తెలంగాణ ప్రజలకు ఉద్యమ ముసుగు వేసి పదేళ్ల పాటు అరాచక పాలన సాగించారు. మడకశిర కుటుంబం దుబాయ్ లోని “బుర్జ్ ఖలీఫా” శిఖరానికి ఎదిగింది. నీటి పేరు చెప్పి, కార్ల రేసులు చూపి, మద్యం మత్తు ఎక్కించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. అవినీతి,అక్రమాలకు పోలీసులనే దొంగల ముఠాగా మార్చారు… ఇవీ ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి (భారాస) పై బహిరంగంగా వెల్లువెత్తిన ఆరోపణలు, పదేళ్ళూ తెర వెనుక జరిగిన వాస్తవాలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ఎన్నికల వరకు నిజంగా సామాన్యులకు ఒరిగింది ఏమీ లేదు. ఎన్నికల ప్రచారంలో విస్తరించిన ఈ ఒక్క కారణమే గత ఎన్నికల్లో భారాసని తెలంగాణ ప్రజానీకం ఇక చాలులే పొమ్మంది. అయితే, ఇదే సందర్భంలో మీరే అదుకోవాలంటూ జాతీయ పార్టీ కాంగ్రెస్ కు జేజేలు కొట్టింది. ఒంటెత్తు పోకడల “దొర”ని రాత్రికి రాత్రే నగరంలోని ప్రగతి భవన్ గడి నుంచి మడకశిర ఫాం హౌస్ కి పారద్రోలింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీలను ఇట్టే నమ్మారు తెలంగాణ జనం. అందుకు తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా భవన్ శృంఖలాలు చేరిపి వేసింది. అంచలంచెలుగా తన హామీల నెరవేర్పునకు శ్రీకారం చుట్టింది. అదే సందర్భంలో రేవంత్ ప్రభుత్వం భారాస నేతల అవినీతి, నిరంకుశ భాగోతాలను రచ్చకీడ్చే చర్యలను చేపట్టింది. దీన్ని జనం ఆసక్తిగా పరికించడం మొదలు పెట్టారు. కాళేశ్వరం బ్యారేజ్ కుంగుబాటు, ఫార్ములా “ఇ రేస్” నిధుల మళ్లింపు, పోలీస్ ఇంటెలిజెన్స్ లో అధికారాల దుర్వినియోగం, ధరణి లొసుగులు ఇలా అనేక రకాల ఆరోపణలపై రేవంత్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వ దూకుడు చూసి భారాస కీలక నేతలు రేపో, మాపో జైలు ఊసలు లెక్కబెట్టడం ఖాయం అనే రీతిలో తెలంగాణ సమాజంలో ఉత్కంఠ రేగింది.

ఏది నిజం…!
కానీ, భారాస నేతలు మాత్రం తమ తప్పిదాలను పక్కన పెట్టి రేవంత్ ప్రభుత్వం పై పోరాటమే లక్ష్యంగా వ్యూహరచన చేయడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి నిలదీత కార్యక్రమాలకు పూనుకోవడం భారాస ఎంచుకున్న ఎత్తుగడల్లో ప్రధానమైంది. ప్రతిపక్షమే అయినప్పటికీ, ప్రతిపక్ష నేత శాసన సభలో కనిపించనప్పటికీ అధికార పార్టీపై తొట్ట తొలినాటి నుంచి ముప్పేట దాడికి దిగడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కోసం అప్పటి అధికార పార్టీపై ప్రతీ అంశంలో విభేదించిన తరహా లోనే ప్రస్తుత ప్రభుత్వం పై కూడా విరుసుకు పడడం భారాస వైపు నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం తమ నేతలపై కేసులు నమోదు చేస్తూ, నోటీసులు జారీ చేస్తున్నా భారాస నేతలు జనాన్ని పోగు చేసి ప్రభుత్వంతో జగడానికి దిగడం ఏడాది కాలంగా అధికమైంది. అధినేత కెసిఆర్ అడపాదడపా ప్రభుత్వంపై అవాకూచవకులు విసురుతున్నా, కేటీఆర్, హరీష్ రావులు మాత్రం ప్రతిరోజూ ఏదో ఒక ఎజెండాతో ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్న ఆరోపణలను పదేళ్ల అధికార అనుభవంతో తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే భారాస అన్ని రకాలుగా బలమైన దళాన్ని ఏర్పాటు చేసుకుంది. పులి-మేక ఆట మాదిరిగా ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న కేసులు, నోటీసుల నుంచి తప్పించుకోవడానికి నిపుణులైన లాయర్లతో వాదనలు వినిపిస్తోంది. ఈ వ్యూహమే కేటీఆర్, హరీష్ లకు కోర్టుల నుంచి ఊరట లభిస్తోంది. రెండు నెలల కిందట కేటీఆర్ అరెస్టు ఖాయం అనే వాదనలు బలంగా వినిపించాయి. విచారణ అధికారుల తీరు కూడా అదే స్థాయిలో ఉంది. భారాస నేతలు కూడా కొంత ఆందోళనగా కనిపించారు. అందుకే, అప్పటి వరకు తెర వెనుక ఉన్న కవితను తిరిగి జనంలోకి పంపారనే రచ్చబండ చర్చలూ గుప్పుమన్నాయి. కానీ, అరెస్టు ఏమోగానీ, విచారణ కూడా ఒక్కసారిగా అటకెక్కింది.

