సామాజిక మాధ్యమం… అదే “సోషల్ మీడియా”… వెర్రితలలు వేస్తున్న నీచ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం. అందుకు దాన్ని పెంచి పోషిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత యూ ట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ఎక్స్ వంటి మధ్యమాలదే పూర్తీ బాధ్యత అని నిస్సందేహంగా చెప్పాలి. ఎక్కడెక్కడి నుంచో నెట్టింట (ఇంటర్ నెట్) పుట్టుకు వస్తున్న “పోర్న్” (బూతు) వీడియోలను కట్టడి చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దేశ సంస్కృతిని మంట గలిపే స్థాయిలో “రీల్స్” పేరిట ఉన్నది లేనట్టు, ఉన్నది ఉన్నట్టు (అసభ్య చిత్రాలు) యూ ట్యూబ్, ఫేస్ బుక్ లలో దర్శనం ఇస్తుంటే దానిపై దృష్టి సారించక పోవడం పాలకుల వైఫల్యమే. అత్యంత ఆదరణ ఉన్న యూ ట్యూబ్ ఛానల్ లో ఒక పోస్ట్ అప్ లోడ్ చేసే ముందు అది అడిగే (పాప్ అప్) “అడాల్ట్స్” (పెద్దలకి), కిడ్స్(పిల్లలకి) అనే నిబంధన వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ఎవరైనా అసభ్యకర పోస్టులు చేస్తూ కిడ్స్ అనే ఆప్షన్ ఎంచుకుంటే చాలు సదరు యూ ట్యూబ్ నిర్వాహకుల నుంచి ఎలాంటి సమస్య రాదు. విపరీతంగా వైరల్ అవుతుంటాయి. అదే సమాచార వార్తలను పోస్టు చేసే క్రమంలో “అడాల్ట్స్” అనే ఆప్షన్ ఎంచుకుంటే చాలు వెంటనే మీరు ” యూ ట్యూబ్ కమ్యూనిటీ” నిబంధనలను ఉల్లంగించారనే సందేహం రావడం, సదరు సభ్యుడిని క్షోభకు గురి చేసే నోటిఫికేషన్లు, “స్ట్రైక్” ఇవ్వడం యూ ట్యూబ్ అధికారంగా మారింది. యూ ట్యూబ్ పరి భాషలో స్ట్రైక్ అంటే హెచ్చరిక. ఈ మాధ్యమంలో పోస్ట్ అయ్యే ప్రతీ దానికీ ఒక లెక్క ఉంటుంది అనేది దాని నిర్వాహకుల నమ్మకం.. ప్రచారం. కానీ, ఆ ఛానల్ లో దానికి తగ్గట్టు నియమ, నిబంధనలను పొందు పరచక పోవడం పెద్ద లోపం. అదే ఇప్పుడు సమస్యలకు తెర లేపుతోంది.

“ఇన్ఫ్లూయాన్సర్ (ప్రభావ శీలి), ఫాలోవర్ (అనుచరించడం) అనే పదాలకు అర్థం లేకుండా చేస్తోంది. “ప్రభావ శీలి” అంటే నాలుగు మంచి మాటలతో పది మంది మనస్సును మార్చే విధంగా, లేదంటే ఆలోచింపజేసే మాదిరిగా ఉండాలి. అదేవిధంగా “అనుచరులు” అంటే ఎదుటి వ్యక్తి తన సిద్ధాంతాలు, ప్రతిపాదనలను వివరిస్తూ పలువురిని కూడగట్టుకునే తరహాలో ఉండాలి. అప్పుడే ప్రభావ శీలి, అనుచరగణం అనే పదాల అర్థాలకు సంపూర్ణ సార్థకత లభిస్తుంది. అంతేగానీ, చేపల పులుసు, కోడి వేపుడు, పక్కింటి ఆంటీ -ఎదురింటి అంకుల్ అక్రమ బంధం, స్కూల్ పిల్లల మధ్య పిచ్చి ప్రేమ వ్యవహారం, ముసలి వాళ్ళల్లో సెక్స్ కోరికలు, కోడి గుడ్డు పట్టే తీరు, బర్రెలు, అవుల పాల పొదుగు ఎలా ఉంటుంది, బల్లుల మధ్య సంభోగం తీరు, మేకలు, కుక్కలు ఈనడం, నల్లులు పాకడం, కందిరీగలు, దోమలు కుట్టడం, పరుగెత్తే రైలు, బస్సు, కారు నుంచి దూకితే భలేగా ఉంటుంది, స్వీట్లు , కారం, మసాల రుచులు… ఇలా ఒక్కటేమిటి ప్రతి అంశాన్ని అసాధారణంగా, అర్థం పర్థం లేకుండా జనం పైకి వదులుతున్న చిత్రాలకు “రీల్స్” ముసుగు వేసి సామాజిక మాధ్యమాలు చోధ్యం చూస్తున్నాయి. సమాజ శ్రేయస్సును ఎంత మాత్రం ఆలోచించకుండా దిశ , నిర్దేశం లేని వీడియోలను ఇష్టానుసారంగా గాలి (నెట్) లోకి వదలడం యూ ట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్ లకు సొంతంగా మారింది. ఈ రోజు యూ ట్యూబ్ లో సందర్శకుల (వ్యూస్) సంఖ్య పెరుగుతోందంటే దానికి అది అదుపు లేకుండా విస్తరింపజేస్తున్న “సొల్లు పురాణం, బూతు వీడియో”లు మాత్రమే ప్రధాన కారణం. మన దేశంలో ఊహలకు అందని నీచమైన సంస్కృతితో కూడిన సమాచారాన్ని నెట్టింట వైరల్ కావడం నిజంగా క్షమించరాని తప్పిదం. పోస్ట్ చేస్తున్న వారి వివరాలు, వాళ్ళ విశ్వసనీయత ఇవేవీ పరిగణనలోకి తీసుకోకపోవడం సమస్యకు మూలం. యూ ట్యూబ్ ఒక్కటే కాదు… ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, ఎక్స్ ఇలా ప్రతీ మాధ్యమంలలో గాడి తప్పిన, సందేహం లేని అనేక వీడియోలు, కంటెంట్ లు నిత్యం దర్శనం ఇస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.

ఇక అసలువిషయానికి వస్తే ప్రత్యేకించి భిన్న సంస్కృతుల మధ్య శోభిల్లుతున్న భారత దేశంలో సామాజిక మాధ్యమాల్లో విస్తరిస్తున్న విషపు సాంస్కృతిక ధోరణి ఆందోళనకు గురి చేస్తోంది. ఈ పాపంలో వ్యాపార వేత్తలు, రాజకీయ పార్టీలు భాగం పంచుకోవడం మహా దుర్మార్గం. ఒక్కొక్క రాజకీయ పార్టీ కోట్ల రూపాయలు వెచ్చించి సామాజిక మాధ్యమాలను తమ స్వలాభం కోసం యదేశ్చగా వాడుకుంటున్నాయి. ఏది నిజమైన వీడియోనో, ఏది మార్ఫింగ్ చేసిందో కూడా గుర్తించని విధంగా పోస్టింగులు వైరల్ కావడం నిజంగా వ్యక్తిగత స్వాతంత్ర్యానికి భంగమే. సినిమా నటులు మొదలు రాజకీయ నాయకులు, కొందరు సామాజిక, ఆర్థిక ప్రముఖులు సోషల్ మీడియా కోరల్లో చిక్కుకుంటున్నారు. అంబానీ కుమారుని నుంచి ఆదివాసీ అమాయకులనూ ఈ విపరీత ధోరణి వెంటాడుతూనే ఉందనేది బహిరంగ సమస్య. అయినా, కట్టడి చేసే దమ్మూ, దైర్యం ఏ ఒక్క నేతలో కనిపించక పోవడం విచారకరం.

ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలోనే కాదు తన మనుగడ కోసం నిత్యం సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేయడం కనిపిస్తోంది. ఒక్కొక్క పార్టీ తనకున్న ఆర్థిక, జన బలంతో వందల సంఖ్యలో సామాజిక మధ్యమ ఖాతాలను తెరిచి,తమ అనుయాయులతో అస్తవాలను వక్రీకరిస్తూ, ఆర్ఫింగ్ తో అసభ్య చిత్రాలను జత చేస్తూ అమాయక జనం నమ్మే విధంగా సోషల్ మార్కెటింగ్ కి ఒడి గడుతున్నాయి. కొన్ని పార్టీలు మీడియాలో పనిచేసిన, చేస్తున్న వారిని గుర్తించి ఆడియో, వీడియో టూల్స్ సమకూరుస్తూ సోషల్ మీడియా గ్రూపులను ఏర్పాటు చేయిస్తున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా ప్రత్యర్ధులపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు గుప్పించడం వీటి ఏకైక లక్ష్యం. ఎవరైనా స్నేహితులతో ఛాటింగ్ చేయడానికి యాప్ ఓపెన్ చేస్తే చాలు హోం పేజీలో రాజకీయాల రచ్చ, చేపల పులుసు వాసన, “అప్పుడు బట్టలు తీసేస్తే”.. అనే వీడియోలు, బూతు పురాణం తప్ప మరొకటి దర్శనం ఇవ్వడం లేదనడానికి నెట్టిల్లే సాక్ష్యం.

ఈ తంతు కొన్ని సందర్భాల్లో శృతి మించినా, ఎంతో మంది బలైనా కేంద్ర ప్రభుత్వం గానీ, ఆయా సామాజిక మాధ్యమాలు గానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం విచారకరం. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న కొన్ని అసాధారణ, వెర్రి వీడియోల మూలంగా ప్రపంచం నలుమూలలా ఘోరమైన నేరాలు జరుగుతున్నాయి. అలాంటి వీడియోలను అనుసరించే అనేక మంది దొంగలు, హంతకులుగా మారుతున్నారు. యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూసి మహిళలను, ఆడబిడ్డలను హింసిస్తున్నా, సాటి మనిషిని చంపి ముక్కలు చెక్కలు చేస్తున్నా, నీరు, నిప్పుతో ఆటలాడినా, రైళ్ల వెంట వెర్రి సాహసాలు చేసి ప్రాణాలు కోల్పోయినా వీటన్నింటికీ సామాజిక మాధ్యమాలు విధిగా బాధ్యత వహించాలి. ఎందుకంటే అలాంటి ఒక్క వీడియో వేల మందిని ఇట్టే ప్రభావితం చేసి వాటిలో ఉన్న వింత చేష్టలను అనుకరించేలా పురిగొల్పుతున్నాయి. ఇలాంటి ప్రయత్నాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇక, ఆధ్యాత్మిక సూక్తులు చెప్పే ప్రవచకుల పక్కనే అసభ్యకరమైన రీల్స్ చోటు చేసుకోవడం మరో వింత. దేవతల పరిణయం గురించిన ప్రవచనం విందామంటే, శోభనం రాత్రి రాసలీలలు ఎలా ఉంటాయో చూడండి అంటూ ఆ పక్కనే రొమాంటిక్ చిత్రం ఉంటుంది. తాము రూపొందించిన కమ్యూనిటీ నిబంధనలు పాటించని ఛానళ్ళు, వీడియోలను ఏటా లక్షల సంఖ్యలో తొలగిస్తున్నామని యూ ట్యూబ్ నిర్వాహకులు చెబుతున్నా ఆ తొలగింపు పూర్తీ అయ్యే లోపు అపార నష్టం జరిగిపోతోంది.

ప్రభావశీలి అనే వాళ్ళలో లౌకిక జ్ఞానం, సామాజిక స్పృహ చాలా ముఖ్యం. ఆ, ఈ, ఊ లు తెలియని వాళ్ళు, సమాజ శ్రేయస్సు పట్టని కొందరు మెదడులో తోచింది, నరం లేని నాలుకకు అందిన మాటలకు “క్రియేటివ్ ఐడియా” అనే అపోహతో తలాతోకా లేని రీల్స్ చేసి మాధ్యమాల్లో చొప్పించడం వాటికి వచ్చి లైక్ లు, ఫాలోయింగ్ లు చూసి పెట్రేగి పోవడం సమస్యను జటిలం చేస్తోంది. వివిధ రంగాలోని నిపుణులు తమ అనుభవాలను రంగరించి ఇతరుల బాగు కోసం ప్రయత్నింస్తే వారిని ప్రభావ శీలురుగా అంగీకరించడంలో తప్పులేదు. కానీ, సమాజాన్ని మంచి మాటలతో ప్రభావితం చేసే బదులు యువతను తప్పుదోవ పట్టించేందుకు చేతిలో సెల్ ఫోన్ ఉపయోగించడం విచారకరం. నడిరోడ్డుపై కళ్ళ ముందే ఘోరాలు జరుగుతుంటే వాటిని అడ్డుకోవలసింది పోయి నింపాదిగా చిత్రీకరించే నీచపు దృశ్యాలు కోకొల్లలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ల వల్ల మాట్లాడే హక్కు , భావ వ్యక్తీకణ వంటి రాజ్యాంగ నిబంధనలకు అర్థం లేకుండా పోతోంది. ఆయా మాధ్యమ సంస్థలు ఇప్పటికైనా తమ సామాజిక నిబంధనలో (కమ్యూనిటీ గైడ్ లైన్స్) సమగ్ర మార్పు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుబాటులోకి వస్తున్న ఆర్ట్ ఫీషియల్ ఇంటలిజెన్స్ (ఎ ఐ) టూల్స్ సహకారంతో అసభ్యకర వీడియోలను ప్రచారం లోకి వెళ్ళకముందే కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తే ఎంతోకొంత ప్రయోజనం ఉంటుందనే సూచనలు కూడా వస్తున్నాయి.