు చేరక ముందే టీజర్లు, ప్రీ రిలీజ్ పేరుతో హైప్ (హంగామా) సృష్టించడం అటు మీడియాకు, ఇటు సామాజిక మధ్యమాలకు పరిపాటైంది. సినిమా హిట్ అవుతుందా, సతికిల పడుతుందా అనే విశ్లేషణ లేకుండా ముందే ఊదర కొట్టడం సమస్యగా ఉంది. ఫలితంగా సామాన్య ప్రేక్షకుడు నిలువునా నష్ట పోతున్నాడు. దశాబ్ద కాలం కిందటి వరకు పాతిక, ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ చూపుతూ తీసిన సినిమాలు డిస్ట్రిబ్యూటర్ ల దయాదాక్ష్యిన్యాలపై ఆధారపడి విడుదల అయ్యేవి. హీరో కి పది, ఇరవై కోట్లు ముట్టజెప్పడమే ఘనంగా ఉండేది. అలాంటిది, ఈ రోజు 400 కోట్లు, 800 కోట్లు అంటూ బహిరంగ గా లెక్కలు చూపుతూ సినిమాలకు క్లాప్ ఇస్తున్నా ఆ మొత్తం పెట్టుబడులపై కన్నెత్తి చూసే ప్రభుత్వం లేకపోవడం అనేది పెద్ద అనుమానం. ఒక సినిమా పై నిర్మాతలు వందల కోట్ల రూపాయలు  ఏ నమ్మకంతో ఎలా వెచ్చిస్తున్నారనే ప్రాథమిక సందేహం సంబంధిత అధికారులకు రాకపోవడం వెనుక ఆంతర్యం బేతాళ కథ మాదిరిగా ఉంది. కానీ, సినిమా పూర్తి అయిన తర్వాత ఈ బేతాళ కథ మరింత రక్తి కట్టిస్తోంది. “ట్రాయ్” అనే ఆంగ్ల సినిమాలోని భూమికను, అందులోని గ్రాఫిక్స్ ను కాపీ కొట్టి సొంత కథగా, సొంత ఆలోచనలుగా ప్రచారం చేసుకుంటూ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “బాహుబలి” సినిమాను ప్రభుత్వాలు  పొగడ్తలతో భుజాన వేసుకోవడం అప్పట్లో సినీ విమర్శకులు ఆశ్చర్య పరచింది. బాహుబలి లోని అనేక సన్నివేశాలు, చిత్రీకరణ తీరు “ట్రాయ్” సినిమాలో మాదిరిగానే ఉన్నాయంటూ విశ్లేషించే వారిని కూడా తెర వెనుకనే తొక్కి పట్టిన వ్యవహారం సినీ రంగ పెద్దలకు తెలిసిందే.

IMG 20241217 WA0015
హాలుకి “షో”కాజ్…

ఎవరి లబ్ధి కోసం….?

కొన్నేళ్ల కిందటి వరకు 10 రూపాయల ధర ఉన్న టికెట్ ని 15 రూపాయలకు అమ్మితేనే ఆలాంటి వారిని పట్టుకొని బ్లాక్ టికెట్ నేరమంటూ పోలీసులు నానా యాగి చేసిన సంఘటనలు సినిమాలపై అవగాహన ఉన్న వారికి గుర్తుండే ఉంటాయి. అలాంటిది 100 రూపాయల టిక్కెట్టుని 1000 రూపాయలకు పెంచుతూ అధికారిక ముద్ర వేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఎలా సంబోధించడానికి సరిపోయే పదాన్ని నిఘంటువుల్లో వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినీ పరిశ్రమలో పెద్ద సినిమా అనే ట్యాగ్ తో తెరలకు ఎక్కే బాహుబలి,  కల్కి, గుంటూరు కారం, ఆర్.ఆర్.ఆర్., అధిపురుష్, దేవర, ఆచార్య, సాలార్, పుష్ప వంటి సినిమాలకు ప్రభుత్వాలు టిక్కెట్లు ధరలు పెంచడం వెనుక ఉన్న రాజకీయం ఇప్పటికీ సామాన్యులకు అర్థం కావడం లేదు. సాధారణంగా ఒక సినిమా హాల్ లో అక్కడ వివిధ స్థాయిల్లో టిక్కెట్ ధరలు నిర్ణయించి ఉంటాయి. ఏ సినిమా వచ్చినా అదే ధరకు టిక్కెట్టు విక్రయించడం ఆనవాయితీ. కానీ, ఇక్కడే “సినీ – రాజకీయం” నడుస్తోంది. పెద్ద హీరో, పెద్ద నిర్మాత సినిమా వచ్చిందంటే ఆయా థియేటర్లలో నిర్దేశించిన ధరలకు ఒక్కసారిగా రెక్కలు వస్తున్నాయి. ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయం వల్ల సాధారణంగా ఉండే మల్టీ ప్లెక్స్ లలో 150 రూపాయల టిక్కెట్ ధర మొదటి వారం, పది రోజుల వరకు 1000, 800, 400, 300 రూపాయలుగా మారుతోంది. ఇక్కడే ప్రభుత్వాలకు, సినీ రంగానికి మధ్య ఉన్న లాలూచీ పై అనుమానాలు తలెత్తుతున్నాయి. సినిమాల్లో హీరో పారితోషకాన్ని వందల కోట్లకు పెంచి, కథ కంటే ఎక్కువగా పొంతన లేని అనవసర ఆకర్షణల కోసం అనేక కోట్లు నీళ్ల రూపంలో ధారపోసే నిర్మాతల గల్లా పెట్టెలను వారం, పది రోజుల్లోనే నింపే బాధ్యతను తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు భుజాన వేసుకుంటున్నాయో అంతుపట్టని అంశం. ఒక సినిమా విడుదలకు సిద్ధంగా ఉందంటే అందులోని నటులు, దాని నిర్మాతలు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడం, బెనిఫిట్ షో ముసుగు వేసి టిక్కెట్ల ధరలు పెంచేలా “కథలు” పడడం కొన్నేళ్ళుగా జరుగుతున్న బహిరంగ తంతు. అసలు టికెట్ల ధరలు ఎందుకు పెంచాలి అనే ప్రాథమిక ప్రశ్న లేకుండా ముఖ్యమంత్రులు సైతం నిర్మాతలు, నటుల రంగుల కలల్లో పడిపోవడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వాల ఈ అనాలోచిత నిర్ణయం ఫలితంగానే నేడు కొత్త సమస్య ఓ “సినిమా”గా మారింది.