సాధారణంగా ఎన్నికల్లో ఓడిన అధికార పార్టీ విపక్షం స్థానంలోకి వెళ్లిందంటే అది తిరిగి మూడేళ్ల తర్వాత గానీ, లేక మళ్ళీ ఎన్నికల ముందు గానీ ప్రజల్లోకి వెళ్ళడం గతంలో చూశాం. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రాజశేఖర్ రెడ్డి మాత్రమే నిరంతర పోరాటం చేశారనేది జగమెరిగిన వాస్తవం. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ప్రతిపక్ష స్థానంలో ఉండి, మొదటి నుంచీ అధికార పార్టీపై కత్తులు దూసిన సందర్భాలు లేనేది సత్యం. కానీ, తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. పదేళ్ల పాలనలో మూటగట్టుకున్న అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికో, మేము చేయలేదని జనానికి వివరించడానికో తెలియదుగానీ భారాస మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేక నిర్ణయాల్లో నిలదీసే ఎజెండాను ఎత్తుకుంది. రేవంత్ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చిన ఇంటెలిజెన్స్ ముఠా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వాస్తవానికి చాలా తీవ్రమైనది. భారాస తన ఉనికిని కాపాడుకోవడానికి ఈ ముఠాను ఏర్పాటు చేసిందనేది దేశం నలుమూలలా కోడై కూసింది. ఒక సందర్భంలో భారాస అగ్రనేతల్లో సైతం బెదురు కనిపించింది. కానీ, ఆ కేసు ఇప్పటికీ ఎటూ తేలలేదు.
ఇవి మాత్రమే కాదు, హాస్టళ్ల అన్నంలో ముక్క పురుగు కనిపించినా, ఆసుపత్రుల్లో నవజాత శిశు మరణాలు జరిగినా, అసెంబ్లీలో పూలే విగ్రహం లేకపోయినా, లాయర్లు హత్యకు గురైనా, కాల్పులు జరిగినా, వరదల్లో నష్టం వాటిల్లినా, లగచర్ల గ్రామంలో అల్లరి మూకలు అధికారులపై దాడులు చేసినా, ఉచిత బస్సుల్లో మహిళలు ఎల్లిగడ్డల పొట్టు తీసినా… ఇలా ఒకటేంటి ప్రతీ అంశాన్ని ఎజెండాగా తీసుకొని భారాస నిత్యం వార్తా కథనాల్లో కనిపించడం 16 నెలలుగా చూస్తునే ఉన్నాం. అయితే, ఇందుకు ధీటుగా అధికార కాంగ్రెస్ పార్టీ సైతం కౌంటర్ లు ఇస్తూ రాజకీయాలను ముందుకు సాగిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోసం పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన భారాస, ప్రస్తుతం అధికారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పై దాడికి దిగుటున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భారాస నేతలపై లేవనెత్తిన ఆరోపణలకు బలం చేకూర్చే చర్యలు జరగక పోతే తెలంగాణ ఉద్యమ వ్యూహంతో గులాబీ దళం మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశోధకులు అంచనా వేస్తున్నారు.