“రాజా” పోసాని, రాజకీయాలు అంటే వెండితెరపై నటన అనుకున్నారా, కానే కాదు, సినిమాల్లో దర్శకుడు చెప్పినట్టు చేస్తే “నటన” పండుతుంది, కళామతల్లి కరుణిస్తుంది, నలుగురి మెప్పు దక్కుతుంది. కానీ, రాజకీయాల్లో నటిస్తే “పాపం” పండుతుంది. అధికార పక్షం ఆడుకుంటుంది. అందుకే రాజకీయాల్లో మాత్రం సొంత తెలివి అవసరం. ఏమి చేయాలో ఆలోచించాలి, రాసుకోవాలి, అమలు చేయాలి ఇవీ రాజకీయ నాయకుల లక్షణాలు. ఇతరుల స్క్రిప్ట్ ని అనుసరిస్తూ, “రాజకీయ దర్శకుల” సూచనలు పాటిస్తూ నటిస్తే ఇలాగే జైలు ఊసలు లెక్కబెట్టాలి. రాజకీయాల్లో నటించే ప్రయత్నం చేస్తే నలిగి పోతారు అనడానికి మీ రిమాండ్ రిపోర్ట్ ఒక ఉదాహరణ. ఒకప్పుడు ఒక పార్టీ వారు మరో పార్టీ వారి పై ఆరోపణలు చేసినా, దూషించినా వాద, ప్రతివాదనలతో సమసిపోయేవి. కానీ, మారుతున్న రోజులతో పాటు నేతల ఆలోచనలు కూడా కక్ష సాధింపు దిశ ఎంచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి అధికారం చేపట్టాక వైసిపి నేతలు కార్యకర్తలు తమ వారిని వెంటాడి, వేధించారని తెలుగుదేశం బలమైన ఆరోపణలు చేసింది. అందుకు చంద్రబాబు నాయుడు అరెస్టును ప్రధానంగా చూపింది. ఒక దశలో నిలకడగా ఉన్న జనసేన నాయకులు సైతం వైకాపా పై గుర్రుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో చేరాక కొన్ని జిల్లాల్లో సేన, వైసీపీ వర్గాల మధ్య ప్రతీకారాలు భగ్గుమంటున్నాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు తెలుగుదేశం, జనసేన పార్టీ వర్గాల్లో పంతం పెరగడానికి కారణం అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

అయితే, ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి అరెస్టుతో వైకాపా హయంలో తెర వెనుక భాగోతం బయట పడడం విశేషం. పోసాని మాటల్ని బట్టి అధికారాన్ని ఎరగా చూపి ఒక మంచి సినీ నటుడితో “రాజకీయ వేషాలు” వేయించం జగన్ ప్రభుత్వానికే దక్కిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతీసారి విలేకరుల సమావేశానికి ముందు అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్క్రిప్టు పంపేవారని, ఆయన అనుమతి, సూచనల మేరకే నారా లోకేష్, పవన్ కల్యాణ్ లను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినట్టు పోసాని వెల్లడించడం సిగ్గుచేటు వ్యవహారం. తన వ్యాఖ్యలను వైకాపా సోషల్ మీడియా కన్వీనర్ భార్గవ్ రెడ్డి పార్టీ అనుబంధ మీడియాలో వైరల్ చేసే వారని పోసాని పోలీసులకు పూసగుచ్చినట్టు చెప్పడం గమనార్హం. సజ్జల ప్రోద్బలం మేరకే కులాల మధ్య చిచ్చు పెట్టడం, తద్వారా ఘర్షణల రాజుకునేలా కుట్రపూరిత వ్యాఖ్యలు చేసినట్టు కూడా అన్నమయ్య జిల్లా ఓబులా పురం పోలీసుల ముందు పోసాని అంగీకరించినట్టు కోర్టుకి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నమోదు చేశారు.
దర్శకుడు ఎవరు?
అయితే, పోసాని సమావేశాలకు సజ్జల రామకృష్ణా రెడ్డి మాటలు రాస్తే, దర్శకునిగా ఎవరు వ్యవహరించారనేది సామన్యుల్లో తలెత్తుతున్న ప్రశ్న. కథల్లో సాధారణంగా “ఘోస్ట్ రైటర్” లు ఉంటారు, కానీ ఇక్కడ “ఘోస్ట్ డెరైక్టర్” ఎవరనేది ఆసక్తిగా మారింది. పోసాని అరెస్టుని సమర్థించుకోవాలంటే పోలీసులు తప్పనిసరి తెర వెనుక దర్శకుని వివరాలు తెలుసుకోవలసి ఉంటుంది. ఆ కోణంలో పోలీసులు ఎలా ముందుకు వెళ్తారో వేచి చూడాలి.