పోలీసుల ముందు టీ “పుష్ప”

“పుష్ప -2” సినిమా నిర్మాతల కోసం  తలా,తోక లేకుండా ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షో అనుమతి ఒక కుటుంబాన్ని కోలుకోలేని సమస్యల్లో పడేసింది. ప్రకృతి వైపరీత్యాలలో నష్టపోయిన వారిని ఆడుకోవడానికి లేదా ఏదైనా సామాజిక సేవా కార్యక్రమం కోసం సినీ రంగం తన వంతు బాధ్యతగా ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి తీసుకోవడం గతంలో జరిగేది. కానీ, కేవలం పెట్టుబడులను రోజుల వ్యవధిలోనే రాబట్టుకోవాలనే కుటిల ప్రయత్నంతో నిర్మాతలు బెనిఫిట్ షో ల పేరుతో రాజకీయ నేతల కాళ్ళ బేరానికి తెగబడుతున్నారు. మార్కెట్లో సినిమా “హిట్”కొట్టిందా.. “బొమ్మ” పడిపోయిందా అనే ఫలితం తెలిసే లోపే ప్రభుత్వాలు, అధికారుల నిర్వకం వల్ల ప్రేక్షకులు నష్ట పోతున్నారు… నిర్మాతలు పెట్టుబడిని  బాక్స్ ఆఫీసు తెరవక ముందే పూడ్చుకుంటున్నారు. ఇదీ సినీ రంగం రాజకీయాలను ఆడించేందుకు తయారు చేసుకొని విజయవంతంగా అమలు చేస్తున్న “సుపర్ స్క్రిప్ట్”… తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూనుకొని, ఆలోచించి బెనిఫిట్ షో లో ముసుగు తొలగిస్తేనే సగటు ప్రేక్షకునికి కొత్త సినిమాని మొదటి రోజే వీక్షించే అవకాశం మళ్ళీ వస్తుంది. సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వలేని సినిమా పది రోజుల్లో 1000 కోట్ల రూపాయలు వసూలు చేయడాన్ని చూస్తే “పోకిరి” సినిమాలో ఒక సీన్ గుర్తుకి వస్తోంది. “గాంధీ” సినిమా ఎవరూ చూడరు..అదే “కడప కింగ్ ” అని తీయండి 100 డేస్…200 సెంటర్స్ అనే షాయాజీ షిండే డైలాగ్.., అందుకు సరిపోయినట్టు ఉంది నేడు సినిమా రంగంలో ముదిరి పోయిన”పుష్ప”ల తీరు.. ఒక సినిమా విడుదలై సందేశాత్మక కథతో ప్రేక్షకుల నీరాజనం పొందితే ఏదైనా ప్రజా ప్రయోజనం కోసం అలాంటి సినిమాకు బెనిఫిట్ షో ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇస్తే బాగుంటుందని సినీ రంగ ప్రముఖులు, విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్న బెనిఫిట్ షో అనుమతులు కేవలం పెట్టుబడి రాబట్టుకోవడానికి మాత్రమే అన్నట్టు ఉందని అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి అటు సినీ రంగం ఇటు ప్రభుత్వాలు పంథా మార్చుకుంటాయని వేచి చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *