“దాశరథి”గా మారిన “చేగువేరా”…!

pitapur c

తెలుగునాట అత్యంత ప్రాబల్యం ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం పై నటులు, జనసేన నేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు దారి తీశాయి. నలభై ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని మొన్నటి ఎన్నికల్లో గెలిపించింది “సేన” అంటూ పిఠాపురంలో పవన్ సాగించిన ప్రసంగం టిడిపి శ్రేణుల్లో అసంతృప్తి రేకెత్తించింది. గత ఎన్నికల్లో కౌంటింగ్ రోజు వరకూ పిఠాపురంలోనే గెలవడం కష్టతరం అనే సందిగ్ధంలో ఉన్న పవన్, ఆయన పార్టీ పోటీ చేసిన 21 శాసన సభ స్థానాలను, రెండు పార్లమెంటు నియోజక వర్గాలను గెలవడం తన సొంత బలంగా భావించడాన్ని టిడిపి నేతలు భరించలేక పోతున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ఫలితంగా ప్రజల్లో  పెల్లుబుకిన సానుభూతి ఒక్కటే వైసిపి గద్దె దిగడానికి కారణమని, పొత్తులో భాగంగానే జనసేన గెలుపు సాధ్యమైందని టిడిపి సీనియర్ నాయకులూ, కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 1983 తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులను బట్టి రెండే రెండు పార్టీలు బలమైనవి. ఒకటి కాంగ్రెస్, రెండవది తెలుగుదేశం పార్టీ మాత్రమే అనేది జగమెరిగిన సత్యం. ఈ నాలుగు దశాబ్దాల్లో ఎన్ని రకాల పార్టీలు పుట్టుకు వచ్చి కనుమరుగు అయ్యాయో రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు. అందుకు మెగాస్టార్ చిరంజీవి స్థాపించి, అనతి కాలంలోనే జాడ లేకుండా పోయిన “ప్రజారాజ్యం” పార్టీ చక్కటి ఉదాహరణ. ప్రాంతీయ పార్టీ అంటే సొంత బలం ఉండాలి. ఒక సిద్ధాంతం, లక్ష్యం దాని సొంతం కావాలి. తెలుగు నాట  తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, తమిళుల్లో డిఎంకె, ఐఎడిఎంకే, బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెసు, ఉత్తర ప్రదేశ్ సమాజ్ వాదీ, మహారాష్ట్రలో శివసేన, బీహార్ ఆర్జేడీ, జార్ఖండ్ ముక్తి  మోర్చ, అస్సాం గణ పరిషత్, గోమంతక్ వాది, ఢిల్లీ ఆమ్ ఆద్మీ ఇలా ఆయా ప్రాంత పార్టీలు ఒక్కొక్క లక్ష్యాన్ని ఎజెండాగా చూపుతూ రాజకీయాల్లో ఉనికి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కానీ, 2014లో విప్లవ వీరుడు “చేగువేరా” ఆదర్శం అంటూ ప్రభుత్వాలపై తిరుగుబాటు ఒక్కటే ఎజెండాగా చూపి బిగిసిన పిడికిలి నుంచి పుట్టుకు వచ్చిన జనసేన పార్టీ దశాబ్దం తిరగగానే ఆ పిడికిలి గుప్పిట విప్పి, “సనాతన పంచ కట్టు” లోకి జారుకుంది.

pithapuram in

చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నేతలను కలవడంతో పవన్ కల్యాణ్ వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. పోరాట లక్ష్యం నుంచి సనాతన ఎత్తుగడ భుజాన వేసుకోవడమే ప్రత్యక్ష నిదర్శంగా చూపుతున్నారు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఆ పార్టీ అధికారంలోకి రావడానికి జానసేన కారణం అన్న మాట పసుపు దళానికి ఒంట పట్టడం లేదు. తూర్పున ఉన్న మూడు, నాలుగు జిల్లాల్లో గాలివాటానికి గెలుసుకున్న సీట్లను చూసి జనసేన ఎగసి పడడం సమంజసం కాదని టిడిపి వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కాదన్నా బిజెపి అండగా ఉందన్న భావనలో పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టు పరిశీలకుల అంచనా. మొన్న పిఠాపురంలో జరిగిన సేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ ప్రసంగాన్ని నిశ్చితంగా పరిశీలించిన రాజకీయ పక్షాలూ లేకపోలేదు. అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందని వేచి చూశారు. కానీ, తన పార్టీ లక్ష్యాల కంటే, బిజెపి వ్యూహాలకు వంత పలికినట్టు కనిపించింది. తమిళనాడులో త్రి భాష సమస్య పై మాట్లాడిన తీరు భాజపా సంధించిన అస్త్రంగా కనిపించింది. అంతేకాదు, చేగువేరా ప్రస్తావన బదులు దాశరథి రచనలకు ప్రభావితుడు అయినట్టు పవన్ చెప్పుకురావడం గమనార్హం. అందుకే దాశరథి రచన “రుద్రవీణ”ను దృష్టిలో పెట్టుకొని రుద్రవీణ మోగిస్తా అంటూ చెప్పుకొచ్చారు.

tamil tour

“పిడికిలి” మరచిన “పంచెకట్టు”…!

ఇక,మొన్నటి ఎన్నికల్లో కూటమి గుంపులో గెలుపు సాధ్యం అయిందన్న వాస్తవ పరిస్థితిని పసిగట్టిన పవన్ అధికారంలో ఉన్నప్పుడే ఈ అవకాశాన్ని ఆయుధంగా మలచుకుంటున్నారు. అందులో భాగంగానే ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు , ఎంపి సీట్లు తన బలంగా ప్రచారం చేయడానికి వ్యూహ రచన చేశారు. దీన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే సభలో నలభై ఏళ్ల టిడిపిని సేన గెలిపించిందంటూ బహిరంగ వ్యాఖ్యలకు తెర లేపారు. అటు నాగబాబు టిడిపి నేత వర్మ పై పరోక్షంగా విరుసుకుపడ్డ తీరు రాజకీయంగా రచ్చకు దారితీసింది. అన్నదమ్ముల వ్యాఖ్యలపై వైసిపి, తెలుగుదేశం పార్టీల నేతలు రకరకాల వాదనలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ గతంలో మంత్రివర్గ సమావేశాలకు హాజరు కాకపోవడం, పిఠాపురం సభలో  తెలుగుదేశం పార్టీ గెలుపుపై చేసిన వ్యాఖ్యల విషయంలో రాజకీయ చాణక్యుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికర అంశం. “సరైన సమయంలో సరైన నిర్ణయం” అంటూ ముందుకు వెళ్ళే చంద్రబాబు “యూ టర్న్” లను ఎంచుకున్న జనసేన పట్ల ఎలాంటి వ్యూహం రూపొందిస్తారో చూడడానికి ఇంకా కొంత సమయం పడుతుంది.

పవన్‌కల్యాణ్ బహు భాష వ్యాఖ్యలను  తమిళనాడులో డీఎంకే, టీవీకే పార్టీ దుయ్యబట్టాయి. మా వైఖరిని పవన్‌ తప్పుగా అర్థం చేసుకున్నారని, ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదని అదే సందర్భంలో  తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని డిఎంకె చెప్పింది. హిందీపై కేంద్రం తీరును మేం వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేసింది. అదేవిధంగా  ఐవికే పార్టీ అధ్యక్షులు విజయ్ పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జనసేన  ఆవిర్భావ సభ  ఎజెండా బీజేపీది లా ఉందని వ్యాఖ్యానించారు.  ఇతర రాష్ట్రాల భాషాల పై మాకు గౌరవం ఉంది. అలా అని భాషని మాపై రుద్దాలని చూడటం సరికాదు. మన తమిళ, తెలుగు మలయాళ భాషలను  ఆయా హిందీ భాషలు ఉన్న రాష్ట్రంలో 3 భాషగా పరిగణిస్తారా  అని విజయ్ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *